logo

పీఎన్‌బీఎస్‌ దుకాణంలో అధిక ధరల వసూలు

పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌లో దుకాణంలో ఎమ్మార్పీకన్నా అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ ఓ ప్రయాణికుడు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

Published : 29 Nov 2022 05:21 IST

దుకాణదారునికి జరిమానా విధిస్తున్న ఆర్టీసీ అధికారులు

విజయవాడ బస్టేషన్‌, న్యూస్‌టుడే: పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌లో దుకాణంలో ఎమ్మార్పీకన్నా అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ ఓ ప్రయాణికుడు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రకాశం జిల్లా వగ్గంపల్లెకు చెందిన పెయ్యాల నరేంద్ర స్వగ్రామం వెళ్లేందుకు సోమవారం బస్టాండ్‌కు మధ్యాహ్నం 3.30కు వచ్చారు. సమాచార కేంద్రం పక్కనున్న దుకాణం వద్దకు వెళ్లి శీతలపానీయం సీసా అడిగారు. దుకాణదారుడు రూ. 50 ఇమ్మన్నాడు. బాటిల్‌ను పరిశీలిస్తే దానిపై ఎమ్మార్పీ రూ. 38 ఉంది. దీనిపై దుకాణదారుడిని అడగ్గా బస్టేషన్‌లో ధరలు ఇలానే ఉంటాయి.. ఆఖరికి రూ.45 ఇవ్వు అని చెప్పడంతో నరేంద్ర ఆ మొత్తం చెల్లించి తీసుకున్నాడు. తర్వాత ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇలా అధిక ధరలు తీసుకున్నారని అప్పుడు గట్టిగా అడిగితే ఎమ్మార్పీకే ఇచ్చారని, ఇప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వాపోయాడు. దీనిపై అధికారులు విచారించి దుకాణదారుడికి రూ.1000 జరిమానా విధించారు.

అంతా ఇష్టారాజ్యం

విజయవాడ బస్టేషన్‌లో నిత్యం మూడువేల బస్సులు లక్షన్నరమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. పండగలు, సెలవు దినాల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. రద్దీని బట్టి కొన్ని దుకాణాల్లో ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో  ఎమ్మార్పీకన్నా అదనంగా రూ.10 నుంచి రూ.30 వరకు చెల్లించాల్సి వస్తుందని నగరానికి చెందిన ప్రగడ శ్రీను అనే ప్రయాణికుడు తెలిపారు.


చర్యలు తీసుకుంటాం

బి.శ్యామ్‌ ప్రసాద్‌, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ బస్టేషన్‌

దుకాణదారులు ఎమ్మార్పీ ధరలకే వస్తువులు విక్రయించాలి. అధిక ధరలకు అమ్మితే ప్రయాణికులు ఫిర్యాదు మేరకు జరిమానా విధిస్తాం. దుకాణదారుడు అప్పటికి మారకపోతే లీజు రద్దు చేస్తాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని