logo

Vijayawada: ఆమెది ఆర్‌ఎంపీ అవతారం.. చేయించేది వ్యభిచారం!

ఆమె చుట్టు పక్కల వారు, తెలిసిన వారి దృష్టిలో ఆర్‌ఎంపీ. చికిత్స చేస్తున్నట్లు వైద్య సలహాలు ఇస్తుంటుంది. చేసేది మాత్రం వ్యభిచార గృహ నిర్వహణ.

Updated : 02 Dec 2022 12:43 IST

భవానీపురం, న్యూస్‌టుడే : ఆమె చుట్టు పక్కల వారు, తెలిసిన వారి దృష్టిలో ఆర్‌ఎంపీ. చికిత్స చేస్తున్నట్లు వైద్య సలహాలు ఇస్తుంటుంది. చేసేది మాత్రం వ్యభిచార గృహ నిర్వహణ. వివిధ ప్రాంతాల నుంచి యువతులను నగరానికి రప్పించి వ్యభిచారం చేయిస్తుంది. సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు వలపన్ని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. భవానీపురం ప్రాంతంలో మహిళ నివాసం ఉంటోంది. భర్త ఆర్‌ఎంపీగా పని చేస్తూ కొవిడ్‌ సమయంలో చనిపోయారు. అప్పటి నుంచి ఆమె ఆర్‌ఎంపీగా అవతారం ఎత్తి వైద్యం చేయటం, ఇంటి వద్దకు వచ్చిన వారికి సలహాలు, సూచనలు ఇస్తుంటుంది. ఎవరైనా ఆమెకు దగ్గరైతే తన వద్ద యువతులు ఉన్నారంటూ చెబుతుంది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి ఆమె అమ్మాయిలను రప్పిస్తుంది. ఆమె చేస్తున్న వ్యాపారం భవానీపురం సీఐ ఉమర్‌ దృష్టికి వెళ్లింది. అనంతరం యువకుడితో గత నెల 30వ తేదీన ఆమె వాట్సాప్‌కు సందేశం పంపారు. తనకు అమ్మాయి కావాలంటూ ఆ యువకుడు కోరాడు. యువతి వద్దకు వెళ్లాలంటే రూ.10వేలు అని ఆమె చెప్పింది.

ముందు తనకు రూ.5వేలు ఇవ్వాలని, మరో రూ.5 వేలు గదిలోకి వెళ్లిన తరువాత అమ్మాయికి ఇవ్వాలంటూ చెప్పింది. ఆ యువకుడిని గొల్లపూడి హైస్కూలు వద్దకు రావాలంటూ చెప్పగా వెళ్లాడు. అక్కడ ఆమెకు అతడు రూ.5 వేలు ఇచ్చాడు. మిగిలిన డబ్బులు సమీపంలోని హోటల్‌లో ఉన్న యువతికి ఇవ్వాలంటూ గది నంబరు చెప్పింది. సమీపంలోనే ఉన్న భవానీపురం పోలీసులు నిర్వాహకురాలిని అరెస్టు చేశారు. గదిలో ఉన్న యువతిని విచారించగా పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చినట్లు చెప్పింది. ఆమెను వసతి గృహానికి తరలించారు. భవానీపురం సీఐ ఉమర్‌ కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని