logo

సంచుల కొరత.. అన్నదాత కలత

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చిన వరి పంటను విక్రయించేందుకు రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

Published : 28 Nov 2022 04:15 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు
ఆరబెట్టుకునేందుకు అవస్థలు పడుతున్న వైనం

కూచిపూడి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చిన వరి పంటను విక్రయించేందుకు రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సంచుల కొరతతోపాటు మిల్లర్లకు ధాన్యం తోలేందుకు లారీలు రాక బస్తాల వద్ద రైతులు నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొవ్వ మండలంలో దాదాపు 30 వేల ఎకరాల్లో వరి వేశారు. విపత్తులను అధిగమించి చేతికందిన పంట అమ్ముకునేందుకు ఆర్‌బీకేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే ప్రభుత్వ ఆదేశాలు ఆచరణలో ఎండమావిగానే ఉన్నాయంటున్నారు అన్నదాతలు. యంత్రాల ద్వారా నూర్పిడి చేసుకున్న ధాన్యాన్ని ట్రాక్టర్లపై తీసుకొచ్చి ఇళ్లలో, ఖాళీ ప్రదేశాల్లో పోసుకొని ఆరబెట్టుకోవడంలో తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం నూర్పిడులను ఆపేసి.. ఇప్పటికే నూర్చిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు సంచుల కోసం నిత్యం ఆర్‌బీకేల చుట్టూ తిరుగుతున్నారు. మొవ్వ మండలంలో 16 ఆర్‌బీకేలు ఉండగా తొలిగా 10 కేంద్రాల్లో వారం రోజుల కిందట ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. ఇప్పటికే 170 మంది రైతులు 13,265 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించగా నాలుగు రోజులుగా సంచుల కొరతతో కొనుగోళ్లు నిలచిపోయాయి. మొవ్వ మండలంలో 21 పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాల్లో పలువురు రైతులు తమ ధాన్యాన్ని రాశులుగా పోసి ప్రభుత్వం నుంచి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు.

గోనె సంచుల కోసం నాలుగు రోజులు నిరీక్షించినా ఫలితం లేక పెడసనగల్లులో ధాన్యం ఆరబెట్టుకున్న కౌలు రైతు పామర్తి వెంకటేశ్వరరావు


గతిలేక ఆరబెట్టుకున్నాం
- వీరపనేని చంద్రశేఖరరరావు, రైతు

ఆర్‌బీకేల్లో సంచుల కొరత ఉంది. ఏ మిల్లర్‌ దగ్గరకు వెళ్లినా కొనుగోలు చేయడం లేదు. గతిలేక ఆరబెట్టుకున్నాము. తేమ శాతం ఎక్కువగా ఉంటే డబ్బులు తగ్గించి ఇవ్వమన్నా ఎవరూ ముందుకు రావటం లేదు. 887 బస్తాలు గంగానమ్మ గుడి ఆవరణలో, పొలం  గట్లపై ఆరబోసుకున్నాను. గ్రేడ్‌తో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌లో 1061 రకం అని నమోదు చేయించుకోవడంతో మీపేరు తీసుకోవడం లేదని చెబుతున్నారు.


20 వేల సంచులు కావాలి

- గొట్టిపాటి రామమోహనరావు

50 ఎకరాల్లో యంత్రంతో కోతలు ప్రారంభించాం. 12 ఎకరాల్లో పూర్తయింది. గోనె సంచుల కోసం ఆర్‌బీకేకు వెళితే  లేవంటున్నారు. దీంతో నాలుగు రోజులుగా తమ ఇంటి పరిసరాల్లో ధాన్యం ఆరబెట్టుకొని ఎదురు చూస్తున్నాం. మాతోపాటు గొట్టిపాటి శివరామప్రసాద్‌ కూడా 50 ఎకరాల్లో పంట కోసి సంచుల కోసం చూస్తున్నారు. ఒక్క భట్లపెనుమర్రులోనే ఇంతవరకూ కోసిన ధాన్యానికి 20 వేల సంచులు అవసరం.


ఇండెంట్‌ పంపాం

- వీరాంజనేయప్రసాద్‌, తహసీల్దారు

31 వేల సంచుల కోసం ఇండెంట్‌ పంపాము. రాగానే రైతులకు అందిస్తాం. రవాణా విషయంలో లారీలు రాక ఆలశ్యమవుతుంది. సంబంధిత రైతులు వారికి కేటాయించిన మిల్లుకు సొంత వాహనంపై తోలుకుంటే కిరాయి రైతు ఖాతాలో జమ చేస్తాం. గతంలో ఎ, బి గ్రేడ్లుగా ధాన్యాన్ని కొనుగోలు చేసేవారం. ఇప్పుడు ఒకటే గ్రేడ్‌గా కొంటూ తేమ శాతం ఆధారంగా నగదు జమ చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని