logo

చదువుల తల్లికి.. భక్తజన హారతి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో కీలకమైన మూలనక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం అర్ధరాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.

Published : 03 Oct 2022 05:58 IST

ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో కీలకమైన మూలనక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం అర్ధరాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకూ రెండున్నర లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టే.. కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఛాంబర్లలోకి తరలించారు. ఒక్కో ఛాంబర్‌ నిండిపోతుంటే.. మరొక దానిలోకి పంపించారు. ఆదివారం వేకువజామున ఒంటి గంట తర్వాత నుంచి దర్శనాలకు అనుమతించారు. ఒక్కో ఛాంబరులో నుంచి భక్తులను క్యూలైన్లలోకి వదిలారు. గత రెండేళ్లు కొవిడ్‌ కారణంగా దర్శనాలకు రాలేకపోయిన భక్తులు.. ఒక్కసారిగా ఆలయానికి మూలానక్షత్రం రోజున పోటెత్తారు. సరస్వతీదేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన వారితో ఉదయం నుంచి తిరిగి రాత్రి వరకూ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. మధ్యలో ముఖ్యమంత్రి అమ్మవారి దర్శనానికి వచ్చిన సమయంలో గంటకుపైగా సామాన్యుల దర్శనాలను నిలిపారు. ఆ సమయంలో రద్దీ మరింత పెరిగింది. భక్తులు అసహనానికి గురయ్యారు.


నేడు దుర్గాదేవి అలంకారం...

దసరా ఉత్సవాలలో ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. ‘లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందింది. దుర్గమాసురుడిని సంహరించిన తర్వాత కీలాద్రిపై అమ్మవారు స్వయంగా ఆవిర్భవించింది. దుర్గే దుర్గతినాశని.. అనే వాక్యం శుభాలను కలగజేస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం’. దివ్యరూపిణి అయిన దుర్గమ్మ దర్శనానికి ఏటా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

- ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని