logo

రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడకు నేడు రానున్నారు. ఏపీ సర్కారు నిర్వహించే పౌరసన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతి నేడు పాల్గొననున్నారు.

Published : 04 Dec 2022 03:37 IST

పోరంకిలో పౌరసన్మాన కార్యక్రమం

విజయవాడలో ట్రాఫిక్‌ మార్పులు

సభా వేదిక వద్ద ఏర్పాట్లు

ఈనాడు, అమరావతి - గన్నవరం గ్రామీణం, పోరంకి, న్యూస్‌టుడే:  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడకు నేడు రానున్నారు. ఏపీ సర్కారు నిర్వహించే పౌరసన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతి నేడు పాల్గొననున్నారు. దిల్లీ నుంచి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తారు. ఉదయం 10.15గంటలకు దిల్లీ నుంచి ప్రత్యేక విమానం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తొలుత విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్తారు. అక్కడ ప్రముఖల స్వాగతం అనంతరం.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో జరిగే పౌరసన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. కార్యక్రమం తర్వాత తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. గవర్నర్‌ ఇచ్చే విందులో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం 02.15గంటలకు రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకుని.. ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ వరకూ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం పరిసరాల్లోనే సుమారు 800మంది పోలీసులను భద్రత కోసం ఉంచారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రతాలోపాలు తలెత్తకుండా శనివారం ట్రయల్‌రన్‌ను నిర్వహించారు. రాష్ట్రపతికి గౌరవ వందనం చేసేందుకు ముందస్తుగా పోలీసులు శనివారం సాధన చేశారు. ఎస్పీ జాషువా, పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రోటోకాల్‌ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ భాషా వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ వరకూ జాతీయ రహదారిని సుందరంగా తీర్చిదిద్దారు.

వాహనాల మళ్లింపులు..

విజయవాడకు వచ్చే వాహనాలను ఆదివారం మళ్లిస్తున్నట్టు సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు.  బీ విశాఖ వైపు నుంచి వచ్చి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను విజయవాడ రాకుండా హనుమాన్‌జంక్షన్‌ వద్ద నుంచి మళ్లిస్తారు. నూజివీడు, మైలవరం, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం వైపు పంపిస్తారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను ఇబ్రహీంపట్నం నుంచి మళ్లించి జి.కొండూరు మీదుగా హనుమాన్‌ జంక్షన్‌కు పంపిస్తారు. ఈ మార్గంలో  ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2వరకు ఆంక్షలు ఉంటాయి. బీ విశాఖ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను విజయవాడ రాకుండా.. హనుమాన్‌జంక్షన్‌, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లిస్తారు. ఈ మార్గంలోనూ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2వరకు ఆంక్షలు ఉంటాయి. చెన్నై వైపు నుంచి వచ్చి విశాఖ వైపు వెళ్లే వాహనాలను కూడా త్రోవగుంట వద్ద నుంచి మళ్లించి హనుమాన్‌జంక్షన్‌కు పంపిస్తారు. ఈ మార్గంలో మాత్రం ఉదయం 6.30 నుంచి ఉదయం 9గంటల వరకూ ఆంక్షలు ఉంటాయి. బీ గుంటూరు నుంచి విశాఖ వైపు వెళ్లే వాహనాలను కూడా విజయవాడలోనికి అనుమతించరు. బుడంపాడు వద్ద నుంచి పొన్నూరు, రేపల్లె, అవనిగడ్డ మీదుగా హనుమాన్‌జంక్షన్‌కు పంపిస్తారు. బీ చెన్నై నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే భారీ, మధ్యతరహా వాహనాలను మేదరమెట్ల వద్ద నుంచి అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, నార్కెట్‌పల్లికి మళ్లిస్తారు. ఈ మార్గంలో ఉదయం 7.30 నుంచి ఉదయం 10.30వరకు మళ్లింపులుంటాయి. బీ మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే వాహనాలను ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కంకిపాడు వద్దే ఆపేస్తారు. మచిలీపట్నం నుంచి తాడిగడప వైపు భారీ, మధ్యతరహా రవాణా వాహనాలకు అనుమతి లేదు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో 1500మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు సీపీ కాంతిరాణా టాటా శనివారం తెలిపారు. ఐదుగురు డీసీపీ, నలుగురు ఏడీసీపీ, 12మంది ఏసీపీ, 35మంది సీఐ, 75మంది ఎస్‌ఐలు విధుల్లో పాల్గొంటారన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని