logo

దాతల భూములు ధారాదత్తం

పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడం కోసం దేవాలయాలకు చెందిన రూ.కోట్లు విలువ చేసే భూములను తీసుకున్న ప్రభుత్వం రెండు దశాబ్దాలకుపైగా గడిచినప్పటికీ పరిహారం చెల్లించడంలేదు. దీంతో దేవాలయాల నిర్వహణ కష్టంగా మారింది. ఆలయాల్లో జాతరలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలంటే ఇప్పటికీ దాతలపైనే ఆధారపడాల్సిన దుస్థితి.

Published : 03 Oct 2022 05:58 IST

పరిహారం కోసం దశాబ్దాలుగా దేవాలయాల నిరీక్షణ
రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలు
న్యూస్‌టుడే, అవనిగడ్డ

బీసీ కాలనీ

పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడం కోసం దేవాలయాలకు చెందిన రూ.కోట్లు విలువ చేసే భూములను తీసుకున్న ప్రభుత్వం రెండు దశాబ్దాలకుపైగా గడిచినప్పటికీ పరిహారం చెల్లించడంలేదు. దీంతో దేవాలయాల నిర్వహణ కష్టంగా మారింది. ఆలయాల్లో జాతరలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలంటే ఇప్పటికీ దాతలపైనే ఆధారపడాల్సిన దుస్థితి. నాడు రూ.లక్షల్లో ఉన్న ఆ భూముల విలువ నేడు రూ.కోట్లకు పెరిగింది. అవనిగడ్డ గ్రామ దేవత లంకమ్మ అమ్మవారు, శివాలయం, విష్ణాలయాలకు చెందిన భూములు తీసుకొని లంకమ్మ మాన్యం, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ పరిహారం మాత్రం చెల్లించలేదు. లంకమ్మ అమ్మవారి గుడికి అప్పట్లో 80 శాతం నిధులు చెల్లించారు. మిగిలిన 20 శాతం ఇంతవరకు ఇవ్వలేదు. శివాలయం, విష్ణాలయానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా భూములు తీసుకున్నారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం దేవాలయాలకు దాతలు ఇచ్చిన భూములను తీసుకునే అధికారం ఎవరికీ లేదు. అయినప్పటికీ నియోజకవర్గ కేంద్రం అవనిగడ్డలో అప్పటి ప్రభుత్వం ఆలయాల భూములను సాంఘిక సంక్షేమ శాఖ అవసరాల పేరుతో పేదల నివాస గృహాల కోసం తీసుకుంది. పరిహారం విషయం పక్కన పెట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదని అర్చకులు, సిబ్బంది, దాతలు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరిహారం ఇచ్చేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. మూడు దేవాలయాలకు చెందిన 22.68 ఎకరాలకు పరి హారం ఇవ్వాల్సి ఉంది.

ఎకరం విలువ రూ.కోటిపైనే..

అవనిగడ్డ శివాలయానికి చెందిన 3.98 ఎకరాల భూమిని 1995లో తీసుకున్న ప్రభుత్వం ఇంతవరకూ భూమికి విలువ కట్టకపోవడం దారుణమని దాతలు, భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ భూముల్లోనే బీసీ కాలనీ ఏర్పాటు చేశారు. బీసీ బాలికల వసతి గృహాన్ని కూడా నిర్మించారు. దీని విలువ ఇప్పుడు సుమారుగా రూ.8 కోట్లు ఉంటుందని అంచనా.

* లంకమ్మ అమ్మవారికి చెందిన 16.30 ఎకరాలను 1997లో తీసుకుంది. అప్పట్లో ఎకరాకు సుమారు రూ.80 వేలు విలువ కట్టి, రూ.16.95 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రూ.13.95 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన రూ.3.4 లక్షలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ భూముల్లో ఏర్పాటు చేసిందే లంకమ్మ మాన్యం. నాటి ఈ బకాయిల విలువ నేడు రూ.ఐదారు కోట్లకుపైగా ఉంటుందని అంచనా.

* విష్ణాలయానికి చెందిన 8వ వార్డులోని 2.4 ఎకరాల భూమిని ప్రభుత్వం 1994లో తీసుకొని ఎకరాకు రూ.2.2 లక్షలు చొప్పున విలువ కట్టారు. డబ్బులు మాత్రం ఇంతవరకూ రూపాయి కూడా చెల్లించలేదని దేవాదాయశాఖ అధికారులు చెప్పారు. ఈ భూముల విలువ నేడు రూ.4.5 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి పరిహారం రాబట్టుకునేందుకు అప్పటి దేవాదాయశాఖ కమిషనర్‌ అనూరాధ చర్యలు తీసుకుంటున్నట్లు 2015లో ప్రకటించారు. అయినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

కలెక్టరు దృష్టికి తీసుకు వెళ్లాం - సీతారామయ్య, కార్యనిర్వహణాధికారి

పరిహారం చెల్లించాలని కలెక్టరుకు ఇప్పటికే అనేక లేఖలు పంపారు. తను బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను. అయినా స్పందన లేదు. 12 శాతం వడ్డీతో చెల్లించాలని లేఖల్లో కోరాము. లేని పక్షంలో ప్రస్తుత మార్కెట్‌ విలువతో చెల్లించాలని దేవాదాయ శాఖ అధికారులు కోరుతున్నారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts