logo

పాత్రధారులు సరే.. సూత్రధారులు ఎవరో..!

ఊహాజనిత పథకాలతో అరచేతిలోనే స్వర్గం చూపించారు. రూ.వందల కోట్లు నిందితుడు దండేశారు. చిన్న చిన్న స్కీంలు పెడితేనే పోలీసులు స్టేషన్‌కు పిలిపించి మాట్లాడతారు.

Published : 29 Nov 2022 05:21 IST

ఊహాజనిత పథకాలతో సంకల్ప సిద్ధి

ఈనాడు, అమరావతి

హాజనిత పథకాలతో అరచేతిలోనే స్వర్గం చూపించారు. రూ.వందల కోట్లు నిందితుడు దండేశారు. చిన్న చిన్న స్కీంలు పెడితేనే పోలీసులు స్టేషన్‌కు పిలిపించి మాట్లాడతారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ కార్ట్‌, ఈ మార్ట్‌లు పెట్టిన వ్యక్తి ఆచూకీ తెలియదా?... గతంలో బోర్డు తిప్పేసిన సంస్థలో పనిచేసిన వ్యక్తి. గొలుసు కట్టు మోసాలలో కీలకమని తెలిసినా ఎందుకు మిన్నకున్నారు. హైదరాబాద్‌లో సంస్థ పెట్టి బోర్డు తిప్పేసి విజయవాడలో ప్రత్యక్షమైతే ఎవరికీ పట్టలేదు.. సంకల్పసిద్ధి గొలుసు కట్టు మోసంపై ఇలాంటి ఎన్నో సందేహాలు అందరిలో ముసురుకున్నాయి.. పోలీసుల నిఘా వైఫల్యం వల్ల సామాన్య ప్రజలు రూ.కోట్లలో మోసపోయారు. ప్రస్తుతం పాత్రధారులనే అరెస్టు చేశారు. సూత్రధారులు ఎవరనేది ఇంకా తేలలేదు. దర్యాప్తు ముగియకుండానే పోలీసులు రాజకీయ అండదండలు లేవని క్లీన్‌ చీట్‌ ఇచ్చేశారు. భూముల విలువ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విలువ, బ్యాంకు ఖాతాల్లో నిలువలు, ఈ మార్ట్‌లలో సరుకుల విలువలు ఇంకా గణించాల్సి ఉందని చెబుతున్నారు. ఇప్పటికే రూ.170 కోట్ల వరకు ఉండవచ్చని పోలీసు కమిషనర్‌ కాంతిరాణ టాటా అభిప్రాయపడ్డారు. ఇది కనీసం ఎంత  ఉంటుందనేది  తేలాల్సి ఉంది. అంచనా ప్రకారం రూ.1100 కోట్లుగా చెబుతున్నారు.

భలే పథకాలు..!

సంకల్ప సంస్థ అయిదు రకాల గొలుసు కట్టు పథకాలను ప్రవేశపెట్టింది. ఇవి బోర్డు తిప్పేసేవే అని ఇట్టే తెలిసిపోతున్నా.. డిపాజిట్ల సేకరణ జరగడం చర్చనీయాంశమైంది. ఏజెంట్లకు ఆకర్షణీయ కమిషన్లు, కొంతమంది సిఫార్సులతోనే జరిగిందనే వాదన ఉంది. రాజకీయనేతల సిఫార్సులేనని తెదేపా ఆరోపిస్తోంది.
సరకులు ఉచితమే..!:  సూపర్‌ మార్కెట్‌ పథకంలో సరకులు ఉచితమే. ఈ పథకం కింద రూ.3వేలు సంకల్ప యాప్‌లో చెల్లించి సరకులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నిడమనూరులో ఉన్న దుకాణం నుంచి వారికి సరుకలు ఆన్‌లైన్‌ ద్వారా అందుతాయి. ఇక సరుకులతో పాటు ప్రతి రోజు రూ.10 చొప్పున 330 రోజుల వరకు సొమ్ములు క్యాష్‌బ్యాక్‌గా అందుతాయి. అంటే సరుకులు ఉచితమే. ఈ సభ్యుడు మరి కొందరిని పరిచయం చేయాల్సి ఉంటుంది. దీనికి కమిషను అందుతుంది.

బంగారం: ఈ పథకం కింద రూ.లక్ష వెచ్చించి బంగారం కొనుగోలు చేయాలి. తర్వాత దీనిలో 30శాతం అంటే రూ.30వేలు క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇది కాకుండా రోజుకు రూ.100 చొప్పున  300 రోజులు తన ఖాతాలో సొమ్ము జమఅవుతుంది. అంటే మొత్తం రూ.60వేలు వెనిక్కి వస్తాయి. ఇక రూ.40వేలకే రూ.లక్ష బంగారం అన్నమాట.

నివేశన స్థలాలు: ఒకసెంటు భూమి రూ.5లక్షల చొప్పున కొనుగోలు చేయాలి. ఆ స్థలాలు ఎక్కడ ఏమిటనేది లేదు. తిరిగి ఆ మొత్తం ఖాతాదారుని వాలెట్‌లో క్యాషబ్యాక్‌గా జమ అవుతాయి. నివేశన స్థలం ఉచితమే.

ఎర్రచందనం: ఒక్క ఎర్ర చందనం మొక్కను రూ.6వేలు వెచ్చించి కొనుగోలు చేయాలి. 15 ఏళ్ల తర్వాత ఒక్క మొక్కకు రూ.5లక్షలు చొప్పున చెల్లిస్తారు. అదే విధంగా ప్రతి రోజు ఒక శాతం వడ్డీ చొప్పున 300 రోజులకు 300శాతం చొప్పున నగదు వ్యాలెట్‌లో జమచేస్తారట.

నగదు పథకం..! ఇదే ఆకర్షణీయం. పలువరు దీనికింద సొమ్ములు జమ చేశారు. ఒక వ్యక్తి రూ.లక్ష కట్టి ఈ స్కీంలో చేరితే రోజుకు ఒక శాతం చొప్పున 300 రోజుల్లో మొత్తం రూ.3లక్షలు వెనక్కి చెల్లిస్తారు. ఎక్కువ మందిని చేర్పించిన వారికి కార్లు, బంగళాలు, బంగారం వెండి లాంటి బహుమతులు ఇస్తారు. దీనికింద కనీసం 15వేల మంది చేరారని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


చందాలేచందాలు..!

ఈ గొలుసు కట్టు సంస్థ ప్రారంభించకముందే.. గన్నవరం ప్రాంతంలో వేణుగోపాలకృష్ణ పనిచేశారు. ఓ రాజకీయ నేతకు అనుచరునిగా ఉండేవారు. తర్వాతే హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ ఒక సంస్థను స్థాపించి మూసివేశారు. మళ్లీ గన్నవరం చేరుకున్నారు. కొంతకాలం నేతతోపాటు నియోజకవర్గంలో తిరిగారు. ఆకస్మికంగా ఈ గొలుసుకట్టు సంస్థ వెలిసింది. అనుమతి ఒకలా తీసుకుని కార్యకలాపాలు వేరేవి చేస్తున్నా నిఘా పెట్టలేదు. రాజకీయ నేతలకు భారీగా చందాలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. రెండు నెలల కిందట పోలీసులు విచారణ పేరుతో దండుకున్నట్లు తెలిసింది. ఈ వివరాలు విచారణలో వెలుగు చూసినా.. బయటకు రాలేదు. ప్రస్తుతం గన్నవరానికి చెందిన మాజీ సైనికోద్యోగి ఎం.రవికుమార్‌  ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని