logo

సహకారం సరే... జవాబుదారీ ఎవరు?

ధాన్యం విక్రయాల్లో విధించిన నిబంధనల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.  వీరితోపాటు సహకారసంఘ ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 29 Nov 2022 05:21 IST

పీఎస్‌ఏ బాధ్యతపై పీఏసీఎస్‌ల్లో విముఖత

కలెక్టరేట్‌(మచిలీపట్నం),గొడుగుపేట,న్యూస్‌టుడే

ధాన్యం విక్రయాల్లో విధించిన నిబంధనల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.  వీరితోపాటు సహకారసంఘ ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఏంచేయాలో తెలియక తలలుపట్టుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కీలక బాధ్యతను ప్రాథమిక సహకారం సంఘా(పీఏసీఎస్‌)లకు అప్పగించడం, ప్రస్తుతం సంఘాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భద్రత లేనివారితో  ఎంతవరకు భరోసా?

గతంలో వ్యవసాయ, సహకార సంఘాల ఆధ్వర్యాన ధాన్యం కొనుగోళ్లు చేసేవారు. రెండు శాఖల్లోని ఉద్యోగులకు సాంకేతికంగా అవగాహన ఉండటం వల్ల అంతగా ఇబ్బందులు ఉండేవి కావు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో రైతుల అమ్మే ధాన్యాన్ని తగు భరోసా ఉండేది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఆర్బీకేల ద్వారా ధాన్యం కోనుగోళ్ల విషయంలో సపోర్టింగ్‌ ఏజెన్సీ(పీఎస్‌ఏ)గా వలంటీర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లకు బాధ్యతలు కేటాయించిన ప్రభుత్వం ఏజెన్సీ నిర్వహణ అంశాన్ని సహకార సంఘాలకు కేటాయించింది. ధాన్యం నమూనాల సేకరణ నుంచి మిల్లర్లకు చేర్చే వరకూ బాధ్యత తీసుకోవాల్సిన వాలంటీర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు ఏమేరకు జవాబుదారీగా ఉంటారన్న అనుమానాలు సంఘాల పాలకవర్గాలతో పాటు రైతుల్లోనూ వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా ఉద్యోగ భద్రత లేని వాలంటీర్లు, తాత్కాలిక పద్ధతిపై తీసుకునే టెక్నికల్‌ అసిస్టెంట్‌లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే తలెత్తే పరిణామాలకు ఎవరిని బాధ్యులు చేస్తారన్న పశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో తాత్కాలిక పద్ధతిపై టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, వాలంటీర్లకు సహాయకులను ఆయా పీఏసీఎస్‌ అధికారులు నియమించారు. సాంకేతికపరమైన అనుభవం లేని టెక్నికల్‌ అసిస్టెంట్‌ల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఆర్బీకేలు, సచివాలయాల్లో అనుభవం ఉన్న వారిని నియమించాలని పీఏసీఎస్‌ సీఈవోలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆర్ధికపర సమస్యలతో  ఆందోళన

ఉమ్మడి జిల్లాలో దాదాపు 425 వరకూ ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా వాటిలో యాభైశాతం వరకూ నష్టాల్లోనే ఉన్నాయి. సంఘ లాభాల నుంచి అందులో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా చాలా వరకూ సంఘాల్లో సకాలంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితి కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి నాలుగు సంవత్సరాలుగా ఇవ్వాల్సిన కమిషన్‌ రమారమి రూ.5.00 కోట్ల వరకూ సంఘాలకు జమచేయలేదు. దీనికి తోడు 2021 మార్చి తర్వాత కొనుగోలు చేసిన ధాన్యం తాలూకా హమాలీ ఛార్జీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ బకాయిలతో చాలా సంఘాలు లోటు బడ్జెట్‌లోకి వెళ్లి పోవడంతో ఆడిట్‌ అభ్యంతరాలతో పాటు సిబ్బందికి వేతన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఖరీఫ్‌కు హమాలీ ఛార్జీలు చెల్లించడం, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, వాలంటీర్ల సహాయకులకు గౌరవ వేతనాలు చెల్లించడం సంఘాలకు సమస్యాత్మకం కానుంది. ప్రభుత్వం బస్తాకు రూ.10 చొప్పున ఇచ్చే హమాలీ ఛార్జీలకు ఎవరూ ముందుకు రావడం లేదు. సేకరణ లక్ష్యంలో వెనుకబాటులో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయంతో హమాలీలకు ఇచ్చే అదనపు కూలీని కొన్ని సంఘాలే భరించాల్సి వస్తోంది. ధాన్యం రవాణాకు సంబంధించి వాహనాన్ని రెండు సార్లు వేబ్రిడ్జిలో కాటా వేయించేందుకు ఒక్కో వాహనానికి సగటున రూ.250 వరకూ ఖర్చవుతుంది. ఈ ఖర్చు ఎవరు భరించాలన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆ భారం పీఏసీఎస్‌లే భరించకతప్పదు.

సగానికి పైగా సంఘాల్లో నెలనెలా సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో ధాన్యం సేకరించేందుకు నియమించిన టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, వాలంటీర్లకు సహాయకులకు వేతనాలు చెల్లించాల్సి రావడాన్ని సంఘ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. కేవలం తాము సహకారం మాత్రమే అందించగలమని, ఇతరత్రా ఆర్ధిక భారాలతో పాటు కొనుగోలు సిబ్బంది వైఫల్యాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేస్తూ ఉన్నతాధికారులకు అర్జీలు కూడా సమర్పించారు.తమకు వెసులుబాటు కల్పించడంతో పాటు రైతు ప్రయోజనాలు పరిరక్షించేలా అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ  పలువురు పీఏసీఎస్‌ సీఈవోలు జిల్లా ఉన్నతాధికారులకు అర్జీలు సమర్పించారు. ఇప్పటికైనా స్పందించి తమకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని