logo

Amaravati: జగన్‌ది అబద్ధాల్లో గిన్నిస్‌ రికార్డు: మండిపడిన రాజధాని రైతులు

రాజధానికి కేటాయించిన భూములను పేదల ఇళ్ల స్థలాలకు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందనే దుర్మార్గం దేశంలో వస్తుందని ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండకపోవచ్చని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలను రాజధాని రైతులు తీవ్రంగా ఖండించారు.

Updated : 28 Nov 2022 09:19 IST


తుళ్లూరు శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రాజధానికి కేటాయించిన భూములను పేదల ఇళ్ల స్థలాలకు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందనే దుర్మార్గం దేశంలో వస్తుందని ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండకపోవచ్చని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలను రాజధాని రైతులు తీవ్రంగా ఖండించారు. పచ్చి అబద్ధాలతో గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కే ముఖ్యమంత్రి జగన్‌ మాత్రమేనని ఎద్దేవా చేశారు. అమరావతి బృహత్‌ ప్రణాళికను మార్చి రాజధానిని నాశనం చేయాలనే కుట్రతోనే వైకాపా నాయకులు ఆర్‌-5 జోన్‌ను తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఒక సామాజిక వర్గానికి చెందినదంటూ కులాల మధ్య చిచ్చుపెట్టి ముఖ్యమంత్రి రాజకీయ చదరంగం ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ విశాఖలో ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. రాజధానిలో ఉన్న పేదలకే పనులు లేక వలస పోతుంటే ఇతర ప్రాంతాల వారిని తీసుకొచ్చి ఎలా పోషిస్తారో తెలపాలని డిమాండు చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో రైతులు, కూలీలు, మహిళలు చేస్తున్న నిరసనలు ఆదివారానికి 1076వ రోజుకు చేరాయి. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, తుళ్లూరు, నీరుకొండ, కృష్ణాయపాలెం, నెక్కల్లు, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని