logo

Super Star Krishna: నిను మరవదు కృష్ణా

తన తేనె లాంటి మనసుతో అందరికీ అభిమానవంతుడయ్యారు. సాహసమే ఊపిరిగా చిత్రసీమలో అడుగుపెట్టి అసాధ్యుడు అనిపించుకున్నారు. తన ప్రవర్తనతో అందరి మనసుల్లో అభిమాన సింహాసనంపై కూర్చున్నారు. ఈనాడు ఆయన లేరంటే అభిమానులతో పాటు అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

Updated : 16 Nov 2022 09:25 IST

జిల్లాతో సూపర్‌స్టార్‌కు ప్రత్యేక అనుబంధం

న్యూస్‌టుడే- కంకిపాడు, అవనిగడ్డ, గన్నవరం గ్రామీణం, పామర్రు గ్రామీణం

బుర్రిపాలెం బుల్లోడు..

న తేనె లాంటి మనసుతో అందరికీ అభిమానవంతుడయ్యారు. సాహసమే ఊపిరిగా చిత్రసీమలో అడుగుపెట్టి అసాధ్యుడు అనిపించుకున్నారు. తన ప్రవర్తనతో అందరి మనసుల్లో అభిమాన సింహాసనంపై కూర్చున్నారు. ఈనాడు ఆయన లేరంటే అభిమానులతో పాటు అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. విజయవాడతో పాటు, ఉమ్మడి కృష్ణాజిల్లాతో కృష్ణకు ఎంతో అనుబంధం ఉంది. అభిమానులు జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.


నవరంగ్‌ థియేటర్‌లో ప్రత్యేక సీటు

సినీ నటుడు కృష్ణ మృతికి సంతాప సూచికంగా.. మంగళవారం సినిమా థియేటర్‌లో ప్రేక్షకుల మధ్యలో ఒక సీటును ప్రత్యేకంగా రిజర్వు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు విజయవాడలోని నవరంగ్‌ థియేటర్‌ అధినేత ఆర్‌.వి.భూపాల్‌ ప్రసాద్‌. ఆ సీటులో కృష్ణ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. సూపర్‌స్టార్‌ విజయవాడకు ఎప్పుడు వచ్చినా తన థియేటర్‌కు తప్పనిసరిగా వచ్చేవారని గుర్తు చేసుకున్నారు.


పలుసార్లు రిమ్మనపూడికి..

సూపర్‌స్టార్‌  కృష్ణ సోదరి లక్ష్మీతులసిని రిమ్మనపూడికి చెందిన సినీ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణబాబుకి ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో 1972 ఏప్రిల్‌ 9న జరిగిన వివాహ వేడుకలకు నటుడు కృష్ణ రిమ్మనపూడి విచ్చేశారు. అనంతరం 1973 మేలో మచిలీపట్నంలో జరిగిన దేవుడు చేసిన మనుషులు చిత్రం షూటింగ్‌లో పాల్గొంటూ మరోమారు రిమ్మనపూడి తన సోదరి ఇంటికి వచ్చారు. 1994లో తన సోదరి దంపతులు కొండాయిపాలెం సమీపంలో తలపెట్టిన ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్లో భాగంగా జరిగిన భూమిపూజ, శంకుస్థాపనకు కుటుంబ సమేతంగా విచ్చేశారు. కృష్ణ చెల్లెలు భర్త సూర్యనారాయణబాబు నిర్మాతగా 1977లో తొలి చిత్రంగా ‘మనుషులు చేసిన దొంగలు’ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం రిమ్మనపూడి ప్రముఖులంతా హాజరై ఆయనతో సరదాగా గడిపారు. కృష్ణతో గ్రామానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు సంతాపం తెలిపారు.


ఉంగుటూరు మండలంతో ఘట్టమనేని కృష్ణకు విడదీయలేని అనుబంధం ఉంది. మూకీ నుంచి తొలి టాకీ చిత్రం మాలపిల్ల తీసిన నిర్మాత, దర్శకుడు గూడవల్లి రాంబ్రహ్మం స్వగ్రామమైన నందమూరు సమీపంలోని తరిగొప్పల, మానికొండ పరిసరాల్లో పలు చిత్రాల షూటింగ్‌లు చేశారు. పాడి పంటలు, పంచాయతీ సినిమాల్లో పలు సన్నివేశాలను తరిగొప్పల రైల్వేస్టేషన్‌, ఆనుకొని ఉన్న గోదాంల వద్ద తీశారు.  ఈ గ్రామాల్లో షూటింగ్‌ల సమయంలో కృష్ణ తమతో ఎంతో చలాకీగా ఉండేవారని స్థానికులు తెలిపారు.  


కంకిపాడు ప్రాంతంలో షూటింగ్‌

సూపర్‌స్టార్‌ కృష్ణకు కంకిపాడు ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉంది. మండలంలోని కోలవెన్ను, పునాదిపాడు, ఈడుపుగల్లు గ్రామాలకు చెందిన పలువురు సినీరంగంలో కీలకపాత్ర వహించడమే దీనికి కారణం. సమీప మానికొండ కేంద్రంగా ‘పాడి పంటలు’ సినిమా తీసినప్పుడు కోలవెన్ను పరిధిలోని పంట పొలాలు, చెరువు, కాల్వ కట్టలపై వ్యవసాయ సంబంధిత దృశ్యాలను చిత్రీకరించారు. సూపర్‌హిట్‌ ‘నంబర్‌వన్‌’ నిర్మాత కోలవెన్నుకు చెందిన అడుసుమిల్లి వెంకటేశ్వరరావు(పసిబాబు) కావడంతో మరింత బంధం ఏర్పడింది. ‘రౌడీ అన్నయ్య’ చిత్రంలోని ప్రధాన సన్మివేశాలను కంకిపాడు పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. సమీప బంధువులున్న బొడ్డపాడుకు కృష్ణ తరచూ వస్తూ ఉండేవారు. పునాదిపాడులో వారం పాటు జరిగిన ‘ఉండమ్మా బొట్టుపెడతా’ చిత్రీకరణలో కృష్ణ పాల్గొన్నారు. మూడు నాలుగు సినిమాల్ల్లో ‘కంకిపాడు’ను తన ఊరుగా కృష్ణ(కథాపరమైన సన్నివేశాల్లో) ఉటంకించడం విశేషం. కంకిపాడు కేంద్రంగా కృష్ణ అభిమాన సంఘాలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించం ప్రస్తావనీయం.  


దుర్గా కళా మందిరంలో చిత్రాల ప్రదర్శన

సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన పలు చిత్రాలను వరుసగా వారం రోజుల పాటు దుర్గాకళామందిర్‌ ప్రదర్శిస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సహాయ కార్యదర్శి, దుర్గా కళా మందిర్‌ నిర్వాహకుడు పాలెపు రామారావు తెలిపారు. కృష్ణ మరణించరానే వార్త తెలియగానే షాక్‌కు గురయ్యానని ఆయన   పేర్కొన్నారు.


‘దివిసీమ’లో జ్ఞాపకాలు

సూపర్‌ స్టార్‌ కృష్ణకు మాజీ మంత్రి దివంగత మండలి వెంకటకృష్ణారావుతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1975లో నిర్వహించిన ప్రథమ ప్రపంచ తెలుగు మహా సభలకు నిధులు సేకరించడంలో కృష్ణతో మండలికి సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత 1977 మేలో అవనిగడ్డలో జరిగిన రాష్ట్ర నాటకోత్సవాలకు కృష్ణ, విజయ నిర్మల దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  1977 నవంబరులో దివిసీమ ఉప్పెన వచ్చిన సందర్భంగా కృష్ణ రూ.10 వేలు విరాళంగా అందించారు.  


కృష్ణ పేరుతో పంపిణీ కార్యాలయం.. హీరో కృష్ణకు వీరాభిమానిని. నిక్కర్లు వేసుకునే రోజుల్లోనే.. కృష్ణ సినిమాలను విడుదలైన మొదటి రోజే చూసేవాడిని.   ఆయనపై అభిమానంతో కృష్ణ సినీ చిత్ర పంపిణీ కార్యాలయాన్ని 35ఏళ్ల కిందట స్థాపించారు. నా జీవితంలో సగం రోజులు కృష్ణతోనే గడిపాను.   అభిమానులు చెన్నై వెళితే.. భోజనం పెట్టి రైలు టికెట్టు ఖర్చులు ఇచ్చి పంపేవారు. కృష్ణకు గాంధీనగర్‌లో చిత్ర పంపిణీ కార్యాలయం ఉన్నా.. తనపై అభిమానంతో ఆయన చిత్రాలను పంపిణీ చేసే హక్కులను నాకే ఇచ్చే వారు. ఇలా దాదాపు 75 చిత్రాల వరకు పంపిణీ చేశాను.

- పందిరి కృష్ణ, గాంధీనగర్‌


కోలవెన్ను బిడ్డగానే భావిస్తాం.. నేను సూపర్‌స్టార్‌ అభిమానిని. కృష్ణ కోలవెన్నులో షూటింగ్‌కు వచ్చారని తెలియగానే పరుగున వచ్చేవాడిని. నా మిత్రుడు అడుసుమిల్లి వెంకటేశ్వరరావు(పసిబాబు) నంబర్‌వన్‌ సినిమా తీసిన సమయంలో నేరుగా పరిచయం ఏర్పడింది. సినీ పరిశ్రమలో అంత క్రేజ్‌ ఉన్న కథనాయకుడు మాటలు మృదువుగా ఉండేవి. ఆయనను కోలవెన్ను బిడ్డగానే భావిస్తుంటాం. డేరింగ్‌, డాషింగ్‌ హీరో కనుమరుగవడం బాధాకరం.

- తుమ్మల చంద్రశేఖర్‌, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌


ఆయన నోటి వెంట ఒక కఠినమైన పదాన్నీ వినలేదు.. దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, రామరాజ్యంలో రక్తపాతం, పాడి పంటలు వంటి కృష్ణ స్వీయ చిత్రాలకు మేమే పంపిణీదారులం. వీటితోపాటు ఆయన నటించిన మరో 20 చిత్రాలు తారకరామా ద్వారా విడుదలయ్యాయి. ఆ సమయంలో ప్రేక్షకుల స్పందనపై క్షేత్ర స్థాయిలో అవగాహన కోసం కృష్ణతో కలిసి వెళ్లేవాడిని. 40 ఏళ్ల పరిచయం, సంభాషణలº్ల ఆయన నోటి వెంట కఠినమైన పదాన్ని వినలేదు. సినీ జగత్తులో ఒక మేరు శిఖరం వాలిపోయింది.

- అనుమోలు జగన్మోహనరావు, మాజీ సర్పంచి పునాదిపాడు, తారకరామా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ అధినేత


షూటింగ్‌కు వెళితే.. చదువుకోమని చెప్పారు.. నాకు సూపర్‌స్టార్‌ కృష్ణ అంటే విపరీతమైన అభిమానం. 13 ఏళ్ల వయసులో చెన్నైలో స్టూడియోల ఎదుట కృష్ణ కోసం ఎదురు చూసేవాడిని. ఆయన నన్ను పిలిపించి ఎక్కడ నుంచి వస్తున్నావ్‌ అని అడిగి తెలుసుకున్నారు. టిక్కెట్టు లేకుండా వచ్చానని చెబితే కోప్పడ్డారు. అలా చేయవద్దు. ముందుగా చదువుకోమని సూచించారు. కృష్ణ విజయవాడ వస్తే.. మా అమ్మ వండిన చేపలకూర, ఉలవచారు, పుట్టగొడుగులు కూర తినేవారు.ప్రతి సంవత్సరం శిర్డీ సంస్థాన్‌ నుంచి క్యాలెండర్లు తీసుకువచ్చి వాటిని కృష్ణ, విజయనిర్మల హైదరాబాద్‌లో ఆవిష్కరించేవారు. 

 - సుధాస్వామి, సూపర్‌స్టార్‌ కృష్ణ-మహేష్‌బాబు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని