logo

మట్టి లారీ ఢీకొని చిరువ్యాపారి మృతి

మట్టి లారీ ఢీకొని చిరువ్యాపారి మృతిచెందిన ఘటన గన్నవరం-ఆగిరిపల్లి ప్రధాన రహదారిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై రమేష్‌ తెలిపిన వివరాల మేరకు.. గన్నవరం విద్యానగర్‌కు చెందిన సప్పా పరమేశ్వరరావు(46) స్టేషన్‌ పరిధిలోని చిక్కవరంలోని ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు.

Published : 02 Oct 2022 04:06 IST

గొల్లనపల్లి వద్ద పోలవరం కట్టపై లారీల నుంచి పడిన భారీ రాళ్లు (పాత చిత్రం)

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : మట్టి లారీ ఢీకొని చిరువ్యాపారి మృతిచెందిన ఘటన గన్నవరం-ఆగిరిపల్లి ప్రధాన రహదారిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై రమేష్‌ తెలిపిన వివరాల మేరకు.. గన్నవరం విద్యానగర్‌కు చెందిన సప్పా పరమేశ్వరరావు(46) స్టేషన్‌ పరిధిలోని చిక్కవరంలోని ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. యథావిధిగా శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలోని బీబీగూడెం చేరుకొనే సరికి.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మట్టి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వాహనాల రాకపోకలతో భయాందోళన: నిత్యం వందలాది మట్టి లారీల రాకపోకలతో ఇబ్బందులు తప్పడం లేదని గన్నవరం మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అతివేగంతో వెళ్తున్న ఈ వాహనాలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంటోందని వాపోతున్నారు. లారీల రాకపోకలు ఒక ఎత్తు అయితే.. వాటి ద్వారా వచ్చే భారీ శబ్దాలు, వాహనాల్లోంచి కింద పడే భారీ రాళ్లు, మట్టి పెళ్లలు మరో ఎత్తు. అధ్వానంగా తయారైన ఆరిగిపల్లి-గన్నవరం ప్రధాన రహదారిలోని గొల్లనపల్లి వద్ద పోలవరం వంతెన, గోపవరపుగూడెం కూడలి, బీబీగూడెం మలుపులు, కోనాయి చెరువు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, బోసుబొమ్మ కూడళ్ల వద్ద పడే రాళ్లతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ద్విచక్ర వాహనదారులు, ఆటోలను ఢీకొని.. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా కలెక్టర్‌ ప్రత్యేక చొరవచూపి మట్టి తవ్వకాలు నిలుపుదల చేసి సహజ వనరులతో పాటు తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని