logo

స్వచ్ఛంద సంస్థకు డబ్బులిస్తామంటూ టోకరా

‘మా దగ్గర రూ.కోట్లు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలకు నిధులు ఇస్తుంటాం. అయితే, మా సంస్థ నిబంధనల ప్రకారం ముందుగా డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ ఉంటుంది. దీనికి కొంత సొమ్ము కట్టాలి.’ అంటూ నమ్మకంగా చెప్పి...

Published : 28 Nov 2022 04:04 IST

వెలుగులోకి సరికొత్త దగా

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : ‘మా దగ్గర రూ.కోట్లు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలకు నిధులు ఇస్తుంటాం. అయితే, మా సంస్థ నిబంధనల ప్రకారం ముందుగా డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ ఉంటుంది. దీనికి కొంత సొమ్ము కట్టాలి.’ అంటూ నమ్మకంగా చెప్పి... రూ.8 లక్షలకు టోకరా వేశాడో మాయగాడు. ఈ ఘటనపై గవర్నర్‌పేట పోలీసులు శనివారం అర్ధరాత్రి కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... మాలాబత్తిన లాల్‌ అనే వ్యక్తికి తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో మూగ, చెవిటి పిల్లల ట్రస్ట్‌ ఉంది. ఏలూరుకు చెందిన కళ్లేపల్లి వెంకట రామరాజు, లాల్‌ స్నేహితులు. తన ట్రస్ట్‌కు నిధులు ఇచ్చేందుకు ఏవైనా కార్పొరేట్‌ సంస్థలు ఉంటే పరిచయం చేయమని రామరాజును లాల్‌ కోరారు. దీంతో రామరాజు.. ఈ విషయాన్ని మరో స్నేహితుడైన హరికృష్ణకు చెప్పాడు. ఆయన తనకు ఫేస్‌బుక్‌లో రుద్రప్రతాప్‌ అనే స్నేహితుడు ఉన్నాడంటూ.. ఫోన్‌లో పరిచయం చేశాడు.

ముంబయిలో కంపెనీ ఉందంటూ...

దిల్లీ కేంద్రంగా ఉన్న ఏస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ అనే సంస్థకు ముంబయిలో కార్యాలయం ఉందని రుద్రప్రతాప్‌ తన వివరాలు చెప్పాడు. తాము స్వచ్ఛంద సంస్థలకు నిధులు ఇస్తామని తెలిపాడు. ఖమ్మంలోని లాల్‌ సంస్థకు రూ.కోటి ఇస్తానని హామీ ఇచ్చాడు. ఒక రోజు ఫోన్‌ చేసి, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి శ్రియాస్‌ పాండే అనే వ్యక్తిని విజయవాడకు పంపుతున్నానని, తన కంపెనీ లెటర్‌హెడ్‌, ఒక బ్యాంకు చెక్కు ఇచ్చి పంపిస్తున్నానని చెప్పాడు. విజయవాడకు వచ్చిన శ్రియాస్‌ పాండేను.. రామరాజు కలిశాడు. తమ సంస్థ మీకు రూ.కోటి నిధులు ఇస్తుందని, అయితే డాక్యుమెంటేషన్‌ ఛార్జీల కింద తాను పంపిన చెక్కుపై ఉన్న ఖాతాకు రూ.10లక్షలు పంపించాలని రుద్రప్రతాప్‌ కోరాడు. అంత సొమ్ము లేదంటూ.. విడతల వారీగా రామరాజు సదరు ఖాతాకు రూ.8లక్షల వరకు పంపించారు. ఎంతకీ ట్రస్ట్‌కు డబ్బులు రాకపోవటంతో రుద్రప్రతాప్‌ను ప్రశ్నించాడు. ఆ తర్వాత నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తోంది. మోసపోయినట్లు గుర్తించిన రామరాజు.. గవర్నర్‌పేట పోలీసులను ఆశ్రయించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి చెక్కు, లెటర్‌ హెడ్‌ తీసుకువచ్చిన శ్రియాస్‌ పాండేను పోలీసులకు అప్పగించాడు. పోలీసుల విచారణలో.. తాను 20 రోజుల క్రితమే ఉద్యోగంలో చేరానని, విజయవాడకు లెటర్‌హెడ్‌, చెక్కు తీసుకువెళ్లమంటే వచ్చానని శ్రియాస్‌ పాండే సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు