logo

సొత్తు పోయినా దిక్కులేదు..!

‘విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, విశ్రాంతి గదులు, క్యూలైన్లు సహా పలుచోట్ల సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పర్సుల చోరీలు పెరిగాయి.

Updated : 28 Nov 2022 06:18 IST

కనీసం ఫిర్యాదు చేసేందుకూ కుదరని పరిస్థితి
10 ప్లాట్‌ఫాంలుంటే.. ఆరో నంబరులో మాత్రమే పోలీస్‌స్టేషన్‌
విజయవాడ రైల్వేస్టేషన్‌లో పెరుగుతున్న చోరీలు

ఈనాడు, అమరావతి: ‘విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, విశ్రాంతి గదులు, క్యూలైన్లు సహా పలుచోట్ల సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పర్సుల చోరీలు పెరిగాయి. వీటికి సంబంధించి ఫిర్యాదు చేయాలంటే.. ఆరో నంబరు ప్లాట్‌ఫాంపై మాత్రమే జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ ఉంది. రైల్వేస్టేషన్‌లోని పది ప్లాట్‌ఫాంలపై ఎక్కడ ఏది పోయినా.. ఆరో నంబరుకు రావాల్సిందే. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ రైలు వచ్చే ప్లాట్‌ఫాంను వదిలి.. ఆరో నంబరుకు రావాల్సి ఉంటోంది. ఇలా రావాలంటే.. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే.. అన్ని ప్లాట్‌ఫాంలపైనా ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా జీఆర్‌పీ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ ప్రయాణికులు చాలాకాలంగా కోరుతున్నారు. గతంలో దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించి, అన్ని ప్లాట్‌ఫాంలపై జీఆర్‌పీ సబ్‌కంట్రోల్స్‌ను ఏర్పాటు చేయాలని భావించారు. దీనికి సంబంధించిన గదులను సైతం కట్టి.. ఆ తర్వాత వాటిని ఖాళీగా వదిలేశారు.’

దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యంత కీలకమైన స్టేషన్‌ విజయవాడ. నిత్యం 250కు పైగా రైళ్లు.. లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు దేశంలోని పలు ప్రాంతాలకు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత కీలకమైన రైల్వేస్టేషన్‌ కావడంతో భద్రతను కట్టుదిట్టం చేయాలని 2012లోనే ప్రణాళికలు రూపొందించారు. ఎక్కడికక్కడే ప్రయాణికుల ఫిర్యాదులు స్వీకరించేందుకు, చోరీ జరిగిందని తెలిసిన వెంటనే అప్రమత్తమై దొంగలను పట్టుకునేందుకు వీలుగా ఈ సబ్‌ కంట్రోల్స్‌లో ఏర్పాట్లు చేయాలని భావించారు. అప్పటి రైల్వే ఎస్పీగా ఉన్న శ్యాంప్రసాదరావు దీనిపై ప్రత్యేక దృష్టిసారించారు. అనుకున్నట్టుగానే క్యాబిన్లను నిర్మించారు. అన్ని ప్లాట్‌ఫాంలపైనా 24గంటలూ సిబ్బందిని ఉంచాలని నిర్ణయించారు. కానీ.. ఎస్పీ ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే ఆ ప్రతిపాదనలు అలాగే ఆగిపోయాయి. ఆ క్యాబిన్లను ఖాళీగా వదిలేశారు.

విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఆరో నంబరు ప్లాట్‌ఫాంపై జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌

ఫిర్యాదు చేయకుండానే...

విజయవాడ శివార్లలో ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. వీటిపై 139 నంబరుకు ఫిర్యాదులు సైతం ఎక్కువగానే వస్తున్నాయి. కానీ.. చోరీ జరిగిందని జీఆర్‌పీ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటే బాధితులు నేరుగా రావాల్సి ఉంటుంది. కానీ.. రైలులో విజయవాడ మీదుగా హైదరాబాద్‌, విశాఖ వైపు వెళ్లేవాళ్లు మధ్యలో దిగి ఫిర్యాదు చేయాలంటే కుదరడం లేదు. విజయవాడలోని ఆరో నంబరు ప్లాట్‌ఫాంపై చివరన జీఆర్‌పీ స్టేషన్‌ ఉంది. పక్క ప్లాట్‌ఫాంలపై రైళ్లు ఆగితే.. అక్కడి నుంచి ఆరో నంబరుకు వచ్చి ఫిర్యాదు చేసి, తిరిగి వెళ్లేలోపు రైలు వెళ్లిపోతుంది. అందుకే.. చాలామంది సొత్తూ ఎలాగూ పోయింది, ప్రయాణం కూడా ఆగిపోతుందని ఫిర్యాదు ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు.  

సిబ్బంది కొరత..

జీఆర్‌పీ సిబ్బంది కొరత అంతకంతకూ పెరుగుతోంది. ఏటా తగ్గిపోతున్నారే తప్ప పెరగడం లేదు. రైల్వేస్టేషన్‌లో 84మంది కానిస్టేబుళ్లుండాలి. కానీ.. కేవలం 23మందే ఉన్నారు. మరో 63మంది కావాలి. ఎస్సైలు కూడా ఏడుగురు ఉండాలి.. కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. మరో ముగ్గురు అవసరం. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంటే.. సిబ్బంది తగ్గిపోతున్నారు. వీరిని పెంచడంపై అధికారులు దృష్టిసారించడం లేదు. దీంతో.. ఉన్న సిబ్బంది ఫిర్యాదుల నమోదు, కేసుల దర్యాప్తుకే సరిపోతున్నారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని