logo

పంచదార.. కందిపప్పు లేనట్టే..

ఈ దసరా పండుగకు నిరుపేదలకు పప్పన్నం లేనట్లే..!  రేషన్‌కార్డు దారులకు కందిపప్పు, చక్కెర అందని పరిస్థితి నెలకొంది. నాసిరకం కందిపప్పు సరఫరా కావడంతో ఎక్కడికక్కడ తిప్పి పంపుతున్నారు. ఇక పంచదార నిల్వలు లేకపోవడంతో చౌకధర దుకాణాలకు సరఫరా కాలేదు. ప్రతి నెలా ఏయే సరకులు ఇస్తున్నామో..

Published : 02 Oct 2022 04:06 IST

దసరాకూ అందని సరకులు నిరుత్సాహంలో కార్డుదారులు

ఈనాడు, అమరావతి

ఈ దసరా పండుగకు నిరుపేదలకు పప్పన్నం లేనట్లే..!  రేషన్‌కార్డు దారులకు కందిపప్పు, చక్కెర అందని పరిస్థితి నెలకొంది. నాసిరకం కందిపప్పు సరఫరా కావడంతో ఎక్కడికక్కడ తిప్పి పంపుతున్నారు. ఇక పంచదార నిల్వలు లేకపోవడంతో చౌకధర దుకాణాలకు సరఫరా కాలేదు. ప్రతి నెలా ఏయే సరకులు ఇస్తున్నామో.. ఢంకా బజాయించే అధికారులు దసరా పండగ ముందు మాత్రం మౌనంగా ఉన్నారు. ఈ సారి బియ్యం మినహా ఏమీ లభించనట్లే.

గత నెల (సెప్టెంబరు)లో రెండు జిల్లాలకు సరఫరా అయిన కందిపుప్పు నాసిరకంగా ఉంది. దీనిని డీలర్లకు బలవంతంగా అంటగట్టారు. వారు  మొబైల్‌ పంపిణీ యూనిట్లు(ఎండీయూ)కు అందించారు. కందిపప్పు అంతా ఉండలు కట్టి, బూజు పట్టింది. తడిసిన పప్పు ప్యాకింగ్‌ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని అంచనా వేశారు. చాలా మంది ఎండీయూలు తిరిగి డీలర్లకు ఇచ్చేయడంతో,  మళ్లీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు ప్రయత్నించగా తీసుకోలేదు. దీంతో ప్రజాపంపిణీ వ్యవస్థ అధికారులు వాటిని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేశారు. ఇప్పటికీ పలువురు డీలర్ల వద్ద కందిపప్పు నిల్వలు ఉన్నాయి. దీంతో తాము నష్టపోవాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఒకటీ రెండు సంచులు మాత్రం తడిసి సరఫరా కావడంతో పాడైందని చెబుతున్నారు.

* ఈ నెల ఎంఎల్‌ఎస్‌పీ గోదాములకు అందిన కందిపప్పు పూర్తిగా నాసిరకంగా ఉందని ముందుగానే గుర్తించారు. దీంతో అవనిగడ్డ, మచిలీపట్నం ఎంఎల్‌ఎస్‌పీల నుంచి సరకు తీసుకోలేదు. దాదాపు 100 టన్నుల వరకు తిరస్కరించినట్లు తెలిసింది. గత నెల కృష్ణా జిల్లాలో 250 టన్నుల వరకు  నాసిరకంగా వచ్చింది.

* కందిపప్పు బయట మార్కెట్‌లో రూ.100 నుంచి 110 వరకు ఉంది. రేషన్‌ దుకాణాల్లో కిలో రూ.67 చొప్పున లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఇది నాసిరకంగా ఉండడంతో  పలువురు కార్డుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. సరకులు తీసుకోకపోతే కార్డు రద్దు అవుతుందని, ఇతర భయాలతో కొందరు తీసుకుంటున్నారు.

* ఎన్టీఆర్‌ జిల్లాలో జులై, ఆగస్టు మాత్రమే కందిపప్పు సరఫరా చేశారు. సెప్టెంబరు కోటా లేదు. కేవలం అంగన్‌వాడీ కేంద్రాలకు అందించారు. ప్రస్తుతం ఇండెంట్‌ ఇంకా పెట్టలేదని చెబుతున్నా.. నాసిరకం మాత్రమే గోదాములకు అందుతున్నట్లు తెలిసింది.

నాఫెడ్‌ నుంచి బినామీలే..!

పౌరసరఫరాల సంస్థకు నాఫెడ్‌ సంస్థ కందిపప్పును సరఫరా చేస్తోంది. వాస్తవానికి దీన్ని బినామీ గుత్తేదారులు నాఫెడ్‌ తరపున సరఫరా చేస్తున్నట్లు సమాచారం. నాగ్‌పూర్‌ నుంచి దీన్ని తీసుకువచ్చి ప్యాకింగ్‌ చేసి అందిస్తున్నారు. కందిపప్పులో 14శాతం లోపు తేమ ఉండాలి. కానీ 20శాతం పైగా  ఉంటోంది. తడిసిన పప్పు లేదా కందులు ఆడించి ఇచ్చినట్లు తెలిసింది. దీనివల్ల బరువు ఎక్కువగా వస్తుంది. అలా వీటిని నాఫెడ్‌కు సరఫరా చేశారు. దాన్నే కార్పొరేషన్‌కు అక్కడి నుంచి పీడీఎస్‌కు, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపుతున్నారు.

ఇండెంట్‌ పెట్టినా సరఫరా కాని పంచదార

మరోవైపు పంచదార నిల్వ లేదు. ఇండెంట్‌ పెట్టినా సరఫరా లేదు. దీనిపై జిల్లా మేనేజరు (ఎన్టీఆర్‌) శిరీష స్పందిస్తూ గోదాములకు కందిపప్పు రాలేదని, పంచదార కూడా నిలువ లేదన్నారు. కొద్దిమొత్తం ఉంటే.. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. అవనిగడ్డ, మచిలీపట్నం గోదాములకు వచ్చిన కందిపప్పు తేమ ఎక్కువగా ఉండటంతో తిరస్కరించామని కృష్ణా జిల్లా మేనేజరు శ్రీధర్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని