logo

ఇసుక లేదు... కాలనీ ఇళ్లు కట్టేదెలా?

సరిగ్గా.. వారం కిందట వల్లూరుపాలెం, రొయ్యూరు కేంద్రాల్లో 50 వేల టన్నుల ఇసుక నిలువలు ఉండేవి. ప్రస్తుతం శూన్యం. స్థానికులకు సరఫరా చేశారంటే అదీ లేదు. కంచికచర్ల, నందిగామ ప్రాంతం నుంచి వచ్చిన లారీలకు  ఎత్తేశారు. ఆ ప్రాంతం మనుషులే అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలకు ఇసుక లేదని చెబుతున్నారు. ఎప్పుడు  ఇస్తారో తెలియదు..!

Published : 27 Sep 2022 05:33 IST

ఈనాడు, అమరావతి

సరిగ్గా.. వారం కిందట వల్లూరుపాలెం, రొయ్యూరు కేంద్రాల్లో 50 వేల టన్నుల ఇసుక నిలువలు ఉండేవి. ప్రస్తుతం శూన్యం. స్థానికులకు సరఫరా చేశారంటే అదీ లేదు. కంచికచర్ల, నందిగామ ప్రాంతం నుంచి వచ్చిన లారీలకు  ఎత్తేశారు. ఆ ప్రాంతం మనుషులే అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలకు ఇసుక లేదని చెబుతున్నారు. ఎప్పుడు  ఇస్తారో తెలియదు..!

జిల్లాలో ఇసుక ఉపగుత్తేదారు మారిన సమయానికి కీసర నిలువ కేంద్రం వద్ద 1.28లక్షల టన్నులు,  ఇబ్రహీంపట్నం వద్ద 1.82లక్షల టన్నుల ఇసుక ఉందని అధికారులు లెక్కలు వేశారు. ఆ మేరకు నివేదిక ఇచ్చారు. వారం తిరక్కముందే అక్కడ ఇసుక గుట్టలు కరిగిపోయాయి. రాత్రుల్లోనే ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఇసుక లోడింగ్‌ చేశారు. ఎవరికి విక్రయించారు?... ఎంత విక్రయించారు..? అనేది గోప్యం. కేవలం వంద టన్నుల లోపే ఇసుక నిలువ ఉంది.

జిల్లాలో మొత్తం 58 ఇసుక రేవులు, ప్రకాశం బ్యారేజీలో ట్రెడ్జింగ్‌ ద్వారా వచ్చే ఇసుక విక్రయించేందుకు ప్రధాన గుత్తేదారునికి అవకాశం ఉంది. గత రెండు నెలలుగా కృష్ణా నదికి వరదలు వస్తున్నాయి. కొన్ని రోజులు వరద తగ్గినా మళ్లీ పెరుగుతూ వచ్చింది. దీంతో జగ్గయ్యపేట, చందర్లపాడు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, తోట్లవల్లూరు, అవనిగడ్డ, మోపిదేవి ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో అత్యంత నాణ్యమైన ఇసుక రొయ్యూరు ప్రాంతంలో లభిస్తుందని చెబుతారు. గుత్తేదారు మారినవెంటనే రొయ్యూరు, వల్లూరుపాలెం ఇసుక డంప్‌లు ఖాళీ అయ్యాయి. ఇదంతా ఎక్కడికి తరలిందనేది అధికారులకు సైతం తెలియని పరిస్థితి.

జగనన్న కాలనీల్లో ఒక ఇంటికి 20 టన్నుల ఇసుక ఉచితంగా అందించాల్సి ఉంది. ఈమేరకు గుత్తేదారుతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 40 కిలోమీటర్లలోపు ఉచితంగానే రవాణా చేయాల్సి ఉంది. ఆ పైబడితే రవాణా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణంపై అధికారులపై నిత్యం ఒత్తిడి పెరుగుతోంది. ఎలాగోలా లబ్ధిదారులను ఒప్పించి నిర్మాణం ప్రారంభించేందుకు ఇసుక లభించడం లేదు. ఉభయ జిల్లాల్లో భారీ లేఔట్లకు  ఈప్రభావం కనిపిస్తోంది. చాలామంది రేవు, నిలువ కేంద్రాల వద్దకు వాహనాలతో వెళ్లి ఖాళీగా తిరిగి వస్తున్నారు. ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ ఇంకా చేపట్టలేదు. తిరువూరు ప్రాంతం వాసులు మైలవరం, ఇబ్రహీంపట్నం వరకు వచ్చి వెళ్లాల్సి వస్తోంది. ఇసుక కొరత ఉన్న మాట వాస్తవమేనని గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీదేవి ‘ఈనాడు’తో చెప్పారు. త్వరలో పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

ఉమ్మడి జిల్లాలో

ఉపగుత్తేదారు మారే సమయానికి 8.16లక్షల టన్నుల ఇసుక నిలువలు ఉన్నట్లు నివేదించారు. అవన్నీ ఖాళీ అయ్యాయి. అంతకు ముందే ఇసుక సరఫరా నిలిపివేసి తమకు కావాల్సిన వారికి తరలించారు. ఉపగుత్తేదారు మారిన తర్వాత ఉన్న నిలువలను తరలించారు. ప్రస్తుతం ఇసుక రేవుల్లో తవ్వకాలు లేవు. జగనన్న కాలనీలకు ఇసుక సరఫరా పూర్తిగా ఆగిపోయింది. భవననిర్మాణ పనులకు ఇసుక కటకటగా మారింది. కృష్ణా నదికి వరద ప్రవాహం ఉండటంతో తవ్వకాలు జరపడం లేదు. ఇంకా ఎన్ని రోజలు ప్రతిష్టంభన కొనసాగుతుందనేది అర్థం కాని పరిస్థితి.  

ఇదీ పరిస్థితి..!

బ్రాక్స్‌స్టన్‌కు ఇసుక రీచ్‌ల విషయాలు, క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలు అందించాలని గనుల శాఖకు ఆదేశాలు అందాయి. తర్వాత ఉన్న నిలువను మాత్రం లారీల్లో తరలించేశారు. ఇప్పటి వరకు అమ్మకాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపడం లేదు. స్థానికులకు, భవన నిర్మాణ వ్యాపారులకు ఎలాంటి ఇసుక సరఫరా చేయలేదు. జగనన్న కాలనీలకు ఇసుక సరఫరా చేయడం లేదు. పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే బంధువే ఇసుక కాంట్రాక్టర్‌గా మారారు. గ్రావెల్‌ తవ్వకాలు, ఎన్టీపీఎస్‌ బూడిద తరలింపులో ఆయనకు మంచి పట్టుఉంది. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో సర్దుబాటు చేసుకుని ఇసుక తవ్వకాల బాధ్యతలు తీసుకున్నట్లు తెలిసింది. కృష్ణా జిల్లాలో ఒక నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధికి మాత్రం కొంత ఎక్కువ వాటా ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని