logo

దివ్యాంగులకూ రైల్వే పెద్ద పీట

దివ్యాంగులకు పెద్దపీట వేస్తూ రైల్వే శాఖ ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసింది. గతంతో పోలిస్తే రెట్టింపు సౌకర్యాలు సమకూరాయి.

Published : 03 Dec 2022 04:52 IST

ప్రత్యేక బోగీలు, బుకింగ్‌ కౌంటర్ల ఏర్పాటు
నేడు రాయితీ కార్డుల పంపిణీ

దివ్యాంగుడిని కుర్చీలో తరలిస్తున్న లైసెన్స్‌ పోర్టర్‌

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే: దివ్యాంగులకు పెద్దపీట వేస్తూ రైల్వే శాఖ ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసింది. గతంతో పోలిస్తే రెట్టింపు సౌకర్యాలు సమకూరాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌తో పాటు డివిజన్‌ వ్యాప్తంగా అన్ని ప్రధాన స్టేషన్లలో కొత్తగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. స్టేషన్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ ఎప్పటికప్పుడు సౌకర్యాలను పరిశీలిస్తున్నారు.

బోగీల్లో ప్రవేశిస్తే  కేసులు..

అన్ని మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో గార్డు బోగీ పక్కన దివ్యాంగుల కోసం ప్రత్యేక డిజైన్‌తో రైల్వే శాఖ బోగీ ఏర్పాటు చేసింది. వాటిలో దివ్యాంగులు తప్ప ఎవరూ ప్రయాణించకూడదు. దీన్ని అతిక్రమిస్తే ఆర్పీఎఫ్‌ పోలీసులు కేసులు నమోదు చేస్తారు. అలాగే వారితో పాటు రైల్లో ప్రయాణించే సహాయకుడికి కూడా ప్రత్యేక కోటాలో బెర్తు కేటాయిస్తారు. ప్రతి రైల్లో 4 నుంచి 6 బెర్తుల వరకు ప్రత్యేకంగా కేటాయించారు. రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాలతో పాటు ఐఆర్‌సీటీసీలోనే టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

ప్రధాన ముఖద్వారం వద్ద నిర్మించిన ర్యాంప్‌

స్టేషన్‌లో సౌకర్యాలు ఇలా..

విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాం, తారాపేట, పార్సిల్‌ బుకింగ్‌ తదితర ప్రధాన మార్గాల్లో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేసి దివ్యాంగుల కోసం వీల్‌ఛైర్‌లు 24 గంటలూ అందుబాటులో ఉంచారు. దీని కోసం ఆయా మార్గాల్లో లైసెన్స్‌ పోర్టర్ల ఫోన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. ఏ సమయంలో ఫోన్‌ చేసినా వారు నేరుగా రైలు వద్దకు తీసుకెళ్తారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ‘ఈ వీల్‌ఛైర్‌’ సౌకర్యం అందుబాటులో ఉంది. రిజర్వేషన్‌ పీఎన్‌ఆర్‌ నంబరు నమోదు చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. రిజర్వేషన్‌ కార్యాలయం, జనరల్‌ బుకింగ్‌ కేంద్రాల వద్ద కూడా దివ్యాంగుల కోసం ప్రత్యేక లైన్‌ ఏర్పాటు చేశారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై ప్రత్యేక డిజైన్‌తో మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. నీళ్లు పట్టుకునేందుకు వీలుగా అన్ని ప్లాట్‌ఫారాల్లోని కుళాయిలు కూడా తక్కువ ఎత్తులో పూర్తి వైకల్యం ఉన్న వారికి కూడా సౌకర్యంగా ఉండేలా నిర్మించారు. అన్ని ప్లాట్‌ఫారాల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు అందుబాటుకి తెచ్చారు. లిఫ్టులను ఎవరి సహాయం లేకుండా ఉపయోగించేలా ప్రత్యేక బటన్‌లు ఏర్పాటు చేశారు.


రిజర్వేషన్‌ వసతి

దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేకంగా రూపొందించిన రైల్వే రాయితీ కార్డులను శనివారం రైల్వే అధికారులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్డుల సహాయంతో రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాలతో పాటు ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ ద్వారా కూడా రిజర్వేషన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని