logo

కృష్ణా తీరంలో.. ఆత్మీయ ఆతిథ్యం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన విజయవాడలో ప్రశాంతంగా సాగింది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చిన ఆతిథ్యం, పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు.

Updated : 05 Dec 2022 06:15 IST

నగరంలో సజావుగా రాష్ట్రపతి పర్యటన
పోరంకి, విజయవాడలో కార్యక్రమాలు
ప్రత్యేక విమానంలో తిరిగి విశాఖకు పయనం

పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతి

ఈనాడు, అమరావతి, గన్నవరం, రామవరప్పాడు, పొరంకి, న్యూస్‌టుడే: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన విజయవాడలో ప్రశాంతంగా సాగింది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చిన ఆతిథ్యం, పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. సుమారు మూడున్నర గంటలకు పైగా రాష్ట్రపతి పర్యటన కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో సాగింది. ఆదివారం ఉదయం 10.45గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌, రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమానాశ్రయానికి చేరుకుని రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎన్‌సీసీ ప్రతినిధి సునీల్‌కుమార్‌శర్మ, కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఎస్పీ జాషువా, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక తదితరులు విమానాశ్రయానికి తరలివచ్చి రాష్ట్రపతిని స్వాగతించారు. విమానాశ్రయం ఆవరణలో పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో పోరంకిలోని పౌర సన్మాన కార్యక్రమం వద్దకు ద్రౌపది ముర్ము చేరుకున్నారు. పోరంకిలోని వేదిక వద్దకు ఉదయం 11.24గంటలకు రాష్ట్రపతి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.15వరకూ అక్కడే ఉన్నారు. పౌరసన్మాన కార్యక్రమం ముగిసిన వెంటనే విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత మధ్యాహ్నం 2.20కు బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. 2.30కు ప్రత్యేక విమానంలో విశాఖకు తరలివెళ్లారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా వెళ్లారు. గన్నవరం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి జగన్‌, ఇతర ఉన్నతాధికారులు తరలివచ్చి రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ వరకూ జాతీయ రహదారి వెంబడి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయంలోనే 800 మంది వరకూ పోలీసులు మోహరించారు.

ఉన్నతాధికారుల వాహనాలు వచ్చే సమయంలో..  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోరంకిలో కార్యక్రమం ముగించుకుని రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్‌ కాన్వాయ్‌లో వరుసగా పోరంకి నుంచి వెళ్లాయి. ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల మీదుగా ఈ మూడు కాన్వాయ్‌లు వెళ్లిన తర్వాత పోలీసులు ద్విచక్ర వాహనదారులను విడిచి పెట్టారు. అదే సమయంలో పోరంకి నుంచి న్యాయమూర్తులు, కలెక్టర్‌, విజయవాడ నగర మేయర్‌ తదితరుల వాహనాలు రావడంతో కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ద్విచక్ర వాహనదారులను ఎక్కడికక్కడ ఆపేసి.. ఉన్నతాధికారులు, న్యాయమూర్తుల కాన్వాయ్‌ను పంపించారు. ‌ పోరంకిలోని పౌరసన్మాన వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఓ స్వాగత కటౌట్‌ గాలికి పక్కకు ఒరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దానిని సరిచేశారు. రాష్ట్రపతి రావడానికి కొద్దిసేపటి ముందు ఈ ఘటన జరిగింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి. చిత్రంలో సీఎస్‌ జవహర్‌ రెడ్డి, జడ్పీ ఛైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి


అమ్మకు అనుమతి లేదు...

 

 

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పౌర సన్మానం కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పోరంకి ఎం.కన్వెన్షన్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిస్తూ ముఖ్య అతిథులకు పాసులను అందించారు. అయితే ఆ పాస్‌లో కార్యక్రమం ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే రావాలని, పాసులను వేరొకరికి బదిలీ చేయరాదని ఉందే తప్ప, చంటి పిల్లలను తీసుకురావద్దు, ఒళ్లో కూర్చోపెట్టుకోవడానికి కూడా అనుమతి లేదు, ఒకవేళ తీసుకొస్తే వారికి కూడా పాస్‌ ఉండాలి అప్పుడు మాత్రమే వేరొక కుర్చీలో కూర్చోపెడతామని ఎక్కడా లేదు. ఈ విషయాలు తెలియక కొంత మంది తల్లులు తమ పిల్లలను తీసుకురాగా, వారిని నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపించేశారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని