logo

బస్సు ఆగిందా.. ప్రయాణం గోవిందా..!

విజయవాడ నగరం, సబర్బన్‌ ప్రాంతాల్లో తిరిగే సీఎన్జీ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. మరమ్మతులు చేసి రోడ్డెక్కించాలంటే ఆర్టీసీ అధికారులకు తలప్రాణం తోకకు వస్తోంది. వీటికి విడిభాగాల కొరత తీవ్రంగా వేధిస్తోంది.

Published : 18 Aug 2022 04:17 IST

విడిభాగాలు దొరక్క అవస్థలు
ఈనాడు - అమరావతి

విజయవాడ నగరం, సబర్బన్‌ ప్రాంతాల్లో తిరిగే సీఎన్జీ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. మరమ్మతులు చేసి రోడ్డెక్కించాలంటే ఆర్టీసీ అధికారులకు తలప్రాణం తోకకు వస్తోంది. వీటికి విడిభాగాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా రోజుల తరబడి గ్యారేజీలకే పరిమితం అవుతున్నాయి. దీని వల్ల సంస్థ రాబడిలో గండి పడడంతో పాటు ప్రయాణికులకూ అవస్థలు తప్పడం లేదు. దాదాపు పదేళ్ల క్రితం కొనుగోలు చేసిన ఈ మోడళ్ల తయారీ ప్రస్తుతం ఆగిపోయాయి. స్పేర్‌ పార్టులు దొరకడం లేదు.
రాష్ట్రంలో వాణిజ్య, వ్యాపార కూడలిగా ఎదిగిన బెజవాడ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో సిటీ బస్సులు కీలకం. గవర్నర్‌పేట-1, 2, ఇబ్రహీంపట్నం, విద్యాధరపురం డిపోల పరిధిలో మొత్తం 352 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో గ్యాస్‌తో నడిచేవి 215 ఉన్నాయి. 2009లో సిటీ ఆర్డినరీ, ఆతర్వాత.. 2011లో మెట్రో బస్సులను కొనుగోలు చేశారు. ఈ బస్సులు రాష్ట్రంలో మరే ప్రాంతంలో కనిపించవు. అప్పట్లో విజయవాడ నగరంలో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు సీఎన్టీ వాహనాలను ప్రవేశపెట్టారు. డీజిల్‌తో నడిచే వాటితో పోలిస్తే కాలుష్యం కనిష్ట స్థాయిలో నమోదు కావడంతో పాటు నిర్వహణ వ్యయం కూడా గణనీయంగా తగ్గుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో ఈ బస్సులను తీసుకున్నారు. రానురాను ఈ మోడళ్లు పాతవి కావడం, వీటి విడి భాగాలను ఆటోమొబైల్‌ కంపెనీలు తయారు చేయడం తగ్గించాయి. ఈ ప్రభావం సర్వీసులపై పడుతోంది. గ్యాస్‌ ఇంజక్షన్‌ వ్యవస్థలో ఉండే విడిభాగాలు అవసరం అవుతుంటాయి. ఆర్డర్‌ పెడుతున్న దాంట్లో సగమే ఆర్టీసీకి సరఫరాదారులు అందించగలుగుతున్నారు. అవి కూడా ఎక్కువ రోజులు నిరీక్షించిన తర్వాతే వస్తున్నాయి. కొవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత సమస్య మరింత పెరిగింది.

పూర్తి స్థాయిలో తిప్పలేక..
విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం, గవర్నర్‌పేట - 2 డిపోల్లోనే సీఎన్జీ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు రోడ్లపై కూడా ఎక్కువగా ఆగిపోతున్నాయి. ఒకసారి మరమ్మతులకు గురైతే కనీసం 5 రోజులకు తిరగని పరిస్థితి నెలకొంది. ఎక్కువ రోజులు షెడ్డుకే పరిమితం కావాల్సి వస్తోంది. సిటీ రీజియన్‌లోని మొత్తం బస్సుల్లో ఈ తరహావి దాదాపు 61 శాతం వరకు ఉన్నాయి. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా పూర్తి స్థాయిలో నడపలేని పరిస్థితి నెలకొంది. చేసేది లేక అధికారులు ట్రిప్పులను రద్దు చేయడమో, కుదించడమో చేస్తున్నారు. ఇటీవల ఆరు బస్సులు మొరాయించాయి. వీటికి విడిభాగాలు వచ్చి, తిరిగి మరమ్మతులు చేసే సరికి వారం రోజులు పట్టింది. నగరంలోని పలు సార్లు రోడ్లపైనే హఠాత్తుగా బస్సులు ఆగిపోతున్నాయి.

అద్దె బస్సులు తీసుకుందామన్నా..
సీఎన్జీ బస్సులను పూర్తిగా తీసేయాలన్నా తొలగించలేని పరిస్థితి. పెద్ద సంఖ్యలో ఉన్న వాటికి ప్రత్యామ్నాయం చూడాలన్నా సంస్థకు ఆర్థికంగా భారమే. వీటి స్థానంలో అద్దె బస్సులను నడుపుదామనుకున్నా.. పరిస్థితులు అనుకూలించడం లేదు. టెండర్లు పిలుస్తున్నా.. పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఎక్కువ దూరం నడిస్తేనే అద్దె బస్సుల యజమానులకు గిట్టుబాటు అవుతుంది. సిటీ బస్సులకు స్టాప్‌లు ఎక్కువ ఉండడం, దూరం పెద్దగా లేకపోవడం వల్ల ముందుకురావడం లేదు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యల కారణంగా ఇవి ఆలస్యంగా నడుస్తుంటాయి. ఈ ప్రభావం ట్రిప్పుల సమయాలపై పడుతుందని ఆసక్తి చూపడం లేదు. పైగా నగరంలో అద్దె బస్సుల డ్రైవర్లకు తీవ్ర కొరత వేధిస్తోంది. వీటన్నింటి కారణంగా ఆర్టీసీ ప్రయత్నాలు ఫలించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని