logo

‘ఉక్కు పరిశ్రమపై మాట తప్పిన ముఖ్యమంత్రి’

కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే విషయంలో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెట్టడం తగదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అన్నారు.

Updated : 05 Dec 2022 06:13 IST

మాట్లాడుతున్న ఓబులేసు. చిత్రంలో రాజేంద్రబాబు, లెనిన్‌బాబు, బాలకాశి, రామన్న తదితరులు

గాంధీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే : కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే విషయంలో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెట్టడం తగదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారని, అప్పటి నుంచి ఎలాంటి పురోగతి లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా ప్రజలకు మాట ఇచ్చి, తప్పారని విమర్శించారు. ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించి, యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 9వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించనున్న పాదయాత్ర, 12న రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఐఏవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, లెనిన్‌బాబు మాట్లాడుతూ.. పరిశ్రమల యాజమాన్యాలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండడంతో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని మండిపడ్డారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బాలకాశి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు రామన్న, చరణ్‌సాయి, రాజేష్‌, సోమన్న, వేముల శ్రీనివాస్‌, దుర్గాంబ, బుట్టి రాయప్ప, చంద్రానాయక్‌, నజీర్‌, అనిల్‌, ఎం.సాయికుమార్‌, లంకా గోవిందరాజులు, సుబానీ, జి.నాగరాముడు, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని