logo

Kesineni Nani: తొడలు కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరు: ఎంపీ కేశినేని

ఇళ్లలో కూర్చుని మాట్లాడుతూ, ఎక్కడో ఉండి తొడలు కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరని విజయవాడ ఎంపీ, తెదేపా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త కేశినేని నాని వ్యాఖ్యానించారు. బుధవారం విజయవాడ

Updated : 29 Sep 2022 08:17 IST

భారీ గజమాలతో ఎంపీ నానిని సత్కరిస్తున్న పశ్చిమ నియోజకవర్గ తెదేపా నాయకులు

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే : ఇళ్లలో కూర్చుని మాట్లాడుతూ, ఎక్కడో ఉండి తొడలు కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరని విజయవాడ ఎంపీ, తెదేపా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త కేశినేని నాని వ్యాఖ్యానించారు. బుధవారం విజయవాడ పాతబస్తీ జెండా చెట్టు వీధిలో నూతనంగా నిర్మించిన తెదేపా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని ప్రారంభించారు. కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారాకరామారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే కుల, మతాలకు అతీతమన్నారు. ఇక్కడి ప్రజలు పార్టీని-పార్టీ తరఫున పోటీ చేసే మనిషిని చూసే కాకుండా, వ్యక్తిత్వం వంటివి చూసి ఓట్లు వేస్తారన్నారు. కొంత మంది మీడియాలో వెలిసి నాయకులు అయిపోవాలని చూస్తుంటారని, నాయకులు మీడియాలో నుంచి కాదు, ప్రజల్లో నుంచి వస్తారన్నారు. జగన్‌ వచ్చాక విజయవాడకు కృష్ణానది, దుర్గగుడి, భవానీ ద్వీపం వచ్చాయని, జగన్‌ లేకపోతే విజయవాడ లేదనట్లు వైకాపా నాయకులు ప్రచారం ఉందని విమర్శించారు. జగన్‌ వచ్చాక విజయవాడ మొత్తం నాశనమైందన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌ లేదని నిన్న కేంద్రం తెగేసి చెప్పిందని, అయినా చేతకాని ముఖ్యమంత్రిగా జగన్‌ ఉన్నారని, ఆయనలో చలనం లేదని విమర్శించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వివాదం చేశారన్నారు. రాజు సోలంకి సొంత స్థలాన్ని పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇవ్వడం సంతోషాన్నిచ్చిందన్నారు.  అనంతరం ఎంపీ కేశినేని నానిని భారీ గజమాలతో తెదేపా నాయకులంతా ఘనంగా సత్కరించారు. తెదేపా పశ్చిమ నియోజకవర్గం నాయకులు పెందుర్తి శ్రీనివాస్‌, సుకాశి కిరణ్‌, సుకాశి సరిత, సారిపల్లి రాధాకృష్ణ, బూర కనకారావు, ఎంఎస్‌ బేగ్‌, మాజీ కార్పొరేటర్‌ యెదుపాటి రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని