logo

బాబోయ్‌ ఇదేం కిరికిరీసర్వే..!

రెవెన్యూ రికార్డుల్లో కచ్చితత్వం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వే తప్పులతడకగా కొనసాగుతుందనే దానికి అద్దం పట్టేలా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో పలు ఉదంతాలు వెలుగులో వచ్చాయి.

Published : 24 Nov 2022 04:58 IST

తప్పులతడకగా వివరాలు
నాలుగు నెలలకు 9(2) నోటీసులు
హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే

రెవెన్యూ రికార్డుల్లో కచ్చితత్వం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వే తప్పులతడకగా కొనసాగుతుందనే దానికి అద్దం పట్టేలా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో పలు ఉదంతాలు వెలుగులో వచ్చాయి. కొన్ని భూ వివరాలు అసలు నమోదు కాకపోవడం, అడంగల్‌లో ఉన్న విస్తీర్ణం కంటే కొందరికి తక్కువగా, మరికొందరికి ఎక్కువగా నమోదు చేయడం గమనార్హం. పైగా వ్యాలిడేషన్‌ ప్రక్రియ అనంతరం జారీ చేయాల్సిన 9(2) నోటీసులను నాలుగు నెలల తర్వాత ఇవ్వడం దుమారం రేపుతుంది. రీసర్వేలో జరిగిన తప్పిదాలతో కంగుతిన్న పలువురు రైతులు బుధవారం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేయడం గమనార్హం.

సర్వే జరిగిన అయిదు నెలలకు

రీ సర్వేలో ముందుగా గ్రామానికి సరిహద్దులు (ఔటర్‌ బౌండరీ) నిర్ణయించి, డ్రోన్‌ ద్వారా ఓఆర్‌ఐ (ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌) సేకరిస్తారు. దీనిపైనే భూములు ఏ ఆకృతిలో ఉన్నాయనేది స్పష్టంగా తెలిసేలా గ్రౌండ్‌ ట్రూతింగ్‌ చేస్తారు. అనంతరం రికార్డులు, వాస్తవంలో ఉన్న హద్దుల ఆధారంగా కొలతలు (వ్యాలిడేషన్‌) వేసి, రైతులకు 9(2) నోటీసులు ఇవ్వాలి. అభ్యంతరాలేమైనా ఉంటే పరిగణనలో తీసుకొని, ఫాం-31, 32 రూపొందించి వీఆర్వో లాగిన్‌కు పంపుతారు. అక్కడ రికార్డుల ప్రకారం ఎవరున్నారు, వాస్తవంలో ఎవరి ఆధీనంలో ఉన్నది నిర్ధరించుకొని, ఆ వివరాలతో తహసీల్దార్‌ స్థాయిలో డ్రాఫ్ట్‌ ల్యాండ్‌ రిజిస్టర్‌ తయారుచేసి, ఆర్డీవోకు వాటిని నివేదిస్తారు. తుది అంకంలో జేసీ పర్యవేక్షణలో 13 నోటిఫికేషన్‌ జారీ చేస్తూ, ఆర్వోఆర్‌ సిద్ధం చేయాలి. కానీ రంగన్నగూడెంలో వారం క్రితం వరకు రైతులకు 9(2) నోటీసులు ఇవ్వలేదనే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. చాలామందికి వారం నుంచే ఈ నోటీసులు జారీ చేస్తున్నారు. వాటిపై ఈ ఏడాది జులై ఎనిమిదో తేదీ ఉండటం గమనార్హ.

ఇవిగో నిదర్శనాలు..

* కొలుసు సత్యనారాయణ అనే రైతుకు అడంగల్‌ ప్రకారం ఆర్‌.ఎస్‌ నంబర్లు 228/6సి, 228/7, 229/2లలో 2.56 ఎకరాల భూమి ఉంది. ఇటీవల ఇచ్చిన 9(2) నోటీసులో 1.59 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపారు.
* ఆలపాటి సుబ్బారావు అనే కర్షకుడికి ఆర్‌.ఎస్‌ నంబర్లు 14/3ఎ, 14/3సిలలో 1.49 ఎకరాలున్నట్లు అడంగల్‌లో నమోదై ఉంది. 9(2) నోటీసులో 83 సెంట్లు మాత్రమే ఉన్నట్లు నమోదు చేశారు
* చిలకపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఆర్‌.ఎస్‌ నంబర్లు 18/1, 18/2లలో 2.37 ఎకరాల భూమి ఉంది. ఆయనకు ఇంతవరకు 9(2) నోటీసు ఇవ్వలేదు.


పక్కాగా జరగలేదు

మా గ్రామంలో రీ సర్వే ప్రక్రియ తూతూ మంత్రంగా చేశారు. సర్వే సమయంలో భూముల వద్దకు వచ్చి సక్రమంగా నిర్ధరించలేదు. ఇప్పటికీ 9(2) నోటీసులు వీఆర్వో వద్దే ఉన్నాయి. రైతు నాయకులు గట్టిగా నిలదీస్తే వారం నుంచి కార్యాలయానికి పిలిచి నోటీసులు ఇస్తున్నారు. దీనిపై తహసీల్దార్‌ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం.

-ఆళ్ల కిశోర్‌, రైతు


నమోదు కాకుంటే ఎలా?

నా భూములతో పాటు, మా తల్లికి చెందిన పొలం రీ సర్వే తర్వాత కచ్చిత వివరాలు నమోదు చేశారో లేదో అర్థం కావడంలేదు. ఇప్పటివరకు 9(2) నోటీసులు ఇవ్వలేదు. సర్వే మాత్రం తుది దశకు వచ్చిందంటున్నారు. వివరాలేమిటో తెలీదు. విస్తీర్ణం సరిగా నమోదు కాకుంటే అభ్యంతరాలు ఎలా తెలియజేయాలి? ఒకవేళ తెలిపినా ఎంతవరకు సరిదిద్దుతా రనేది ప్రశ్నార్థకంగా ఉంది.

-శ్రీనివాసరావు, కర్షకుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని