logo

నేతల సంకల్పసిద్ధి..!

కొత్త సంస్థ.. వ్యాపార అనుభవం లేదు.. కానీ ఆరు నెలలు.. మూడు రాష్ట్రాలు.. దాదాపు 20వేల మంది సభ్యులు.. రూ.250 కోట్లు  వసూలు.. కార్యాలయాలు లేవు.. ప్రచారం లేదు.. ఎలా సాధ్యం..? ఇవి పోలీసు లెక్కలు.

Published : 27 Nov 2022 05:12 IST

సిఫార్సులతోనే రూ.వందల కోట్లు సేకరణ
ఈనాడు, అమరావతి

కొత్త సంస్థ.. వ్యాపార అనుభవం లేదు.. కానీ ఆరు నెలలు.. మూడు రాష్ట్రాలు.. దాదాపు 20వేల మంది సభ్యులు.. రూ.250 కోట్లు  వసూలు.. కార్యాలయాలు లేవు.. ప్రచారం లేదు.. ఎలా సాధ్యం..? ఇవి పోలీసు లెక్కలు. అనధికారికంగా 25వేల మంది పైగా సభ్యులు.. సుమారు రూ.500 కోట్ల పైగా వసూలు అంచనా. దీని వెనుక సూత్రధారులు ఎవరు..? పది నెలల్లో సొమ్మును ఆరు రెట్లు చేస్తామని భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించిన సంకల్పసిద్ధి సంస్థ వెనుక భారీ తలకాయలే ఉన్నట్లు తెలిసింది. దీని అసలు సూత్రధారులు ఎన్నికలే లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది పెద్దలకు ముందస్తు సమాచారం ఇచ్చి వారి అనుమతితో ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మరో ఆగ్రిగోల్డ్‌ తరహాలో భారీ ఎత్తున వసూలు చేసి.. కొంత మొత్తాలను తిరిగి ఖాతాదారులకు చెల్లింపులు జరిపి మంచిపేరు సంపాదించాలనే పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అసలు సూత్రధారులను వెలుగులోకి రానీయకుండా కాపాడేందుకు ఉన్నత స్థాయిలోనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ కేసును కొలిక్కి తెస్తామని చెబుతున్న పోలీసులు, మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మోసం కిందనే జమ కట్టనున్నారు.

గన్నవరం, గుడివాడలతో మొదలు..

కొంతమంది కీలక నేతలు తమ అనుచరులకు, ప్రజాప్రతినిధులకు సిఫార్సులు చేయడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆర్థికంగా ఉన్నవారిని గుర్తించి పెట్టుబడి పెట్టించినట్లు తెలిసింది. కొంతమంది వ్యాపారులు ఖాతాదారులుగా చేరారు.  ప్రస్తుతం వారు పోలీసుల ముందుకు రావడానికి ఇష్టపడటంలేదు.కేవలం రూ.10వేలు నుంచి రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టిన వారే పోలీసుల ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది మే 17న సంస్థ గన్నవరం కేంద్రంగా ఆవిర్భవించింది. గుత్తా వేణుగోపాల్‌కృష్ణ, ఆయన కుమారులు ఎండీ, డైరెక్టర్లుగా ఉన్నారు. వీరి ఆర్థిక పరిస్థితి నామమాత్రమే. దీనికి సూత్రధారులు వేరే ఉన్నట్లు సమాచారం. గన్నవరం, గుడివాడల్లో మొదట కార్యాలయాలు ఏర్పాటు చేశారు. తర్వాత విజయవాడ, ఇతర ప్రాంతాలకు విస్తరించారు. నిడమానూరులో డమ్మీ  ఈ మార్టు ఏర్పాటు చేశారు.

ఉద్యోగుల విచారణ!

సంకల్పసిద్ధి సంస్థ డమ్మీ ఈ మార్ట్‌లను విజయవాడలోని దుర్గాగ్రహారం, నిడమానూరులో  ఏర్పాటు చేసింది. ఇక్కడ నియమించిన సిబ్బందిని పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి విచారణ చేస్తున్నారు. వారి కుటుంబీకులను తీసుకువచ్చినట్లు తెలిసింది. వీరంతా రూ.10వేలు, రూ.15వేల వేతనానికి కుదిరిన సిబ్బంది. తమకు వివరాలు తెలియవని చెబుతున్నారు.

ఎన్నికల ఫండ్‌ కోసం..!

ఈ సంస్థ ముందుగానే బోర్డు తిప్పేయాలని ప్రణాళికతోనే ఏర్పాటు చేశారని తెలిసింది. భారీ ఎత్తున సేకరించిన నిధులు ఎన్నికల ఫండ్‌కు వనియోగించాలనేది వ్యూహం. ఖాతాదారుల్లో తిరుగుబాటు వచ్చేనాటికి బోర్డు తిప్పేయాలనేది ముందస్తు వ్యూహంగా కనిపిస్తోంది.

సీఐడీ ఏదీ..?

సాధారణంగా మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ మోసాల కేసులను సీఐడీ విచారిస్తుంది. కానీ ఈ కేసును విజయవాడ నగర పోలీసుల పరిధిలో సైబర్‌ క్రైం, టాస్క్‌ఫోర్సు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏ విషయం బహిర్గతం కానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సంస్థ డిపాజిట్ల సేకరణ ముందుగానే సీఐడీలో ఓ కీలక అధికారికి సమాచారం ఉందని, ఆయన వేణుగోపాలకృష్ణను విచారించి వదిలేశారనే ప్రచారం జరుగుతోంది. దీని వెనుక భారీగానే డీల్‌ ఉందని చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తుపై విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో కేసు కొలిక్కి వస్తుందని వివరించారు. మీడియా ఊహాగానాలు రాస్తోందని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని