logo

కూచిపూడికి పురస్కారాల పంట

దేశవ్యాప్తంగా ఎందరో కళాకారులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులను ప్రకటించారు.

Updated : 29 Nov 2022 06:11 IST

నలుగురికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులు

న్యూస్‌టుడే, కూచిపూడి

దేశవ్యాప్తంగా ఎందరో కళాకారులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులను ప్రకటించారు. వారిలో తెలుగు వారు కూడా ఉండడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. అజాదీకా అమృతోత్సవంలో భాగంగా 75 సంవత్సరాలు నిండిన వారికి అందించే కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం కూచిపూడికి చెందిన సీనియర్‌ నాట్యాచార్యుడు మహంకాళి శ్రీమన్నారాయణకు దక్కింది. కూచిపూడి నాట్య కులపతి దివంగత పసుమర్తి వేణుగోపాలకృష్ణశర్మ మూడో కుమారుడు పసుమర్తి విఠల్‌, భారతివిఠల్‌ దంపతులకు కలిపి తొలిసారిగా అకాడమీ పురస్కారం వరించింది. కూచిపూడి కళాపీఠం విద్యార్థి ఆర్‌.వసంతకిరణ్‌కు బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కారం లభించింది. త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా తామ్రపత్రం, రూ.1 లక్ష చొప్పున నగదును అందుకోనున్నట్లు అకాడమీ కార్యదర్శి అనేష్‌ పి.రాజన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయా కళాకారుల కూచిపూడి నాట్య ప్రతిభపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


యువ కళాకిరణం

డాక్టర్‌ ఆర్‌.వసంతకిరణ్‌ కూచిపూడి సిద్ధేంద్రయోగి నాట్యకళాపీఠంలో విద్యార్థి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అయిన బిస్మిల్లాఖాన్‌ యువపురస్కారానికి ఎంపికయ్యారు. ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్ఛేరి, కేరళ, కర్ణాటక, ఒడిశా, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీ, హర్యానా తదితర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న కళాకారుడు. బహు భాషా కోవిదుడు. తెలుగు, తమిళం, మరాఠి, కన్నడం, కొంకణి, మళయాళం, హిందీ, ఆంగ్లం భాషల్లో నిష్ణాతుడు. పద్మభూషణ్‌ డాక్టర్‌ వెంపటి చినసత్యం శిష్యరికంలో చక్కని కళాకారునిగా ఎదగడమే కాకుండా అడయార్‌ కళాక్షేత్రంలో భరతనాట్యం, కేరళలోని కళామండళంలో కథాకళిని అభ్యసించారు. చాలాకాలం కర్ణాటకలో రేవా విశ్వవిద్యాలయానికి నాట్య విభాగాధిపతిగా, బెనారస్‌ తదితర మరికొన్ని విశ్వవిద్యాలయాల్లోనూ సేవలందించారు. సంగీత, సాహిత్యంలోనూ నిష్ణాతుడు. దూరదర్శన్‌ ‘ఎ’ గ్రేడెడ్‌ అర్టిస్ట్‌. భరతనాట్యం, మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌లలో పీహెచ్‌డీ పొందిన ఉత్తమ కళాకారుడు. డాక్టర్‌ వేదాంతం రామలింగశాస్త్రి రచించిన అర్థనారీశ్వరం కూచిపూడి నృత్య రూపకానికి నృత్య దర్శకత్వం వహించారు. కూచిపూడిలో డిప్లొమా పొంది అన్నమాచార్య పీజీ కోర్సు చేస్తున్నారు. ప్రస్తుతం పుణెలో ఉంటున్నారు.


యక్ష గానాలకు వన్నె తెచ్చిన కళాకారుడు

అజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా కేంద్ర సంగీత నాటక అకాడమీ దేశంలోని కూచిపూడి కళాకారుల్లో వయోధికుడైన మహంకాళి శ్రీమన్నారాయణ(82)కు అమృత్‌ అవార్డును అందించనుంది. ఆయన ప్రఖ్యాత కూచిపూడి నాట్య కళాకారుడు, యక్షగాన చక్రవర్తి అయిన దివంగత మహంకాళి సత్యనారాయణ కుమారుడు. బాల్యం నుంచి చింతా కృష్ణమూర్తి, వేదాంతం పార్వతీశంతోపాటు తన తండ్రి వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు. చిన్నతనంలో ప్రహ్లాదుడిగా అత్యుత్తమ ప్రదర్శనలతో మహానీయుల మన్ననలు పొందారు. ఎక్కువ కాలం ప్రహ్లాదునిగా చేసిన కళాకారుడు. తరువాత హరిశ్చంద్రలో లోహితాక్షుడిగా, మాతంగ కన్యలుగా, ఉషాపరిణయంలో అనిరుద్దునిగా, దవ్వారికుడుగా, భామాకలాపంలో శ్రీకృష్ణుడిగా, సూత్రధారిగా, పద్మభూషణ్‌ వెంపటి చినసత్యం నృత్యీకరణలో రూపుదిద్దుకున్న క్షీరసాగరమథనంలో రాక్షసుడిగా అద్భుతమైన ప్రతిభ చూపిన కాళాకారుడు. నాట్యాచార్యుడిగా కూడా రాణించిన గురువు. బాపట్లలో వందలాది మంది నాట్యాచార్యులను మలిచారు. నట్టువాంగం, గాత్రసౌలభ్యం, నాట్యాచారిత్వం, వేషధారణలతో బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించారు. వృద్ధాప్యంతో భార్య, కుమారుడు మరణించగా కొంతకాలంగా చిన్నకుమారుడు వద్ద కడపలో ఉంటున్నారు. ఈ వయస్సులోనూ ఆడగలరు.


నాట్య కళా కోవిధులు

పసుమర్తి విఠల్‌, భారతి విఠల్‌ దంపతులు చిన్ననాటి నుంచి కూచిపూడి నాట్యంలో తన తండ్రి అయిన ప్రముఖ నాట్యాచార్యులు, కూచిపూడి నాట్యకులపతి దివంగత పసుమర్తి వేణుగోపాలకృష్ణశర్మ వద్ద అవపోసన పట్టారు. ప్రహ్లాదునిగా, లవకుశలుగా బాలవేషాలతోపాటు కూచిపూడిలో సర్టిఫికెట్‌, డిప్లొమో కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించారు. దిల్లీలో నాట్యాచార్యునిగా 2వేల మందికిపైగా విద్యార్థులను తీర్చిదిద్దారు. ఏలూరుకు చెందిన మాణిక్యభారతిని వివాహం చేసుకొని నాట్య దంపతులుగా నడిచారు. వీరు దూరదర్శన్‌లో ఏగ్రేడ్‌ అందుకొని నాట్యభూషణ్‌, నాట్యవిశారద, సంగీతభూషణ్‌, సంగీత విశారద, నాట్యకళాకోవిద, సంగీత శిరోమణి, సేవాభారతి, రాజీవ్‌గాంధీ అవార్డు తదితర పురస్కారాలు అందుకున్నారు. దేశంలోనే కాకుండా జర్మని, అమెరికా, కెనడా, నేపాల్‌, రష్యా, ఫ్రాన్‌్్స, సింగపూర్‌, బ్రెజిల్‌ వంటి దేశాల్లో నాట్య ప్రదర్శనలివ్వడంతోపాటు వర్క్‌షాపులు నిర్వహించారు. వారిద్దరూ కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో సిరిమువ్వల సింహనాధం సినిమాలో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని