logo

గాంధీజీ.. యువతకు స్ఫూర్తి

మహాత్ముని బోధనలు, అనుసరించిన మార్గం.. నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంటుందని మాజీ ఎంపీ

Updated : 03 Oct 2022 06:33 IST

గాంధీ చిత్రాలను తిలకిస్తున్న తులసిరెడ్డి, బుద్ధప్రసాద్‌, శివనాగిరెడ్డి

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: మహాత్ముని బోధనలు, అనుసరించిన మార్గం.. నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంటుందని మాజీ ఎంపీ ఎన్‌.తులసిరెడ్డి అన్నారు. మండలి ఫౌండేషన్‌ అవనిగడ్డ, కొలుసు ఆర్ట్‌ ఫౌండేషన్‌ విజయవాడ, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ విభాగమైన కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, అమరావతి సంయుక్త ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి, మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సందర్భంగా జాతీయ స్థాయి చిత్రకళా పోటీలు ఆదివారం మొగల్రాజపురంలోని కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తులసిరెడ్డి మాట్లాడుతూ బ్రిటీష్‌ పాలకుల బానిసత్వం నుంచి దేశ ప్రజలకు విముక్తి కలిగించాలనే లక్ష్యంతో గాంధీజీ నిర్వహించిన స్వాతంత్రోద్యమం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. మద్యపాన నిషేధ కమిటీ ఛైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ప్రతి చిత్రం చారిత్రక ఘట్టాలను తెలియజేస్తుందన్నారు. మాజీ ఉపసభాపతి, మండలి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ ఆంధ్ర చిత్రకళ, శిల్పకళలు పునరుజ్జీవం పొందాలని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో బహుమతి ప్రదాత చందన విష్ణువర్ధనరావు, ఫొటో ఇండియా అధినేత తమ్మా శ్రీనివాస్‌రెడ్డి, ప్రముఖ చిత్రకారులు అరసవెల్లి గిరిధర్‌, టీవీరావు, వెంకటేష్‌, సునీల్‌కుమార్‌, కొలుసు ఆర్ట్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కొలుసు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తొలుత అతిథులు చిత్రప్రదర్శనను తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని