logo

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ : మంత్రి జోగి

జంపని ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ భరోసా ఇచ్చారు.

Updated : 06 Dec 2022 06:10 IST

మాట్లాడుతున్న గృహనిర్మాణశాఖా మంత్రి రమేష్‌, పక్కన ఎమ్మెల్యే శివకుమార్‌,
సబ్‌కలెక్టర్‌ గీతాంజలి శర్మ

తెనాలి(కొత్తపేట) పెదకాకాని, నగరంపాలెం, న్యూస్‌టుడే: జంపని ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ భరోసా ఇచ్చారు. ప్రమాద సమాచారం అందుకున్న ఆయన స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో కలిసి తెనాలి ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులు, మృతుల కుటంబ సభ్యులను వారు పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ఘటన గురించి తెలిసి దిగ్భ్రాంతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారని తెలిపారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తన దృష్టికి తెచ్చినట్లు చెప్పారు.

 కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, వైకాపా నాయకుడు రాము, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మహేష్‌ తెనాలి ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

మాజీ సీఎం చంద్రబాబు సంతాపం..

తెదేపా నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాద సమాచారం తెలియగానే తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారని, మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారని పేర్కొన్నారు. జంపని చెరువు మలుపు వద్ద ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని అనేక మార్లు ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించినట్లు స్పష్టం చేశారు.

క్షతగాత్రులు డిశ్చార్జి..

స్వల్ప గాయాలతో జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న 16మంది క్షతగాత్రులు సోమవారం సాయంత్రం డిశ్చార్జి అయి స్వగ్రామం నీలిపూడికి బయల్దేరి వెళ్లారు. ప్రమాదంలో మృతి చెందిన నలుగురి మృతదేహాలకు కృత్తివెన్ను మండల తహసీల్దారు రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో పంచనామా చేసిన వైద్యులు పోస్టుమార్టం చేశారు. అనంతరం వారి బంధువులకు అప్పగించారు. సమాచారం అందుకున్న తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ వెంటనే జిల్లా వైద్యశాలకు చేరుకొని క్షతగాత్రులకు వైద్యసాయం అందేలా చూశారు. రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ, వేమూరు పోలీసు అధికారులు ఆస్పత్రి వద్ద బందోబస్తు నిర్వహించారు.

పరామర్శ

జంపని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముగ్గురు గుంటూరు జీజీహెచ్‌కు సోమవారం తరలించారు. అనంతరం  ఆటోనగర్‌ సమీపంలోని ఉదయ్‌ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను మంత్రి జోగి రమేష్‌ పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. గాయపడిన వారు కృష్ణా జిల్లాకు చెందిన పి.శ్రీనివాస్‌, నాగరాజు, వెంకన్నగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని