logo

టిడ్కో..పేదలను బాదుకో!

‘మీకు టిడ్కో ఇంటికి గృహనిర్మాణ రుణం మంజూరు చేశాం. వాయిదాలు (ఈఎంఐ) లెక్కించడానికి ఇంకా ఏడాది పడుతుంది. ముందు మీరు వడ్డీ కట్టాల్సి ఉంది. వెంటనే వడ్డీ కట్టాలి. లేకపోతే ఇబ్బంది పడతారు..!’ గుడివాడలోని టిడ్కో లబ్ధిదారులకు

Published : 19 Aug 2022 04:53 IST

ఇళ్లు స్వాధీనం చేయకుండానే వసూలు

ఈనాడు, అమరావతి

గుడివాడలో నిర్మాణం పూర్తయిన ఇళ్లు

‘మీకు టిడ్కో ఇంటికి గృహనిర్మాణ రుణం మంజూరు చేశాం. వాయిదాలు (ఈఎంఐ) లెక్కించడానికి ఇంకా ఏడాది పడుతుంది. ముందు మీరు వడ్డీ కట్టాల్సి ఉంది. వెంటనే వడ్డీ కట్టాలి. లేకపోతే ఇబ్బంది పడతారు..!’ గుడివాడలోని టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకర్లు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారు. వడ్డీలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇక్కడ కనిపించే రశీదు లబ్ధిదారుడు రూ.1720 వడ్డీ చెల్లించారు. తన పేరు బయటకు వస్తే.. వైకాపా నేతలు తన గృహాన్ని ఎక్కడ రద్దు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు.

బ్యాంకులు రుణం మంజూరు చేసిన రెండేళ్ల తర్వాత లేదా.. ఇంటిని లబ్ధిదారుడిని స్వాధీనం చేసిన తర్వాత మాత్రమే రుణానికి సంబంధించిన ఈఎంఐలు వసూలు చేయాలి. ముందుగా వసూలు చేసే హక్కు బ్యాంకులకు లేదు..! ఈ విషయాన్ని లబ్దిదారులు ఆయా పురపాలక కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లాలి’ - టిడ్కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు చిన్నోడు

పట్టణ మౌలిక వసతుల అభివృద్ది సంస్థ నిర్మిస్తున్న ఇళ్లు లబ్ధిదారులకు భారంగా మారాయి. ఇంటిని స్వాధీనం చేయకుండానే బ్యాంకులు వాయిదాలు కట్టమని ఒత్తిడి చేస్తున్నాయి. రుణం మంజూరైన నుంచి లెక్కించి వడ్డీ కట్టాలని తాఖీదులు ఇస్తూ వసూలు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు రూ.150కోట్ల వడ్డీ భారం లబ్ధిదారులపై పడింది.

రుణం ఇవ్వకున్నా.. జిల్లాలో మూడు రకాల గృహాలను 300, 365, 430 చ.అ.విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లు నిర్మాణం అవుతున్నాయి. ప్రస్తుతం 19,376 పూర్తి చేస్తున్నారు. మొదటి రకానికి కేంద్రం, రాష్ట్రం రూ.3లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. రెండో రకానికి రూ.25వేలు, మూడో రకానికి రూ.50వేలు లబ్ధిదారుని వాటా నిర్ణయించారు. బ్యాంకు రుణం రూ.3.15లక్షలు, రూ.3.65 లక్షలు చొప్పున మంజూరు చేయాలని నిర్ణయించారు. దీనికి అదనంగా కేంద్రం నుంచి రూ.1.50లక్షలు ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన కింద అందుతుంది. రాష్ట్రం నుంచి అంతే మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. విజయవాడ నగరంలో 5424, గుడివాడలో 7328 గృహాలను నిర్మాణం చేస్తున్నారు. గుడివాడలో 100శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లు 3296 ఉన్నాయి. మరో 5,516 ఇళ్లు 75శాతం పూర్తి అయ్యాయి. జిల్లాలో బ్యాంకులు మొత్తం రూ.679.70కోట్లు రుణం అందిస్తేనే గృహాల నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటి వరకు కేవలం రూ.150కోట్లు ఇచ్చాయి. ప్రస్తుతం వీటికి వడ్డీ వసూలు చేయడం చర్చనీయాంశమైంది.

ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో విజయవాడలో 349, జగ్గయ్యపేటలో 5 గృహాలను రిజిస్ట్రేషన్‌ చేశారు. కృష్ణా జిల్లాలో గుడివాడలో 1472, మచిలీపట్నంలో 683, ఉయ్యూరులో 3 టిడ్కో గృహాలను లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. వీరందరినీ ఇప్పుడు కిస్తీలు కట్టాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి.ఒక్క గృహప్రవేశం కాలేదు. తిరువూరులో 384 గృహాలే ఉన్నాయి. వీటికి బ్యాంకులు రూ.3కోట్లు రుణాలు మంజూరు చేశాయి. కొన్ని లబ్ధిదారుల అంగీకారం మేరకు 10 సంవత్సరాలు, లేదా 15 సంవత్సరాలు గడువు విధిస్తున్నారు.

బాధ్యత ఎవరిది..!

గత రెండేళ్లుగా టిడ్కో ఇళ్లు నిర్మాణం చేయకుండా నిలిపివేశారు. 25 శాతం లోపు పూర్తిగా రద్దు చేశారు. లబ్ధిదారులు తమ వాటాగా రూ.25వేలు, రూ.50వేలు చొప్పున చెల్లించారు. ఇవి చెల్లించి ఇప్పటికే నాలుగేళ్లు గడిచాయి. వీటికి రూపాయి వడ్డీ లేదు. గట్టిగా అడిగితే ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.

గుడివాడలో లబ్ధిదారుని దగ్గర వడ్డీ వసూలు చేసిన రశీదు!,

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని