logo

సమయం స్వల్పం.. లక్ష్యం ఘనం

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత నీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమాన్ని బాలరిష్టాలు వీడటం లేదు.

Published : 05 Oct 2022 01:49 IST

బాలారిష్టాల్లోనే జలజీవన్‌ మిషన్‌  

కలెక్టరేట్‌(మచిలీపట్నం), రామవరప్పాడు, న్యూస్‌టుడే

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత నీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమాన్ని బాలరిష్టాలు వీడటం లేదు. 2024 నాటికి నూరు శాతం లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నా అమలు అనుమానాస్పదంగా కన్పిస్తోంది. గడచిన రెండు సంవత్సరాల వ్యవధిలో పనుల విషయంలో సాధించిన పురోగతి కేవలం ఇరవైఐదు శాతానికి లోబడి ఉండగా రమారమి ఏడాది  వ్యధిలో మిగిలిన 75 శాతం పనులు ఏమేరకు పూర్తవుతాయనేది ప్రశ్నార్ధకమవుతోంది.

గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రకటించిన ప్రతిష్ఠాత్మక జలజీవన్‌ కార్యక్రమ అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 శాతం మేరకు నిధులు వెచ్చిస్తున్నాయి. 2024 నాటికి గ్రామీణా ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 986 గ్రామ పంచాయతీల పరిధిలో కుళాయి లేని ఇళ్ల సంఖ్యను గుర్తించి మొత్తం 2.25 లక్షల గృహాలకు కుళాయిలు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చారు. పనుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో దాదాపు రూ.1000 కోట్ల వరకూ మంజూరు చేసింది. ఆయా గ్రామాల్లో పరిస్థితులకు అనుగుణంగా పైపులైన్ల ఏర్పాటు, ఇళ్లకు కుళాయిల ఏర్పాటు, తదితర పనులు గుర్తించి మొత్తం 1,240 పనులుగా విభజించారు. ప్రారంభంలో రూ.5.00 లక్షల అంచనా వ్యయంతో కూడిన పనులను నామినేషన్‌ పద్దతిపై, మిగిలినవి టెండర్ల ద్వారా గుత్తేదారులకు అప్పగించారు. పనులు గిట్టుబాటు కాలేదన్న కారణంతో కొందరు, బిల్లులు సకాలంలో రావడం లేదన్న సాకుతో కొందరు గుత్తేదారులు పనులు విరమించుకోవడంతో పురోగతి నత్తనడక మారింది. పరిస్థితిని గమనించిన అధికారులు మండలాన్ని యూనిట్‌గా తీసుకుని పనులు అప్పగించినా ఆశించిన ఫలితం నామమాత్రమే అవుతోంది. కొన్ని గ్రామాల్లో పనులు అర్ధతరంగా నిలిపివేయడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇటీవలే జలజీవన్‌ పనులు అసంపూర్తిగా ఉన్న కృష్ణా జిల్లాలోని ఓగ్రామంలో నీటి కాలుష్యం వల్ల మరణాలు సంభవించడంతో పనుల నిర్వహణ తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మండలాల పరిధిలో వేళ్లమీద లెక్కించే స్థాయిలో నూరుశాతం పనులు పూర్తి చేసినా ఇంకా 933 పనులు ఇటీవల వరకూ ప్రారంభించలేదంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

లక్ష్యాలను నిర్దేశిస్తున్న అధికారులు
జిల్లాల విభజన అనంతరం కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లా పరిధిలో అధికారులతో నిర్వహించే సమావేశాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు లక్ష్యసాధనపై దిశా నిర్ధేశనం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నిర్వహించే జడ్పీ సాధారణ, స్థాయి సంఘ సమావేశాల్లో ఇంటిటికి కుళాయిలపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పనులు వేగవతం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

జగనన్న కాలనీల్లో కానరాని అతీగతి
పేదలకు ఇచ్చిన లేఅవుట్‌ల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లకు జలజీవన్‌ కార్యక్రమం ద్వారా కుళాయిలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించి అందుకు తగ్గ విధంగా నిధులు సర్దుబాటు చేసింది. జిల్లాలో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లకు అనుగుణంగా అధికారులు అంచానాలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకూ 90 శాతానికి పైగా కాలనీల్లో కనీస మౌలిక వసతులు సమకూరలేదు. అంతర్గత రహదారులు, విద్యుత్తు సౌకర్యాల లేమితో కొన్ని పల్లపుప్రాంతాల్లో ఉన్న కాలనీలు వర్షం పడితే జలమయంగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని జగనన్న కాలనీల్లో 1,468 పనులు చేపట్టేందుకు రూ.474 కోట్ల వ్యయంతో అంచానాలు సిద్ధం చేసినా ఎప్పటికి కాలనీల్లో నూరు శాతం కుళాయిల లక్ష్యం సాధ్యపడుందో తెలియని పరిస్థితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని