logo

రూ. వందల కోట్లు ఏమయ్యాయ్‌..!

సేకరించిన రూ.కోట్లకు లెక్కలు లభించడం లేదు. ఖాతాలు సరిగా లేవు. కొంతమందికి క్యాష్‌బ్యాక్‌ రూపంలో ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు. దీనికి సొమ్ములు ఎక్కడి నుంచి చెల్లించారో వివరాలు లేవు.

Published : 28 Nov 2022 04:17 IST

కనిగిరిలో 150 ఎకరాల భూమి మాత్రమే గుర్తింపు
‘సంకల్ప సిద్ధి’ స్కామ్‌ దర్యాప్తుపై రాజకీయ ప్రభావం
ఈకార్ట్‌ వస్తువుల స్వాధీనం

ఈనాడు, అమరావతి: సేకరించిన రూ.కోట్లకు లెక్కలు లభించడం లేదు. ఖాతాలు సరిగా లేవు. కొంతమందికి క్యాష్‌బ్యాక్‌ రూపంలో ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు. దీనికి సొమ్ములు ఎక్కడి నుంచి చెల్లించారో వివరాలు లేవు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కొనుగోలు చేసినట్లు చెబుతున్న భూమి మినహా ఇతర చర, స్థిర ఆస్తులు దుర్భిణి వేసి వెతికినా కనిపించడం లేదు. సంకల్పసిద్ది ఈకార్ట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ తీరు ఇది. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ విధానంలో తక్కువ కాలంలో పెట్టుబడి ఆరు రెట్లు అవుతుందని నమ్మించి వసూలు చేసిన సొమ్ము ఎటువైపు వెళ్లిందో పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. గన్నవరం కేంద్రంగా ఆవిర్భవించిన ఈ సంస్థపై ఫిర్యాదు రావడంతో విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టాస్క్‌ఫోర్సు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం లేదా మంగళవారం విజయవాడ పోలీసుల కమిషనర్‌ కాంతిరాణాటాటా మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు పోలీసు దర్యాప్తుపై ఉన్నత స్థాయిలో రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ సంస్థకు సూత్రధారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులేనని తెదేపా నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా పోలీసు బృందాలు పలుచోట్ల విచారణ జరిపారు. కానీ ఒక్క కనిగిరిలో మినహా ఎక్కడా ఎలాంటి ఆస్తులు కనిపెట్టలేదు. నిడమనూరు, విజయవాడ దుర్గా అగ్రహారంలో ఏర్పాటు చేసిన ఈ మార్ట్‌లో ఉన్న గృహోపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టోర్లు సీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి విలువను గణిస్తున్నారు. సంస్థ ఎండీ గుత్తా వేణుగోపాలకృష్ణ, డైరెక్టర్‌గా ఉన్న ఆయన తనయుడు కిరణ్‌కుమార్‌లు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరితో పాటు పలువురు ఉద్యోగులను విచారణ చేస్తున్నారు. దర్యాప్తు అంత ఆశాజనకంగా సాగడం లేదని తెలిసింది.

సామగ్రి స్వాధీనం..

స్కీంలో భాగంగా సభ్యులకు విలువైన గృహోపకరాలు క్యాష్‌బ్యాక్‌ రూపంలో విక్రయిస్తారు. ఒక వస్తువు ధర రూ.10వేలు ఉంటే ముందుగా ఖాతాదారుడు రూ.10వేలు చెల్లించాలి. తిరిగి పది నెలల్లో నెలకు రూ.వెయ్యి చొప్పున ఖాతాదారుడిని క్యాష్‌బ్యాక్‌ రూపంలో తిరిగి వస్తాయని నమ్మించారు. అలా ఆ వస్తువు ఉచితంగా లభించినట్లు అవుతుంది. దీని కోసం నిడమానూరులో ఒక స్టోరు, దుర్గాగ్రహారంలో ఒకటి ఏర్పాటు చేశారు. నిడమానూరులోనే గోదాము ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉన్న గృహోపకరణాలను పోలీసులు లెక్కిస్తున్నారు. ఆదివారం రూ.15లక్షల విలువైన వివిధ రకాల వస్తువులు ఉన్నట్లు తేలింది. వీటిని పంచనామా చేసి సీజ్‌ చేయనున్నారు.

లంచాలపై ఆరా..: ఈ సంస్థ నుంచి కొంత మంది పోలీసులకు, మీడియా వ్యక్తులకు అందిన లంచాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్‌ ప్రతినిధి సూత్రధారుడిగా పంపకాలు జరిగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన చిత్రాలు లభించాయని తెలిసింది. గత 20 రోజుల క్రితమే ఈ పంపిణీ జరిగినట్లు సంస్థ ప్రతినిధులు పోలీసులకు తెలిపారు. ఆ జాబితాను పోలీసులు బయట పెడతారా లేదా అనేది తేలాల్సి ఉంది. కొంతమంది పోలీసులతో డీల్‌ కుదుర్చుకుని భారీ మొత్తం అందజేసినట్లు విచారణలో తెలిపినట్లు తెలిసింది. సరిగ్గా నెల క్రితం ఓ విభాగానికి చెందిన పోలీసులకు చందా రూపంలో పెద్ద మొత్తమే అందించారని అంటున్నారు. ఇవన్నీ వెలుగుచూస్తే సంచలనమే. కానీ మరోవైపు రాజకీయ ప్రభావం ఉండటంతో దర్యాప్తు ఏ మేరకు జరుగుతుందనేది అనుమానాస్పదంగా ఉందని తెదేపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.


ఆగ్రోస్‌ సంస్థతో ఒప్పందం..?

ప్రకాశం జిల్లా కనిగిరిలో కొనుగోలు చేసిన 150 ఎకరాల్లో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు పెంచే విధంగా ఒక ఆగ్రోస్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. మూడు పోలీసు బృందాలు కనిగిరి వెళ్లి విచారణ చేశాయి. ఇక్కడ మార్కెట్‌ విలువ ప్రకారం ఈ భూమి రూ.కోట్లలో ఉంటుంది. అక్కడే మరో 50 ఎకరాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. దీనికి సొమ్ములు చెల్లించలేదు. కొనుగోలు చేసిన భూమిలో మొక్కలు పెంచే బాధ్యత ఒక ఆగ్రోస్‌ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం వచ్చే ఆదాయంలో తమకు, ఆగ్రోస్‌ సంస్థకు 60:40 నిష్పత్తి ప్రకారం ఒప్పందం చేసుకున్నారు. సంస్థ తరఫున కాకుండా యజమాని గుత్తా వేణుగోపాలకృష్ణతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. బెంగళూరులోనూ స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ పోలీసుల విచారణలో తేలలేదు. స్థిరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది స్పష్టంగా తేలలేదు. ఎక్కువ మొత్తం నగదు రూపంలోనే తరలించినట్లు తెలిసింది.


రూ.250 కోట్లు ఏవీ..?

ఈ ఏడాది మే నెలలో ప్రారంభించిన ఈ సంకల్పసిద్ధి సంస్థ సుమారు రూ.250 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనధికార అంచనా ప్రకారం ఇవి దాదాపు రూ.1100 కోట్ల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కొంతమంది ప్రజాప్రతినిధుల సిఫార్సులతో భారీగా డిపాజిట్లు సేకరించినట్లు స్పష్టమైంది. ప్రధానంగా గన్నవరం, గుడివాడ విజయవాడలలో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. వీటిని ప్రస్తుతం ఎత్తేశారు. ప్రత్యేక యాప్‌ ఒకటి రూపొందించి దాని ద్వారానే లావాదేవీలు అన్నీ నిర్వహించినట్లు తెలిసింది. దీని ప్రకారం సభ్యులకు ప్రతినెలా క్యాష్‌బ్యాక్‌ రూపంలో కొనుగోలు చేసిన వస్తువు విలువ ఆధారంగా సొమ్ములు జమ అవుతున్నట్లు చూపిస్తుంది. కానీ ఆ బ్యాలెన్సు విత్‌డ్రా చేసేందుకు అవకాశం ఉండదు. అలా సొమ్ములు జమ అయిన తర్వాత ఒకానొక సమయంలో ఆ ఖాతా ఖాళీ అవుతుందని తెలిసింది. మరో మూడు నెలల్లో బోర్డు తిప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల విచారణలోనే ఎండీ వెల్లడించినట్లు తెలిసింది. ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకుని భారీగా సేకరించి ఎత్తేసేందుకు ప్రణాళికతోనే ఏర్పాటు చేసినట్లు అంగీకరించినట్లు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని