logo

సామాన్యులకు నరకయాతన

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి వివాదాలకు నిలయంగా మారింది. ఆదివారం తెల్లవారు జామున ఒంటి గంట నుంచే క్యూలైన్‌లన్నీ కూడా భక్తులతో కిక్కిరిశాయి. ఉదయం నుంచి ఏర్పాట్లు చేసిన అధికారులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని భక్తులు తీవ్ర ఆగ్రహంతో దూషించిన ఘటనలు అనేకంగా చోటు చేసుకున్నాయి.

Published : 03 Oct 2022 05:58 IST

విజయవాడ వన్‌టౌన్‌, ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి వివాదాలకు నిలయంగా మారింది. ఆదివారం తెల్లవారు జామున ఒంటి గంట నుంచే క్యూలైన్‌లన్నీ కూడా భక్తులతో కిక్కిరిశాయి. ఉదయం నుంచి ఏర్పాట్లు చేసిన అధికారులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని భక్తులు తీవ్ర ఆగ్రహంతో దూషించిన ఘటనలు అనేకంగా చోటు చేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం పంచహారతుల నిమిత్తం గంట పాటు భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. అంతకు ముందు సీఎం పర్యటన నిమిత్తం దర్శనాన్ని నిలిపేశారు. పంచహారతుల అనంతరం దర్శనం ప్రారంభం కాగా భక్తులు పెద్ద ఎత్తున ఈఓ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. కొందరు భక్తులు మాట్లాడుతూ... వీవీఐపీలను పోలీసులే దగ్గరుండి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. తామంతా గంటల కొద్దీ క్యూలైన్‌లో నిలబడి ఉన్నా కనీసం తాగునీరు ఇచ్చే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలకులు, అధికారులు చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమమయ్యాయి. సరస్వతీదేవి అలంకారం దర్శనం ప్రారంభమైన తరువాత నుంచి ఆదివారం రాత్రి వరకు వందల సంఖ్యలో కార్లు కొండపైకి వచ్చి వెళ్లాయి. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాజీ మంత్రి వెలంపల్లి ఐదు వాహనాల్లో ఆలయానికి వచ్చారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి పర్యటన అనంతరం కూడా పలువురు వైకాపా నాయకులకు చెందిన కార్లు పైకి అనుమతించారు. రాష్ట్ర డీజీపీ పర్యటన సమయంలో ఇంద్రకీలాద్రి పైకి వచ్చిన సీపీ దగ్గరుండి కార్లను దిగువకు పంపారు.

భక్తులను నియంత్రిస్తున్న పోలీసులు

దర్శన క్యూలైన్లో వృద్ధుడి మృతి:  గుంటూరుకు చెందిన విశ్రాంత ఉద్యోగి జె.వెంకటేశ్వర్లు(62) ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఆయన వినాయకుడి ఆలయం వద్ద క్యూలైన్‌లో ఉన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆయన ఫిట్స్‌ కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వైద్య ఆరోగ్య సిబ్బంది  హుటాహుటిన  ఆయన్ను దగ్గర్లోని వైద్య శిబిరానికి తీసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి జె.వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆయన కుమార్తెలు ఇద్దరూ అమెరికాలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని