logo

కమిషనర్‌ అడ్డుకున్నా.. దండుకుంటాం

దుర్గమ్మ శరన్నవరాత్రుల సందర్భంగా గత సెప్టెంబరులో విజయవాడలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో సిబ్బందిని సరిపడా సమకూర్చని గుత్తేదారుకు సొమ్ములు చెల్లించడానికి రంగం సిద్ధమైంది.

Updated : 06 Dec 2022 06:12 IST

దసరా ఉత్సవాల్లో ‘పారిశుద్ధ్య’ అక్రమాలు!
రూ.లక్షల దోపిడీకి యత్నం

విజయవాడ నగరపాలక సంస్థ,విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: దుర్గమ్మ శరన్నవరాత్రుల సందర్భంగా గత సెప్టెంబరులో విజయవాడలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో సిబ్బందిని సరిపడా సమకూర్చని గుత్తేదారుకు సొమ్ములు చెల్లించడానికి రంగం సిద్ధమైంది. విజయవాడ కార్పొరేషన్‌ అధికారుల తీరుతో ఖజానాకు రూ.లక్షల్లో గండి పడనుంది.   దసరా ఉత్సవాల సందర్భంగా స్నానఘాట్లు, ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించే బాధ్యతలను నగరపాలక సంస్థ చేపట్టింది. మూడు షిఫ్టుల్లో 1000 మంది చొప్పున 13 రోజులపాటు సిబ్బందిని సమకూర్చే కాంట్రాక్టుకు టెండర్లు ఆహ్వానించారు. ఇద్దరు గుత్తేదార్లు రోజుకు 500 మంది సిబ్బంది చొప్పున నియమించడానికి ముందుకొచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా తర్వాత అసలు కథ నడిచింది.

ఇక్కడ బట్టబయలైంది..

ఇద్దరు గుత్తేదార్లు... ఉదయం, మధ్యాహ్నం షిఫ్టుల్లో కలిపి 800 మంది, రాత్రి పూట 200 మంది పారిశుద్ధ్య సిబ్బందిని సమకూర్చాలి. వారు మాత్రం రోజుకు 150-250 మంది చొప్పున సగటున 416 మందిని మాత్రమే నియమించారు. వారితోనే మూడు షిఫ్టుల్లో పనిచేయించినట్లుగా చూపించి, అక్రమంగా రూ.లక్షలు దండుకునేందుకు యత్నించారు. కమిషనర్‌ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఇది వెల్లడైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే ముఖ ఆధారిత హాజరు విధానం (ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టం-ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలు చేయాలని ఆదేశించారు. ఫలితంగా ఒకసారి ఎఫ్‌ఆర్‌ఎస్‌ తీసిన సిబ్బందికి 24 గంటలు(ఒకరోజు) తర్వాతే మళ్లీ హాజరు నమోదు అవుతుంది. టెండరు నిబంధన ప్రకారం పారిశుద్ధ్య సిబ్బందిని సమకూర్చని గుత్తేదార్లకు కమిషనర్‌ షోకాజ్‌నోటీసులు కూడా జారీచేశారు. ఈ వ్యవహారాన్ని కొద్దిరోజులు తొక్కిపెట్టిన అధికారులు, తాజాగా గుత్తేదార్లకు మొత్తం బిల్లులు సాధారణ నిధుల నుంచి చెల్లించేందుకు  పరిపాలనా ఆమోదానికి ప్రతిపాదన తెచ్చారు.

అసలు మస్తరు ఇంతే..!


ఎఫ్‌ఆర్‌ఎస్‌ దెబ్బతో అన్ని రోజులకు 13 వేల మస్తర్లకు గాను 5,408  మాత్రమే నమోదయ్యాయి. ఆ లెక్కన ఇద్దరు గుత్తేదార్లకు కలిపి రూ.27.04 లక్షలు, 5 శాతం ఇతర ఛార్జీలు కింద రూ.1.35 లక్షలు కలిపి మొత్తం రూ.28.39 లక్షలు చెల్లించాల్సి ఉంది. అధికారులు మాత్రం 13వేల మస్తర్లకు రూ.500 చొప్పున రూ.65 లక్షలు, 5 శాతం ఇతర ఛార్జీల కింద మరో రూ.3.25 లక్షలు కలిపి మొత్తం రూ.68.25 లక్షలు సాధారణ నిధుల నుంచి చెల్లించాలంటూ పరిపాలనా ఆమోదానికి అధికారులు స్థాయీ సంఘం ముందుకు ప్రతిపాదనలు తెచ్చారు. దీంతో రూ.39.86 లక్షల మేర కార్పొరేషన్‌ ఖజానాకు చిల్లు పడనుంది.

ఇదిగో లొసుగు..

కార్పొరేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 97(2) ప్రకారం అధికారులు ప్రవేశపెట్టిన అంశాన్ని స్థాయీ సంఘం సభ్యులు తిరిస్కరించినా, 15 రోజుల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలా లేని పక్షంలో అధికారుల ప్రతిపాదన ఆమోదించినట్లుగా చట్టంలో వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు తెలివిగా.. సిబ్బంది సరఫరా టెండర్లను రెండుగా విభజించి ఇద్దరు గుత్తేదార్లకు కట్టబెట్టారు. బిల్లు రూ.50 లక్షలు దాటితే కౌన్సిల్‌లోనే ఆమోదించాలి. ఈ నేపథ్యంలో ఒక్కొక్క గుత్తేదారుకు అన్నీ కలిపి రూ.34,12,500 మించకుండా చెల్లింపు ఉండేలా టెండర్లు పిలవడంలోనే అధికారులు వ్యూహరచన చేశారు. ఆ ప్రతిపాదన గత నెల 22న జరిగిన స్థాయీ సంఘం లో వాయిదా పడినా, తర్వాత జరిగే సమావేశంలో సభ్యులు దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆటోమేటిక్‌గానే ఆమోదం దక్కుతుంది. ఈ స్థితిలో సభ్యులు సవరణ ప్రతిపాదన ఆహ్వానిస్తారా? కౌన్సిల్‌కు రిఫర్‌ చేస్తారా? అధికారుల అక్రమాల ప్రతిపాదనకు వంత పలుకుతారా? వంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఎఫ్‌ఆర్‌ఎస్‌ ప్రకారమే చెల్లిస్తాం

రత్నావళి, చీఫ్‌ మెడికల్‌ అధికారి

వాహనడిపో అధికారులు టెండర్లు పిలిచారు. గుత్తేదార్లు పూర్తిస్థాయిలో  సిబ్బందిని సరఫరా చేయలేదు. మూడు షిప్టులకు ఒకరు 150 మందిని, మరొకరు 300 మందిని సరఫరా చేశారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ కింద ఎంతమంది ఎన్నిరోజులు వచ్చారో లెక్కించి మాత్రమే డబ్బులు చెల్లిస్తాము. స్థాయీ సంఘం ముందుంచిన ప్రతిపాదన అంశాన్ని సభ్యుల దృష్టికి కూడా తెచ్చి చర్చించాం. కొద్ది సమయం తీసుకుని తగిన నిర్ణయం తీసుకుందామని వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు