logo

మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ ఏర్పాటు చేయరా?

ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మహిళ చనిపోతే, ఆమె మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ ఇవ్వబోమని జీజీహెచ్‌ అధికారులు పేర్కొనడం సిగ్గుచేటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 03 Oct 2022 05:46 IST

ఆస్పత్రి అధికారులపై సీపీఎం నాయకుల ఆగ్రహం

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మహిళ చనిపోతే, ఆమె మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ ఇవ్వబోమని జీజీహెచ్‌ అధికారులు పేర్కొనడం సిగ్గుచేటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ముంపు ప్రాంతం కూనవరం గ్రామానికి చెందిన కారం అమూల్య అనారోగ్య కారణాలతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందారు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ కోసం అడగ్గా.. ప్రైవేటు వాహనం మాట్లాడుకోవాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. దీంతో బాధితులు విషయాన్ని సీపీఎం నాయకులకు తెలియజేశారు. బాబూరావు తదితరులు ఆస్పత్రికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. అంబులెన్స్‌ ఏర్పాటు చేయకపోతే ధర్నా చేపడతామని హెచ్చరించారు. దీంతో సిబ్బంది వాహనం ఏర్పాటు చేసి అమూల్య మృతదేహాన్ని కూనవరం పంపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా అంబులెన్స్‌లు ఉన్నాయని, ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లేందుకు వాటిని పంపాలని పేర్కొన్నారు. గిరిజన మహిళ అమూల్య మృతి వారి కుటుంబానికి తీరని లోటని, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సంఘాల నేతలు జి.విజయప్రకాష్‌, పి.కృష్ణ, క్రాంతి, తదితరులు ఉన్నారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts