logo

పన్ను వసూళ్లకు చెత్త మార్గం

చెత్తపన్నుపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పలు మర్గాల్లో ప్రజలపై ఒత్తిడి తెస్తూ వాలంటీర్లు, వార్డు కార్యదర్శులకు లక్ష్యాన్ని నిర్దేశించి మరీ ముక్కుపిండి వసూలు చేస్తోంది.

Published : 07 Oct 2022 06:14 IST

పింఛన్ల సొమ్ములో మినహాయిస్తున్నారు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ నగరపాలక సంస్థ: చెత్తపన్నుపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పలు మర్గాల్లో ప్రజలపై ఒత్తిడి తెస్తూ వాలంటీర్లు, వార్డు కార్యదర్శులకు లక్ష్యాన్ని నిర్దేశించి మరీ ముక్కుపిండి వసూలు చేస్తోంది. చెత్త పన్నును ఎలాగైనా వసూలు చేసేందుకు సామ, దాన, దండోపాయాలను వినియోగిస్తోంది.
నగరంలోని పేదలు అధికంగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా చెత్తపన్ను వసూలు చేస్తూ రోజువారీ, నెలవారీ వసూళ్ల లక్ష్యాన్ని నగరపాలక అధికారులు నిర్దేశిస్తున్నారు. 64 డివిజన్ల పరిధిలో ఉన్న 65,500 మంది వివిధ విభాగాల కింద పింఛన్లు తీసుకుంటున్నారు. ఇందులో 57 వేల మంది కేవలం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలే కావడం గమనార్హం. చెత్తపన్ను బకాయిలు ఉంటే.. ఆ మొత్తాన్ని ఆ ఇంట్లోని పింఛనర్లకు ఇచ్చే సొమ్ములో కోత పెడుతున్నారు. మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఇస్తామని వాలంటీర్లు తెగేసి చెబుతున్నారు. కొండ ప్రాంతాల్లో నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను సేకరించడం లేదు.  తాము చెల్లించలేమని చెబుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతినెలాË ఇస్తున్న పెన్షన్‌ తో బతుకు బండిని నడిపేవారు ఎంతో మంది ఉన్నారు. కుటుంబ, ఆరోగ్య అవసరాలకు ఈ సొమ్ముపైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు.
నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు, సచివాలయ కార్యదర్శులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రజలపై నిత్యం ఒత్తిడి తెస్తున్నారు.  దీనిపై ఇటీవల 16వ డివిజన్‌ వైకాపా కార్పొరేటర్‌ ఉమ్మడిశెట్టి రాధిక భర్త బహుదూర్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తదుపరి పింఛను సొమ్ము నుంచి చెత్తపన్ను వసూలు చేయకుండా ఆయన అడ్డుకోవాల్సి వచ్చింది. నగరంలోని కొండ ప్రాంతాలుగా పూర్వపు డివిజన్‌ ప్రాంతాలు 16 ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో చెత్తసేకరణ నిత్యం జరగకపోయినా వాలంటీర్లు, వార్డు పారిశుద్ధ్య కార్యదర్శులు మాత్రం పింఛనర్ల నుంచి నెలనెలా చెత్తపన్ను బలవంతంగా వసూలు చేస్తూనే ఉన్నారు. పేదలు ఉండే కొండ ప్రాంతాల్లో నెలకు రూ.30 వసూలు చేయాల్సి ఉండగా.. రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈఎంఐలు కట్టేందుకు నానా పాట్లు
నగరంలో చెత్త సేకరణకు 225 సీఎన్‌జీ వాహనాలు కార్పొరేషన్‌కు వచ్చాయి. పన్ను వసూళ్లు ప్రస్తుతం 40 శాతం మాత్రమే ఉంది. వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో 60 నుంచి 70 శాతం వరకు ఉంది. రోజువారీ వసూళ్లు రూ. 3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటోంది. వసూలైన మొత్తం వాహనాలను సరఫరా చేసిన సంస్థకు నెలవారీ కిస్తీల చెల్లింపులకే సరిపోతోంది. నెలకు రూ. 2.10 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ప్రస్తుతం కేవలం రూ. 1.05  కోట్ల నుంచి రూ. 1.20 కోట్ల వరకు వరకు మాత్రమే కార్పొరేషన్‌కు జమఅవుతోంది. వాహనాల నెలవారీ కిస్తీల కింద రూ. 1.16 కోట్లు చెల్లిస్తున్నారు. ఇలా వచ్చిన చెత్తపన్ను వచ్చినట్లు కేవలం వాహనాల కిస్తీల కింద సరిపోవడంతో మిగిలిన అవసరాలు, వ్యయాల కోసం పూర్తిస్థాయిలో చెత్తపన్ను వసూలు చేసేలా ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు అధికం అయ్యాయి. ఈ స్థితిలోనే క్షేత్రస్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది సామాజిక ఫింఛనుదార్లే లక్ష్యంగా చెత్తపన్ను వసూళ్ల కోసం ఇబ్బంది పెడుతున్నారు.

మినహాయిస్తున్నారు: పాపాయమ్మ, పింఛనుదారు
నేను ఒంటరిని. ఒక్కదానినే కుమార్తె వద్ద ఉంటున్నా. నాకు ఇల్లు లేదు. పింఛనుపైనే బతుకుతున్నా. మా అమ్మాయి కడుతుందని చెప్పినా వాలంటీరు వినిపించుకోలేదు. రూ. వంద మినహాయించుకుని పింఛను సొమ్ము ఇచ్చారు.
చెత్తను మేమే తగలబెడుతున్నాం: శాంతమ్మ, పెన్షనర్‌
కొండపైన చెత్తను తీసుకెళ్లేందుకు పారిశుద్ధ్య సిబ్బంది ఎవరూ రావడం లేదు. ఎన్నోసార్లు అడిగితే ఒకరొచ్చి స్కాన్‌చేసి పోతారు. మేమే చెత్తను పోగేసి తగలబెడుతున్నాం. అయినా మా నుంచి చెత్తపన్ను ముక్కుపిండి వసూలు చేయడం అన్యాయం.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని