logo

భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏ ఒక్క భక్తుడూ ఇబ్బంది పడలేదని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Published : 03 Oct 2022 05:46 IST

మాట్లాడుతున్న మంత్రి కొట్టు సత్యనారాయణ, చిత్రంలో ఉదయభాను, డిల్లీరావు, తదితరులు

విజయవాడ వన్‌టౌన్‌, ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏ ఒక్క భక్తుడూ ఇబ్బంది పడలేదని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్‌ వద్ద మంత్రి విలేకరులతో మాట్లాడారు. తన పర్యటన సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించిన సమయంలో 30 నిమిషాలు మాత్రమే దర్శనం నిలిపివేశామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో గంటల కొద్దీ దర్శనం నిలిపి వేసేవారని అన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను 2.30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మంతిర వివరించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కలెక్టర్‌ డిల్లీరావు, దుర్గగుడి ఈఈ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో సత్ఫలితాలు: అంతకుముందు ఆదివారం ఉదయం మంత్రి విలేకరులతో మాట్లాడారు. టిక్కెట్టు రహిత దర్శనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖల సమన్వయంతో తీసుకున్న చర్యలు మంచి ఫలితానిచ్చాయని మంత్రి పేర్కొన్నారు. వీఐపీల వాహనాల రాకపోలను నియంత్రించడం, భక్తులందరూ క్యూలైన్లో వచ్చే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. వేకువ జామున 1.30 గంటలకే భక్తులను అనుమతించడంతో అధిక శాతం మంది దర్శనం చేసుకోగలిగారన్నారు. ఇదే విధానాన్ని మిగతా రోజులు కూడా కొనసాగిస్తామని చెప్పారు. దేవస్థానం ఈవో భ్రమరాంబ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని