logo

‘ముఖ్యమంత్రికి కప్పం కట్టి ఇసుక దోపిడీ’

ముఖ్యమంత్రికి నెలవారీ కప్పం కడుతూ మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్‌.. కృష్ణానదిలో ఇసుకను లారీ రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల ధరతో హైదరాబాద్‌, బెంగళూరు

Published : 03 Oct 2022 05:46 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు

మైలవరం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రికి నెలవారీ కప్పం కడుతూ మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్‌.. కృష్ణానదిలో ఇసుకను లారీ రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల ధరతో హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు అక్రమంగా తరలిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలని కోరుతూ ఆదివారం స్థానిక నూజివీడు రోడ్డులోని రామాలయం ఎదుట సాయంత్రం వరకు నిరసనదీక్ష చేశారు. ఈ సందర్భంగా ఇసుక అమ్మకాలకు సంబంధించి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ద్వారా ఇసుకను దక్కించుకుని, బావమరిది అనుచరులతో అక్రమార్జనకు ఎమ్మెల్యే తెరలేపారని ధ్వజమెత్తారు.  కృష్ణానదిని దోచుకోవడానికే తెల్లచొక్కా వేసుకొని వచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకు ఇసుక దొరక్క అల్లాడుతుంటే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు క్వారీలను అప్పగించి దోచుకొంటున్నారన్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితులుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌లకు ఇసుకను కట్టబెట్టారని, ఇసులో వాటా ఉందో లేదో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొండపల్లి అడవి దోపిడీపై నేటికీ చర్యలు లేవని, ప్రస్తుతం ఇసుక దోపిడీ మొదలు పెట్టారన్నారు. లేటరైట్‌ ముసుగులో బాక్సెట్‌ తవ్వకాలు సాగిస్తూ ముఖ్యమంత్రి సూచించిన కంపెనీలకు టన్ను రూ.800లకే అమ్మాలని సూచిస్తూ, ఆ కంపెనీలు మాత్రం రూ.1200లకు అమ్ముకొంటున్నాయని చెప్పారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు, కుటుంబసభ్యుల పట్ల సీఐడీ అమానుషంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు కోమటి సుధాకరరావు, వజ్రాల కుమార్‌రెడ్డి, జువ్వా రాంబాబు, పోతురాజు, రామకృష్ణారెడ్డి, మల్లెల రాధా, సుధాకర్‌, నియోజకవర్గ పరిశీలకుడు ధారూనాయక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని