logo

Kodali Nani- Vamsi: జగన్‌ సమీక్షకు కొడాలి నాని, వల్లభనేని వంశీ గైర్హాజరు

గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్చించినట్లు తెలిసింది. గన్నవరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

Updated : 29 Sep 2022 08:12 IST

ఈనాడు, అమరావతి: గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్చించినట్లు తెలిసింది. గన్నవరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించకపోవడంపై ప్రాంతీయ సమన్వయకర్తలను ప్రశ్నించినట్లు వైకాపా వర్గాల ద్వారా తెలిసింది. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో సీఎం జగన్‌ బుధవారం సమావేశం నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు సంబంధించి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరుకాలేదు.

అన్ని నియోజకవర్గాల్లో గడపగడపకు కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో బంధువులతో కాకుండా ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొనాలని సూచించారు. బందరు నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నానికి బదులుగా ఆయన తనయుడు పేర్ని కిట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పైవిధంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. జులై నుంచి ఇప్పటివరకు 70 రోజులకు గాను 20 రోజులకుపైగా నియోజకవర్గాల్లో తిరిగిన ఎమ్మెల్యేలను పరవాలేదని, సంతృప్తి చెందారని తెలిసింది. అంతకంటే ఎక్కువ చేసిన వారికి అభినందనలు తెలిపారు. మరింత విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో గడగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని బాగా చేస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌లను అభినందించారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ ఆలస్యంగా ప్రారంభించినా 20 రోజులు ఎక్కువగానే తిరగడంతో సంతృప్తి చెందారు. మంత్రి జోగి రమేష్‌(పెడన), విప్‌ సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట), ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్‌రావు(నందిగామ), రక్షణనిధి(తిరువూరు), అనిల్‌కుమార్‌(పామర్రు), సింహాద్రి రమేష్‌(అవనిగడ్డ), పార్థసారథిలు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని