logo

బాధితులకు కృత్రిమ కాళ్లు అందజేత

రైలు, రోడ్డు ప్రమాదాల రూపంలో ఆ యువతను విధి వక్రీకరిస్తే.. తామున్నామంటూ.. సుధీక్షణ్ ఫౌండేషన్‌, పలువురు ప్రవాసాంధ్రులు చేయూతనిచ్చి వారి జీవితాలను నిలబెట్టారు. ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన 5 గురు విద్యార్థులకు రూ.4 లక్షల విలువైన కృత్రిమ కాళ్లను విజయవాడలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు

Published : 27 Sep 2022 05:33 IST

కృత్రిమ కాళ్లను అమర్చుకున్న వారితో కలెక్టర్‌ డిల్లీరావు, డీటీసీ పురేంద్ర, విమల, వాసు,

శ్రీనివాసరావు, రాజకుమారి, ప్రసాద్‌, ఝాన్సీ, వలి

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రైలు, రోడ్డు ప్రమాదాల రూపంలో ఆ యువతను విధి వక్రీకరిస్తే.. తామున్నామంటూ.. సుధీక్షణ్ ఫౌండేషన్‌, పలువురు ప్రవాసాంధ్రులు చేయూతనిచ్చి వారి జీవితాలను నిలబెట్టారు. ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన 5 గురు విద్యార్థులకు రూ.4 లక్షల విలువైన కృత్రిమ కాళ్లను విజయవాడలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, ఉపరవాణా శాఖాధికారి పురేంద్ర సోమవారం అందజేశారు. సుధీక్షణ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు చిగురుపాటి విమల మాట్లాడుతూ.. విధి వక్రీకరించిన యువత, పిల్లలు తిరిగి చదువుకునేలా తమ సేవా సంస్థ ద్వారా 15 ఏళ్ల నుంచి ప్రతి నెలా 5 గురు యువత/పిల్లలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన, నాణ్యతతో కూడిన ప్రోస్తేటిక్‌ కృత్రిమ కాళ్లు, చేతులను, అవసరమైన వారికి మూడు చక్రాల సైకిళ్లను అందజేస్తున్నట్లు తెలిపారు. వీహెచ్‌ఈఈడీయూ రహదారి భద్రత ఎన్జీవో డైరెక్టర్‌ ఎం.వాసు, ఫౌండేషన్‌ సభ్యులు ఎన్‌.శ్రీనివాసరావు, ఆర్‌.రాజకుమారి, ప్రసాద్‌, ఎస్‌.జాన్సీ, ఎస్‌కే వలీ తదితరులు పాల్గొన్నారు.

బాధిత యువత.. దాతల వివరాలు: విజయవాడ మారుతీనగర్‌కు చెందిన ఐ.టి.రమేష్‌ కుమార్‌.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పాలిటెక్నికల్‌ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థి. రైలులో రాకపోకలు సాగిస్తున్న తరుణంలో జూన్‌లో మార్గ మధ్యలో రైలు ఆగిన చోట దిగి, మళ్లీ ఎక్కుతుండగా కింద పడిపోయి కుడి కాలును కోల్పోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 8వ తరగతి విద్యార్థిని మహిత (12) రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. మరో బాధితురాలు అంబిక (విజయవాడ మాచవరం). వీరు ముగ్గురికి దాతలు కొల్లు శ్రీకాంత్‌, కన్నసాని రూప (ప్రవాసాంధ్రులు) తమ ఆశా జ్యోతి సంస్థ ద్వారా సాయం అందించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన 8వ తరగతి విద్యార్థిని పద్మ (12) రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. సదరు విద్యార్థినికి విజయవాడ మొగల్రాజపురానికి చెందిన ఆలపాటి శ్రీనివాస్‌ సాయం చేశారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన కె.అజయ్‌ హన్మకొండలో డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి. బైక్‌ ప్రమాదంలో కాలు కోల్పోగా, దాతలు యార్లగడ్డ శ్రీనివాస్‌, పొట్లూరి కిరణ్‌ (ప్రవాసాంధ్రులు) అండగా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు