logo

జగనన్న క్రీడల్లో డిష్యుం.. డిష్యుం

గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రారంభమైన జగనన్న క్రీడా సంబరాలు వివాదాస్పదమయ్యాయి. శనివారం ఉదయం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని పోటీలు ప్రారంభించారు.

Updated : 04 Dec 2022 11:51 IST

రెండు జట్ల మధ్య తోపులాట

న్యూస్‌టుడే, నెహ్రూచౌక్‌(గుడివాడ): గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రారంభమైన జగనన్న క్రీడా సంబరాలు వివాదాస్పదమయ్యాయి. శనివారం ఉదయం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని పోటీలు ప్రారంభించారు. సాయంత్రం జరిగిన కబడ్డీ సెమీ పోటీల్లో గుడివాడ, అవనిగడ్డ జట్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. క్రీడాకారులు రిఫరీపై గొడవకు దిగడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. గుడివాడ, అవనిగడ్డ జట్ల మధ్య సెమీ ఫైనల్స్‌ సాయంత్రం హోరాహోరిగా సాగాయి. అవనిగడ్డ జట్టు 36 పాయింట్లతో ఆధిక్యంలో ఉండగా, గుడివాడ జట్టు 34 పాయింట్లు సాధించింది. చివరి క్షణాల్లో గుడివాడ క్రీడాకారుడు రైడ్‌కు వెళ్లగా మిడిల్‌ లైన్‌ క్రాస్‌ చేయడంలో విఫలమైనట్లు రీఫరీ ప్రకటించడంతో గుడివాడ క్రీడాకారులు రీఫరీపై విరుచుకుపడ్డారు. దీంతో రెండు జట్ల మధ్య తోపులాట చోటుచేసుకుంది. గొడవ పెద్దది కావడంతో జిల్లా ప్రాధికార సంస్థ కమిటీ సభ్యులు కల్పించుకొని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. లైట్‌ ఫెయిల్‌ కావటంతో పాయింటు నిర్ణయించలేమని, ఆదివారం ఉదయం రీమ్యాచ్‌ నిర్వహిస్తామని డీఎస్‌డీవో ఝాన్సీ తెలిపారు. ఈ నిర్ణయాన్ని అవనిగడ్డ జట్టు సభ్యులు వ్యతిరేకించారు. క్రీడాల్లో రాజకీయ ప్రమేయం ఏమిటని, గుడివాడ జట్టును గెలిపించుకోవాలని అనుకుంటే వారికే బహుమతులు ఇచ్చుకోవాలని అవనిగడ్డ జట్టు సభ్యులు అక్కడి నుంచి వాకౌటు చేశారు. ఏదేమైనా ఆదివారం ఉదయం 10 గంటలకు రీమ్యాచ్‌ నిర్వహిస్తామని కమిటీ సభ్యులు చెబుతున్నారు. గుడివాడ జట్టుకు ఎమ్మెల్యే కొడాలి నాని స్పాన్సర్‌ చేయడం కొసమెరుపు.

బహిష్కరించిన అవనిగడ్డ జట్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని