logo

వాలీబాల్‌ పోటీలో పాయింట్‌ విషయమై వాగ్వాదం

వాలీబాల్‌ ఆటలో ఒక్క పాయింటు విషయమై చెలరేగిన వాగ్వాదం గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేసే వరకు పరిస్థితి వెళ్లింది.

Published : 05 Oct 2022 01:49 IST

ఇరు వర్గాలపై కేసులు

పాతపాడు (విజయవాడ గ్రామీణం), న్యూస్‌టుడే: వాలీబాల్‌ ఆటలో ఒక్క పాయింటు విషయమై చెలరేగిన వాగ్వాదం గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేసే వరకు పరిస్థితి వెళ్లింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పాతపాడుకు చెందిన నల్లమోతు నరసింహారావు కొంత మందితో కలసి జట్టుగా ఏర్పడి మరీదు రవితేజ జట్టుతో ఈ నెల 3 నుంచి వాలీబాల్‌ ఆడుతున్నారు. నరసింహారావు జట్టు గెలిచేందుకు ఒక్క పాయింట్‌ అవసరమైన సమయంలో ప్రత్యర్థి జట్టులోని మరీదు రవితేజ, మరీదు రూపేష్‌, వాక రవి అనే వ్యక్తులు దురుసుగా ప్రవర్తించి, నరసింహారావును కొట్టారు. గొడవ పెద్దది అవుతుండడంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు జట్ల వారిని అక్కడి నుంచి పంపేశారు. అనంతరం రవితేజ, రూపేష్‌, రవితో పాటు మరికొంత మంది నరసింహారావుతో పాటు పలువురిని కులం పేరుతో దూషిస్తూ మరోసారి దౌర్జన్యం చేశారు. దీంతో రవితేజ తదితరులపై కేసు నమోదైంది.

మరో జట్టు తరుపున ఫిర్యాదు: పాతపాడులోని వాటర్‌ట్యాంకు గ్రౌండ్‌లో తాము వాలీబాల్‌ ఆడుతుండగా ప్రత్యర్థి జట్టులోని మనోజ్‌కుమార్‌, రాజ్‌కుమార్‌, ఉదయ్‌కిరణ్‌, నల్లమోతు నరసింహారావు, రవి కిరణ్‌, భగత్‌లు కలసి గెలవకుండానే గెలిచినట్టుగా పేర్కొంటూ తమపై దాడి చేశారని మరీదు రవితేజ నున్న పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తాము ఇంటికి వెళుతుంటే జీవన్‌రాజు, చిన్నబాబు, రూబెను, మరికొంతమంది తిట్టి దౌర్జన్యం చేశారని, అలాగే పెద్దబాబు, సునీల్‌ తూలనాడారని ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇది ఇలా ఉండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ నేపధ్యంలో గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని