logo

మరుగున పడిన సఫాయి కర్మచారి

గ్రామ పంచాయతీలపై భారం తగ్గించడంతో పాటు, పారిశుద్ధ్య కార్మికులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జాతీయ సఫాయి కర్మచారి పథకం అధికారుల నిర్వాకానికి పూర్తిగా అటకెక్కింది.

Published : 05 Oct 2022 01:49 IST

స్వయం ఉపాధి కోల్పోయిన కార్మికులు
కంకిపాడు, న్యూస్‌టుడే

గ్రామ పంచాయతీలపై భారం తగ్గించడంతో పాటు, పారిశుద్ధ్య కార్మికులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జాతీయ సఫాయి కర్మచారి పథకం అధికారుల నిర్వాకానికి పూర్తిగా అటకెక్కింది. గతంలో మంజూరు చేసిన పరికరాలు తుప్పు పట్టిపోతున్నాయి. దీంతో లబ్ధిదారులకు ఈ పథకం దూరమయ్యింది.

కంకిపాడులో మూలకుచేరిన డ్రెయిన్‌ క్లీనర్‌

‘జాతీయ సఫాయి కర్మచారి ఫెడరేషన్‌’(ఎన్‌ఎస్‌కేఎఫ్‌) నిధులతో ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి 2018-19లో 35 శాతం రాయితీపై డ్రెయిన్‌ క్లీనింగ్‌ మిషన్‌, ట్రాక్టరు వంటి యంత్రాలను రుణ ప్రాతిపదికన అందజేశారు. మార్గదర్శకాల మేరకు ఒక్కో గ్రూప్‌లో ఆరుగురు సభ్యులుంటారు. ఒకరు యంత్రాన్ని నడపడానికి అవసరమైన లైసెన్సు కలిగి ఉండాలి. మిగతావారు డ్రెయిన్లలో మురుగు తీయడానికి సహాయపడాలి. తద్వారా ఒక్కో యూనిట్‌ ద్వారా ఆరు కుటుంబాలకు జీవనోపాధి కలుగుతుంది. అదే సమయంలో తక్కువ ఖర్చుతోనే గ్రామ పంచాయతీలు డ్రెయిన్ల పూడితతీత పనులు చేసుకునే అవకాశం ఉంది

నిర్వహణ లోపం.. : ఒక్కో గ్రూప్‌లోని ఆరుగురు సభ్యులకు నెలకు రూ.65 వేలను పంచాయతీరాజ్‌శాఖ చెల్లించాలి. డీఎల్‌పీవో ఆదేశాల మేరకు కేటాయించిన మండలంలోనే ఏ గ్రామంలోనైనా యంత్రం, ట్రాక్టరు, సభ్యులు పనిచేయాల్సి ఉంది. నెలవారీ కిస్తీ రూ.20 వేలు మినహాయించుకుని మిగతా రూ.45 వేలను సంఘానికి అందజేయాలి. డ్రెయిన్‌ క్లీనింగ్‌కు అనుకూలంగా యంత్రం తయారు చేయాలి. సాధారణ పొక్లెయిన్లతో పోల్చితే నిర్వహణ వ్యయం తక్కువ. పని అధికంగా జరుగుతుంది. ప్రస్తుతం గంటకు ప్రైవేటు పొక్లెయిన్లకు అద్దె రూ.1500 తీసుకుంటున్నారు. డ్రెయిన్‌ క్లీనర్‌ రోజుకు సరాసరిన 6 గంటలు పనిచేస్తుంది. నెలకు సుమారుగా 180 గంటల పాటు పనిచేయవచ్చు. బయట యంత్రం ద్వారా ఖర్చు రూ.2.70 లక్షలు ఖర్చవుతుంది. అదే డ్రెయిన్‌ క్లీనర్‌కు రూ.77 వేలు(రూ.65 వేలు సభ్యులకు కూలి+ నిర్వహణ రూ.12వేలు) సరిపోతుంది. ఇంత ముందుచూపుతో ప్రారంభించిన పథకం జిల్లాలో నీరుగారింది.

తుప్పు పట్టిపోతున్న యంత్రాలు : పూర్వ కృష్జా జిల్లాలో 30 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో విజయవాడ, నూజివీడు పంచాయతీ డివిజన్లలోని 14 మండలాలకు యూనిట్లు పంపిణీ చేశారు. డ్రెయిన్‌ క్లీనింగ్‌ యంత్రం, ట్రాక్టర్లుతో కలిపి వీటి మొత్తం విలువ(30×15.72) = రూ.4.71కోట్లు. ఈ యంత్రాలన్నీ గత మూడేళ్లుగా మూలన పడ్డాయి. దీనిపై సంబంధిత గ్రూప్‌ ప్రతినిధులు గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్నా ఫలితం శూన్యం.

బాధ్యులు ఎవరు?
- వడ్డాది సుధాకర్‌, యూనిట్‌ ప్రతినిధి, కంకిపాడు

గతంలో ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి ఇచ్చిన యంత్రం, ట్రాక్టరుతో ఒక నెల మాత్రం పని చేయించారు. ఆ తర్వాత మూలన పడేశారు. మాకు ఇవ్వాల్సిన కూలి రూ.65 వేలు అప్పటి నుంచి ఇవ్వడం లేదు. వీటి నెలవారీ కిస్తీ కడుతున్నారో? లేదో? తెలియదు. వ్యవధి ఐదేళ్లు పూర్తి కావస్తోంది. నిబంధనల మేరకు కిస్తీలు పూర్తిగా కట్టిన తర్వాత యంత్రం, ట్రాక్టరు మాకు అప్పగించాల్సి ఉంది. మా పేరుతో మంజూరైన రుణం చెల్లించకపోతే మమ్మల్ని బాధ్యులు చేస్తేం ఏం కావాలి.? ఇదే విషయమై స్పందనలో పలుమార్లు వినతి పత్రాలు అందజేశాం. లబ్ధిదారులను విచారించకుండానే, మేము విచారణకు రాలేదని ‘స్పందన’ నివేదికలో పేర్కొన్నారు. న్యాయపోరాటం తప్పదని పిస్తోంది.

లబ్ధిదారులకు నిరాశే
- శ్రీనివాసరావు, సఫాయి కర్మచారి సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఎన్‌ఎస్‌కేఎఫ్‌సీ, ఎస్సీ కార్పొరేషన్‌, పంచాయతీ రాజ్‌ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ దుస్థితేర్పడింది. యూనిట్‌తో స్వయం ఉపాధి పొందుదామని ఆశించిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వందల యూనిట్ల పరిస్థితి ఇలానే ఉంది. వీటి విలువ సుమారు రూ.63 కోట్లు ఉంటుంది. లబ్ధిదారులు 2,400 మంది ఉన్నారు. అందరికీ న్యాయం చేయాలి.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts