logo

చెప్పిందొకటి.. జరిగిందొకటి

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏడో రోజు మూలానక్షత్రం సందర్భంగా భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి ఒంటి గంటన్నర నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు.

Updated : 03 Oct 2022 10:38 IST

కొండపైకి విచ్చలవిడిగా వాహనాల రాక
ఈనాడు, అమరావతి

ఘాట్‌ రోడ్డులో వాహనాల రాకపోకలు

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏడో రోజు మూలానక్షత్రం సందర్భంగా భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి ఒంటి గంటన్నర నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులు భారీగా తరలివస్తారు కనుక అందరికీ సర్వదర్శనమేనంటూ అధికారులు ముందురోజు ప్రకటించారు. ఘాట్‌ రోడ్డుపైకి ఒక్క వాహనాన్ని కూడా అనుమతించబోమంటూ స్పష్టం చేశారు. కానీ వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల వాహనాలు విచ్చలవిడిగా కొండపైకి రాకపోకలు సాగించాయి. అమ్మవారి దర్శనాలకు ఇంకా అనుమతించకముందే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ కుటుంబంతో పాటు 50 మందికి పైగా అనుచరులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఐదు కార్లలో నేరుగా కొండపైకి వచ్చేశారు. కొండ పైభాగంలో విధుల్లో ఉన్న విశాఖకు చెందిన ఓ ఏసీపీ స్థాయి అధికారి ఆపేందుకు ప్రయత్నించగా.. నేనెవరో తెలుసా అంటూ వెలంపల్లి అన్నారు. దీంతో అక్కడే ఉన్న వన్‌టౌన్‌ పోలీసు అధికారి కల్పించుకుని.. మాజీ మంత్రి అని చెప్పి.. వెలంపల్లితో పాటు ఆయన అనుచరులందరినీ ఆలయంలోకి పంపించారు. అనంతరం అమ్మవారి దర్శనాలకు వదిలిన వెంటనే అందరూ దర్శనాలు చేసుకుని తిరిగి కార్లలో వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే, మేయర్‌, ఎమ్మెల్సీ స్టిక్కర్లతో ఉన్న కార్లు కొండపైకి తిరుగుతూనే ఉన్నాయి. వాటిని ఎవరూ ఎక్కడా అడ్డుకున్నది లేదు. సాధారణ భక్తులకు సంబంధించిన ద్విచక్ర వాహనాలను కూడా బందర్‌ రోడ్డులోని పోలీస్‌ కంట్రోల్‌ రూం ఫ్లైఓవర్‌ దగ్గరే అడ్డుగా బారికేడ్లను పెట్టి మరీ ఆపేశారు. ఎటూ వెళ్లే దారిలేక.. చాలా మంది ఉత్సవాల విధుల్లో ఉన్న సిబ్బంది కూడా తమ వాహనాలను అక్కడే పార్కింగ్‌ చేసి మూడు నాలుగు కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ రావాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని