logo

మహిళా సర్పంచికి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి : తెదేపా

చల్లపల్లి సర్పంచి పైడిపాముల కృష్ణకుమారిపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అగౌరవపరుస్తూ ప్రవర్తించిన తీరు దారుణమని తెదేపా నాయకులు తీవ్రంగా ఖండించారు.

Updated : 27 Nov 2022 05:33 IST

చల్లపల్లి, న్యూస్‌టుడే : చల్లపల్లి సర్పంచి పైడిపాముల కృష్ణకుమారిపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అగౌరవపరుస్తూ ప్రవర్తించిన తీరు దారుణమని తెదేపా నాయకులు తీవ్రంగా ఖండించారు. సాటి ప్రజాప్రతినిధి, అందునా మహిళా సర్పంచి, దళిత నాయకురాలనే కనీస గౌరవం లేకుండా అందరిముందు ఏకవచనంతో మాట్లాడడాన్ని తప్పుబట్టారు. చల్లపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట శనివారం సాయంత్రం తెదేపా, తెలుగు మహిళలు, దళిత నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సర్పంచిపై సభ్యత మరచి ఎమ్మెల్యే మాట్లాడిన తీరు అత్యంత హేయమన్నారు. మద్యం మత్తులో ఎవరో ఫ్లెక్సీకి మట్టి రాస్తే దురుద్దేశంతో తెదేపాకు ఆపాదించడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు సర్పంచి పైడిపాముల కృష్ణకుమారికి 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే అతని ఇంటిని ముట్టడిస్తామన్నారు. ఎంపీపీ కోట విజయరాధిక, వైస్‌ ఎంపీపీ మోర్ల రాంబాబు, తెదేపా జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, బండె కనకదుర్గ, విశ్వనాథపల్లి పాప, రాజులపాటి అంకమ్మ, పైడిపాముల స్వప్న, బోలెం నాగమణి, దివి యుగంధరి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ, పెదపాలెం సర్పంచి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళా సర్పంచిని అవమానించడం తగదు : మండలి

అవనిగడ్డ, న్యూస్‌టుడే : చల్లపల్లిలో మహిళా సర్పంచిపై ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు ఆయన విచక్షణకే వదిలేస్తున్నానని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. ఏపార్టీ వారైనా తగిన గౌరవం ఇచ్చి మాట్లాడాలని హితవు చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీకి చెందిన మహిళా సర్పంచిపై ఏకవచనంతో మాట్లాడి అవమానించడం తగదన్నారు. యాసం చిట్టిబాబు, బండే శ్రీనివాసరావు, నడకుదిటి జనార్దనరావు, బండే కనకదుర్గ, మత్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని