logo

కృష్ణ కృష్ణా ..!

‘కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలలకు సంబంధించిన పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అనేక అవకతవకలు చోటుచోసుకున్నాయి.

Updated : 09 Nov 2022 07:24 IST

మూల్యాంకనంలో అవకతవకలు
విశ్వవిద్యాలయం తీరుపై విమర్శల వెల్లువ

‘కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలలకు సంబంధించిన పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అనేక అవకతవకలు చోటుచోసుకున్నాయి.  సెమిస్టర్‌ 1, 3కి సంబంధించి ఆరు వేలకు పైగా పేపర్లుండగా.. కేవలం 25మంది అధ్యాపకులు మూడే రోజుల్లో వీటిని దిద్దేయడం గమనార్హం. రోజుకు 150 నుంచి 200 పేపర్ల వరకూ దిద్దేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
విశ్వవిద్యాలయంలో అక్టోబరు 27, 28, 29 ఈ మూడు రోజుల్లోనే పేపర్లన్నీ దిద్దేశారు. విద్యార్థులు ఏం రాశారు, సమాధానలు సక్రమంగా రాశారా, లేదా అనేవి చూసి మార్కులు వేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ.. ఈ నిబంధనను గత కొంతకాలంగా పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఎవరికి నచ్చినన్ని పేపర్లను.. వారికి ఇచ్చేస్తూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసి వెళ్లిపోమనేలా పరిస్థితిని మార్చేశారు. ఒక పరీక్ష పత్రాన్ని నిశితంగా పరీశీలించి.. సక్రమంగా దిద్దాలంటే.. రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కో అధ్యాపకుడు 30కు మించి దిద్దలేరు.

కనీస పర్యవేక్షణ లేకపోవడంతో..

ప్రస్తుతం ఏ బీఈడీ కళాశాలలోనూ బోధనా సిబ్బంది సరిగా లేరు. అరకొర సిబ్బంది మూల్యాంకనకు వచ్చి విచ్చలవిడిగా దిద్దేస్తుండడంతో.. విద్యార్థులంతా ఉత్తీర్ణులైపోతారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాల్సిన వాళ్లు, ఫెయిల్‌ అవ్వాల్సిన వాళ్లు ఇద్దరూ ఒకేరకమైన మార్కులను తెచ్చుకుంటారు. ఫెయిలవ్వాల్సిన వాళ్లు ఉత్తీర్ణులైపోయి.. రేపు ఉపాధ్యాయులైపోతారు. దీనివల్ల విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఇలాంటి వారిపై ఉంటుంది. విద్యాప్రమాణాలు పూర్తిగా పడిపోతాయి.ఒక సబ్జెక్టు అధ్యాపకులు.. మరో సబ్జెక్టుకు సంబంధించిన పేపర్లను దిద్దుతున్నారు.

విద్యార్థులు ఏం రాశారనేది చూడకుండా..

కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో 22 బీఈడీ కళాశాలలున్నాయి. వీటిలో కొన్నింటిలో వంద, మరికొన్ని కళాశాలల్లో 50మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఈ లెక్కన మొత్తంగా.. అన్ని కళాశాలల్లో కలిపి 1500మంది వరకూ విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారు. రెండేళ్ల బీఈడీ కోర్సులో నాలుగు సెమిస్టర్లుంటాయి. ఆరు నెలలకు ఒక సెమిస్టర్‌ జరుగుతుంది. తాజాగా ఒకటి, మూడో సెమిస్టర్లకు సంబంధించిన ప్రశ్నపత్రాల మూల్యాంకనం విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ రెండు సెమిస్టర్లకు సంబంధించి కనీసం ఆరు వేల పేపర్లకు పైనే ఉంటాయి. వీటన్నింటినీ 20మంది అధ్యాపకులు కేవలం మూడు రోజుల్లో దిద్దడం అంటే.. కనీసం విద్యార్థులు ఏం రాశారు అనేది చూడకుండా మార్కులు వేసుకుంటూ వెళ్లిపోవడమే అవుతుంది. తాజాగా అలాగే చేశారు. ఒక్కో పేపరుకు తమకు వచ్చే డబ్బులను మాత్రమే చూసుకుని మూల్యాంకనం చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.

విద్యావిభాగం ఏదీ?

కృష్ణా విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ లేదు. దీంతో బీఈడీ కళాశాలలు, అధ్యాపకులు, పరీక్షలు, మూల్యాంకనం.. సహా దేనిపైనా సరైన పర్యవేక్షణ లేదు. ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్‌నే బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా పెట్టి ప్రక్రియను నడిపిస్తున్నారు. మూల్యాంకనం పూర్తయిన తర్వాత అధ్యాపకులకు డబ్బులు ఇచ్చే సమయంలోనైనా.. ఎవరెవరు ఎన్ని పేపర్లను దిద్దారనేది పర్యవేక్షిస్తే.. అనేక అవకతవకలు వెలుగులోనికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పైగా.. ఏ సబ్జెక్టు పేపర్లను, ఏ అధ్యాపకులు దిద్దారనేది కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పటికైనా దీనిపై విశ్వవిద్యాలయం ఉన్నతస్థాయి అధికారులు దృష్టిసారించి ప్రక్షాళన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇప్పటికే చాలా బీఈడీ కళాశాలల్లో పరిస్థితి పూర్తిగా గాడి తప్పిపోయింది. కనీసం స్థాయిలోనూ అధ్యాపకులు లేరు. రికార్డులలో మాత్రమే పేర్లు కనిపిస్తున్నాయి. సదరు అధ్యాపకులు ఇక్కడ ఉండరు. ఎవరైనా పర్యవేక్షణకు వస్తున్నారని తెలియగానే.. తీసుకొచ్చి హాజరు చూపిస్తున్నారు. ఇప్పుడు పరీక్ష పత్రాల మూల్యాంకనం సైతం పూర్తిగా గాడి తప్పడంతో.. ఇక విద్యావ్యవస్థ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు