logo

హత్య కేసు నీరుగార్చేందుకు వసూల్.. సీఐ, ఎస్సైల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

హత్య కేసులో డబ్బులు తీసుకుని కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో అవినీతి అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

Updated : 06 Oct 2022 09:42 IST

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - తోట్లవల్లూరు: హత్య కేసులో డబ్బులు తీసుకుని కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో అవినీతి అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇందులో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదర్కొన్న పమిడిముక్కల సీఐ ముక్తేశ్వరరావు, తోట్లవల్లూరు ఎస్‌.ఐ అర్జున్‌లపై చర్యలకు రంగం సిద్ధం అవుతోంది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ రామంజనేయులు ఆధ్వర్యంలోని బృందం పలువురిని క్షుణ్ణంగా విచారించింది. బ్యాంకు ఖాతాలను విశ్లేషించడం ద్వారా విషయం బయటపడింది. దీనిపై జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులకు నివేదిక వెళ్లింది. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న వీరిపై రెండు, మూడు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

లావాదేవీలపై దృష్టి పెట్టిన ఏసీబీ
కుమ్మక్కు వ్యవహారంలో పోలీసులపై వచ్చిన అవినీతి ఆరోపణల దృష్ట్యా లోతైన దర్యాప్తు కోసం అవినీతి నిరోధక శాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో అనిశా అధికారుల బృందం రంగలోకి దిగింది. మంగళవారం మధ్యాహ్నం అధికారులు తోట్లవల్లూరు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లో సిబ్బంది అందరి నుంచి ఫోన్లు తీసుకుని స్విచాఫ్‌ చేసి, పక్కన పెట్టించారు. సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్టేషన్‌ గేట్‌ పూర్తిగా మూసివేశారు. లోపలకు ఎవరినీ అనుమతించలేదు. మధ్యాహ్నం మొదలైన విచారణ రాత్రి వరకు సుదీర్ఘంగా సాగింది. ఈ కేసును ప్రాథమికంగా విచారణ నిర్వహించిన జిల్లా అదనపు ఎస్పీ రామాంజనేయులు సమక్షంలో పలువురిని ఏసీబీ అధికారులు స్టేషన్‌లో ప్రశ్నించారు. వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్నారు. లావాదేవీలపై ఎక్కువగా దృష్టి సారించారు. ఎవరి నుంచి ఎవరికి డబ్బులు వెళ్లాయి? ఎలా జమ అయ్యాయి? ఎవరికి ఎంత ముట్టింది? వంటి వాటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన నరేంద్రరెడ్డిని విచారించిన సమయంలో ఎటువంటి వివరాలు వెల్లడయ్యాయి? డబ్బులు వ్యవహారానికి సంబంధించి ఇంటరాగేషన్‌లో ఏ విషయాలు చెప్పాడు అన్న అంశాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేసిన ఆత్కూరు ఎస్‌.ఐ, హనుమాన్‌ జంక్షన్‌ సీఐ, మరికొందరు అధికారులను కూడా పిలిపించారు. మృతుడు కుమారుడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్‌రెడ్డి బంధువులతో మాట్లాడారు. వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని