logo

మండలాలు మాయమైపోయాయి..!

జిల్లాల పునర్విభజన తర్వాత రవాణా సేవలకు సంబంధించి వాహనదార్లకు కొన్ని చిక్కులు తప్పడం లేదు.

Published : 06 Dec 2022 06:02 IST

రవాణా శాఖలో విచిత్ర పరిస్థితి
జిల్లాల పునర్విభజనతో గందరగోళం

కృష్ణా జిల్లాను క్లిక్‌ చేస్తే ఎన్టీఆర్‌ జిల్లాలో మండలాలు కన్పిస్తున్నాయి మ్యాపింగ్‌ ప్రక్రియ జరిగినా..

* హనుమాన్‌జంక్షన్‌కు చెందిన ఓ వ్యక్తికి రెండు నెలల కిందటే లైసెన్స్‌ కాల పరిమితి ముగిసిపోయింది. దీంతో రెన్యువల్‌ కోసం అందుబాటులో ఉన్న ఏజెంట్‌ని సంప్రదించి, ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేయబోగా, జిల్లా ఎంపిక తర్వాత సంబంధిత మండలం ఎంచుకునేందుకు అవకాశమే లేకుండాపోయింది. దీంతో నానా తిప్పలు పడి ఆధార్‌ సీడింగ్‌ చేయించుకుని, 20 రోజుల తర్వాత కానీ రెన్యువల్‌ చేయించుకోలేకపోయారు.

* బాపులపాడు మండలం తిప్పనగుంటకు చెందిన రాజు అనే వ్యక్తి ఆరు నెలల కిందట పాత ద్విచక్ర వాహనం కొనుగోలు చేశారు. ఆ వాహనాన్ని తన పేరుమీదకు బదిలీ చేయించుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా నేటికీ సాధ్యం కాలేదు. ఈ తరహా ఉదంతాలు అనేకం ఉన్నాయి.

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: జిల్లాల పునర్విభజన తర్వాత రవాణా సేవలకు సంబంధించి వాహనదార్లకు కొన్ని చిక్కులు తప్పడం లేదు. ప్రధానంగా ఆధార్‌ సీడింగ్‌ జరగని వారు తమ లైసెన్సులు రెన్యువల్‌ చేయించుకోవాలన్నా, విక్రయించిన పాత వాహనాలను కొనుగోలుదార్ల పేరిట బదిలీ(ట్రాన్స్‌ఫర్‌) చేయించాలన్నా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ రెండు పనుల కోసం రవాణా శాఖ అధికారికంగా వినియోగిస్తున్న ఈ-ప్రగతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా పరిధిలో ఒక్క మండలం పేరు కూడా కన్పించడం లేదు. పైగా ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని మండలాలను ఎంచుకునే ఆప్షన్‌ చూపిస్తుండటం గమనార్హం.

నూజివీడు నుంచి మార్చాక..

జిల్లాల ఏర్పాటుకు పూర్వం నూజివీడు ఆర్టీవో కార్యాలయం కింద ఉన్న బాపులపాడు మండలాన్ని ఉయ్యూరు యూనిట్‌ పరిధిలోకి మార్చారు. కానీ వాహనదార్లకు సౌకర్యంగా ఉండేలా అన్ని సేవలు గుడివాడ ఆర్టీవో కార్యాలయంలో లభించేలా బాపులపాడు మండలాన్ని విలీనం చేయాలన్న డిమాండ్లు అధికంగా విన్పించాయి. కానీ ఇది పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాలేదు. ఈ క్రమంలో నూజివీడు పరిధిలో నమోదైన వాహనదార్లు ఈ ఏడాది ఏప్రిల్‌ అనంతరం లైసెన్సులు పునరుద్ధరించుకోవడానికి, ఆర్సీలు బదిలీ చేసుకోవడానికి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో వివరాలు సవ్యంగా లేక నెలలుగా పడిగాపులు పడుతున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని కార్యాలయాలకు సంబంధించి పని విభజన, నూతన కార్యాలయాలు ఏర్పాటు చేసిన విధంగానే రవాణా శాఖకు సంబంధించిన కార్యకలాపాల నిర్వహణకు వీలుగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆన్‌లైన్‌లో అందించే సేవలకు సంబంధించి రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికగా మ్యాపింగ్‌ ప్రక్రియ ఆరంభించారు. ఈ ప్రకారం గుడివాడ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల వాహనదార్లకు గుడివాడ ఆర్టీవో, మచిలీపట్నం డీటీవో ఆధ్వర్యంలో సేవలు అందుతున్నాయి. కానీ రవాణా పరిభాషలో టూటైర్‌ కార్డుదార్లకు మాత్రం సేవలు గగనంగా మారాయి.

ప్రహసనమే

టూటైర్‌ లైసెన్సు కార్డులు, ఆర్సీ కార్డులు ఉన్న వారు పునరుద్ధరణ, బదిలీ వంటి సేవలు పొందాలంటే తొలుత ఆధార్‌ సీడింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వాటిని ఆమోదించిన తర్వాత, ఏ తరహా సేవ కోసం దరఖాస్తు చేశామో తెలిపేలా టికెట్‌ రైజ్‌ చేయాలి. ఆ తర్వాత మనకు కేటాయించిన ఐడీ సంఖ్యను రవాణా శాఖ కాల్‌ సెంటర్‌ నంబరుకు ఫోన్‌ చేసి తెలియబరిస్తే, సాంకేతిక సిబ్బంది వాటిని పరిశీలించి ఆమోదించాల్సి వస్తోంది. దీనికి కనీసం 15 రోజులకు పైగా సమయం పడుతుండగా, వాహనదార్లు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇబ్బందుల్లేకుండా చర్యలు:  సీతాపతి, డీటీవో, మచిలీపట్నం

కృష్ణా జిల్లాలో ఉన్న మూడు రెవెన్యూ డివిజన్లను మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన డీటీవో పరిధిలోకి తెచ్చారు. ఏయే మండలాల వాహనదార్లు ఎక్కడెక్కడ రవాణా సేవలు పొందాలనేది ఆన్‌లైన్‌ మ్యాపింగ్‌ ప్రక్రియ చేశాం. ఆధార్‌ సీడింగ్‌ జరగని వాహనదార్లు సీడింగ్‌ కోసం దరఖాస్తు చేసుకుని, తమకెలాంటి సేవలు కావాలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తర్వాత వచ్చిన టికెట్‌ వివరాలిస్తే సాంకేతిక సిబ్బంది పరిష్కారం చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని