logo

పండగ బస్సులు కిటకిట

ఈ దసరా సీజన్‌ ఆర్టీసీకి ఆశాజనకంగా కనిపిస్తోంది. కొవిడ్‌ కారణంగా వరుసగా రెండేళ్లు నిరాశపర్చింది. రెగ్యులర్‌గా తిరిగే సర్వీసులే నిండని పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 03 Oct 2022 06:27 IST

ఉత్తరాంధ్ర, రాయలసీమ మార్గాల్లో రద్దీ
మూడేళ్ల తర్వాత సర్వీసులు నిండుగా...
ఈనాడు, అమరావతి

ఈ దసరా సీజన్‌ ఆర్టీసీకి ఆశాజనకంగా కనిపిస్తోంది. కొవిడ్‌ కారణంగా వరుసగా రెండేళ్లు నిరాశపర్చింది. రెగ్యులర్‌గా తిరిగే సర్వీసులే నిండని పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ప్రత్యేక బస్సులు నడిపే అవసరమే రాలేదు. మూడేళ్ల తర్వాత మళ్లీ రద్దీ కనిపిస్తోంది. ఇప్పటికే రోజువారీ సర్వీసుల్లో సీట్లు అన్నీ నిండిపోయాయి. రెండు రోజుల నుంచి ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నారు. ఈ రద్దీ సెలవులు ముగిసే వరకు ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఈసారి పండుగ స్పెషల్స్‌లో రెట్టింపు ఛార్జీలు లేకపోవడం కూడా ఓఆర్‌, రద్దీ పెరగడానికి కారణమైంది.

విజయవాడ చుట్టుపక్కల జూనియర్‌ కళాశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. వీరంతా వేర్వేరు జిల్లాల నుంచి వచ్చి చదువుతున్నారు. కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో శనివారం నుంచి తమ ప్రాంతాలకు పయనమయ్యారు. హైదరాబాద్‌ నుంచి కూడా జిల్లాకు వచ్చారు. దీంతో రెగ్యులర్‌ సర్వీసులు కాకుండా స్పెషల్స్‌ పీఎన్‌బీఎస్‌ నుంచి 132 నడిపారు. విశాఖపట్నం, రాజమండ్రి, రాయలసీమ ప్రాంతాలకు భారీగా వెళ్లారు. ఈ మార్గాల్లో రెగ్యులర్‌ సర్వీసులు 150 నడుస్తుంటాయి. ఈ రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. విద్యార్థులు సెలవులకు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి వరకు వంద ప్రత్యేక బస్సులు తిరిగాయి. రాజమండ్రి, భద్రాచలం, అమలాపురం, కాకినాడ, విశాఖపట్నం మార్గాల్లో అధికంగా తిరిగాయి.

* పెరుగుతున్న రద్దీకి తగ్గట్లు ఎన్టీఆర్‌ జిల్లాలోని సిటీ డిపోల్లోని బస్సులను నడుపుతున్నారు. దసరా సెలవులు కావడంతో చాలా రూట్లలో సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వీటిని డిమాండ్‌ ఉన్న దూరప్రాంత మార్గాల్లో తిప్పుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉండడంతో బస్సులు నిండుతున్నాయి. సెలవుల అనంతరం తిరిగి వెళ్లేందుకు కూడా సీట్లు బుక్‌ అవుతున్నాయి. 8, 9 తేదీల్లో ఎక్కువ మంది తిరిగి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెగ్యులర్‌ సర్వీసుల్లో ఇప్పటికే దాదాపు 75 శాతం సీట్లు రిజర్వు అయ్యాయి. ఆ సమయంలో ఉండే రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని