logo

Vijayawada: ఎక్కువ మాట్లాడితే.. బయటకు పంపుతా: వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరిక

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: టిడ్కో ఇళ్లు, టీడీఆర్‌ బాండ్ల అక్రమాలపై విజిలెన్సు నివేదిక వచ్చాక కౌన్సిల్‌ ముందుంచి, తెదేపా నేతలను జైలుకు పంపుతామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు.

Updated : 01 Nov 2022 07:44 IST

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: టిడ్కో ఇళ్లు, టీడీఆర్‌ బాండ్ల అక్రమాలపై విజిలెన్సు నివేదిక వచ్చాక కౌన్సిల్‌ ముందుంచి, తెదేపా నేతలను జైలుకు పంపుతామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు. సభలో ఎక్కువ మాట్లాడితే బయటకు పంపుతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశంలో సోమవారం ఆయన ఈ వాఖ్యలు చేశారు. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన సోమవారం ఉదయం   ప్రారంభమైన కౌన్సిల్‌లో సంతాప తీర్మానాలు ఆమోదించిన అనంతరం మీడియాను సభలోకి అనుమతించాలంటూ సీపీఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు పట్టుబట్టడం కాస్తంత గందరగోళానికి దారితీసింది. దీనిపై పాలక సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుందామని మేయర్‌ సర్ది చెప్పారు. జగనన్న లేఅవుట్లలో నివాసాల కేటాయింపు, టిడ్కో ఇళ్ల లబ్ధిదార్ల వివరాలపై సత్యబాబు అడిన ప్రశ్నపై సభలో వాదోపవాదాలు సాగాయి. అనేకమందికి ఇళ్లు రద్దు అయ్యాయని, పలువురికి సొమ్ము తిరిగి చెల్లించలేదని ఆయన ఆరోపించారు. స్పందించిన వైకాపా సభ్యుడు జానారెడ్డి.. టిడ్కో ఇళ్ల గత అక్రమాలపై విజిలెన్సు విచారణ సంగతేంటని ప్రశ్నించారు. మరోవైపు ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం స్పందిస్తూ తాము అధికారంలోకి వచ్చాక దళారులెవరూ లేకుండా రూ.350 కోట్ల విలువైన స్థలాలను పేదలకు పంచామని తెలిపారు. గతంలో టిడ్కో ఇళ్లపేరిట వసూలు చేసిన సొమ్ములో రూ.16 కోట్లలో ఇప్పటికే రూ.10 కోట్లు తిరిగి చెల్లించామని, మిగిలినవి కూడా త్వరలో ఇస్తామని అన్నారు. సీపీఎం ఫ్లోర్‌లీడర్‌ సత్యబాబు కలించుకుని మాట్లాడుతూ ఎంపిక చేసినవారిలో అనేకమందికి ఇళ్లు దక్కకపోయినా, సంక్షేమ పథకాల్లో కోత పడుతుందని ఆరోపించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందిస్తూ ఆ విషయాన్ని మీ పక్కనే ఉన్న ‘పచ్చచొక్కా వాళ్ల’ను అడుగు..అంటూ ఎద్దేవా చేసేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

సమావేశం నిర్వహిస్తున్న మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

ఖాళీస్థలాలపై పన్ను బకాయిలే ఎక్కువ..  ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరం కొనసాగుతుండగా, 2021-22కు సంబంధించి డిఅండ్‌ఓ ట్రేడ్‌ లైసెన్సుల ఫీజుల బకాయిలు రూ.1.72 కోట్లు మాత్రమే చూపడం తగదని తెదేపా సభ్యుడు ముమ్మునేని ప్రసాద్‌ పేర్కొన్నారు. మొత్తం బకాయిలు ఎంతో తేల్చాలన్నారు. ఖాళీస్థలాల పన్ను బకాయిలు రూ.206.63 కోట్లు ఉంటే, 10 శాతం కూడా వసూలు చేయలేకపోయారని ఆరోపించారు. సీపీఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు మాట్లాడుతూ బకాయిల విషయంలో వన్‌టైం సెటిల్‌మెంట్‌ లేదా వడ్డీమాఫీ చేయాలని సూచించారు. వైకాపా కార్పొరేటర్‌ జానారెడ్డి మాట్లాడుతూ ఇళ్లు కట్టుకున్నా, వీఎల్‌టీ కొనసాగుతుందని ఆరోపించారు. ఈ సమస్యల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఉప మేయర్‌ అవుతు శ్రీశైలజారెడ్డి కోరారు.   మేయర్‌ కల్పించుకుని ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిగా స్పందించిన వైకాపా కార్పొరేటర్‌ బండి పుణ్యశీల.. అధికారపక్షంగా సరైన జవాబు చెప్పించాల్సిన మనకే వాస్తవాలు తెలియడం లేదని, ఇక ప్రజలకు ఏం అర్థం అవుతాయని ప్రశ్నించారు. ఆపై డిప్యూటీ కమిషనర్‌(రెవెన్యూ) వెంకట లక్ష్మి సమాధానమిస్తూ ఖాళీస్థలాల యజమానుల వివరాలు పూర్తిగా తెలియడం లేదని,  ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఆపై కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడారు. అనంతరం సంబంధిత సమస్యలపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుందామని మేయర్‌ సభలో ప్రకటించారు.బీ నగరంలో భూగర్భ డ్రెయినేజీ అధ్వానంగా ఉందని సభ్యులు పేర్కొనగా, స్పందించిన కమిషనర్‌ పైపులను శుభ్రం చేసేందుకు టెండర్లు పిలుస్తున్నామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని