logo

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంతకాలం సహజీవనం చేసి, ఇప్పుడు వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన యువకుడిపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 01 Dec 2022 06:12 IST

విజయవాడ నేరవార్తలు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంతకాలం సహజీవనం చేసి, ఇప్పుడు వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన యువకుడిపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డుకు చెందిన ఓ యువతి.. ఫార్మా డి చదివి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. 2019లో అమ్మనమంచి వెంకట సత్యసాయి సుబ్రహ్మణ్య ప్రదీప్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆమెను వివాహం చేసుకుంటానని, యువతి తల్లిదండ్రులతో కూడా ప్రదీప్‌ మాట్లాడాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బ్యాంకు కాలనీలోని ఒక అపార్ట్‌మెంటు అద్దెకు తీసుకుని, కొంతకాలం సహజీవనం చేశాడు. ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం.. అమెరికాకు వెళ్లాడు. అక్కడి నుంచి ఫోన్‌ ద్వారా మాట్లాడుతుండేవాడు. 2021, నవంబరులో విజయవాడకు వచ్చి, భవానీపురంలో అపార్ట్‌మెంటు అద్దెకు తీసుకుని ఉన్నారు. 2022, ఏప్రిల్‌లో మళ్లీ ప్రదీప్‌ అమెరికాకు వెళ్లాడు. అక్కడి నుంచి యువతి ఖాతాకు డబ్బులు పంపించేవాడు. ఈ నేపథ్యంలో ప్రదీప్‌ తండ్రి అనారోగ్యానికి గురికావటంతో ఆయనకు యువతి వైద్యం చేయించారు. నెల రోజులుగా ప్రదీప్‌ మాట్లాడక పోవటంతో అతడిని గట్టిగా ప్రశ్నించింది. తనకు రూ.20లక్షలు కట్నంగా ఇవ్వాలని, లేకపోతే వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటానని బెదిరించాడు. తనకు డిసెంబరు 5న వివాహం జరుగుతుందని చెప్పటంతో.. ఆమె నవంబరు 7న ప్రదీప్‌ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయం చెప్పింది. వారు తమ కుమారుడికి వేరే అమ్మాయితో వివాహం చేస్తామని బెదిరించి దుర్భాషలాడారు. ఈ ఘటనలతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు.. దిశ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని