logo

శ్రద్ధపెట్టు.. ఉపకార వేతనం పట్టు

ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుతున్నారు.

Updated : 03 Dec 2022 06:25 IST

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు

వేలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులు  నిర్వహిస్తున్న ఉపాధ్యాయిని

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుతున్నారు. వీరి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఏటా 8వ తరగతి విద్యార్థులకు నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైన వారికి  9వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్‌) వరకు నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేలు చొప్పన వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఈ ఏడాది పలువురు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో పరీక్ష జరగనుంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 323 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది మరింత మంది ఎంపికవ్వాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షణ ఇస్తున్నారు. గత నాలుగేళ్లగా పరిశీలిస్తే దరఖాస్తులు వేలల్లో ఉంటే కేవలం వందల్లోనే అర్హత సాధిస్తున్నారు. పరీక్షకు మరో రెండు నెలలు సమయం ఉండడంతో ప్రత్యేక శ్రద్ధ పెడితే విజయం సాధించడం సులభమేనని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

180 మార్కులకు పరీక్ష

పరీక్ష రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. మొదట పేపరులో అభ్యర్థుల సామర్ధ్యాన్ని అంచనా వేసే మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి. రెండోది ఆప్టిట్యూడ్‌ పరీక్ష. ఇందులో 7, 8 తరగతులకు సంబంధించి జనరల్‌ సైన్సు, సోషల్‌, గణితానికి  ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 180 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.


అన్ని అంశాలపై అవగాహన అవసరం

పాఠశాల స్థాయిలోనే విద్యార్థి సామర్ధ్యాలను వెలికితీయడానికి ఈ పరీక్ష ఎంతో ఉపయోగపడుతోంది. ఏడు, ఎనిమిది తరగతుల్లోని సైన్స్‌, సోషల్‌, గణితం పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. కేవలం ముఖ్యమైన వాటికే పరిమితం కాకుండా  అన్ని అంశాల పై పూర్తి పట్టు సాధించాలి. మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ కూడా నేర్చుకోవాలి. ప్రతి రోజూ మూడు గంటలు కేటాయించి సాధన చేస్తే కచ్చితంగా విజయం సాధించొచ్చు. సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలి. ప్రత్యేక తరగతులు కూడా ఎంతో దోహదపడతాయి. - ఎల్‌.ఉమాదేవి, ఉపాధ్యాయురాలు


ప్రణాళిక బద్ధంగా..

ఎన్‌ఎంఎంఎస్‌లో అర్హత సాధించాలనేది లక్ష్యం. అందుకు అనుగుణంగా ప్రణాళిక బద్ధంగా చదివా. సందేహాలను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవడం, ఎనిమిదో తరగతిలో  ప్రత్యేక తరగతులు నిర్వహించడం ఎంతో ఉపయోగపడింది. తొమ్మిదో తరగతి నుంచి ఉపకారవేతనం వస్తోంది. తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా విద్యాపరమైన అంశాలకు ఈ నగదును వినియోగిస్తున్నా.  

ఎం.నిహారిక,  పదో తరగతి, జీడీఈటీ ఎంసీహైస్కూల్‌, పటమట 


 కష్టపడాలి.. అర్హత సాధించాలి

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకారవేతనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటిని మరింత మంది సద్వినియోగం చేసుకోవాలి.  జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని దరఖాస్తు చేయించారు. ఎక్కువ మంది ఎంపికవ్వాలని ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి.

సి.వి.రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు