logo

ప్రేమ పేరుతో.. కత్తులు దూశారు..

ముక్కు మొహం తెలియకుండానే ఇన్‌స్టాగ్రాంలో పరిచయాలు. ఆపై ప్రేమ చిగురింపులు. కొన్నాళ్లు ప్రేమ పేరుతో స్నేహాలు.. ఆ తర్వాత కొంతకాలానికి వారి మధ్య అనుమానాలు.. అపోహలు ఏర్పడి చివరకు కత్తులు దూసుకునే వరకు వెళుతున్నాయి.

Updated : 07 Dec 2022 08:32 IST

నాడు రమ్య..  నేడు తపస్వి ఉదంతాలు

ఈనాడు, అమరావతి

తపస్వి (పాతచిత్రం)

ముక్కు మొహం తెలియకుండానే ఇన్‌స్టాగ్రాంలో పరిచయాలు. ఆపై ప్రేమ చిగురింపులు. కొన్నాళ్లు ప్రేమ పేరుతో స్నేహాలు.. ఆ తర్వాత కొంతకాలానికి వారి మధ్య అనుమానాలు.. అపోహలు ఏర్పడి చివరకు కత్తులు దూసుకునే వరకు వెళుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన బీడీఎస్‌ విద్యార్థిని తపస్వి పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో తన స్నేహితురాలి ఇంట్లోనే ప్రేమోన్మాది జ్ఞానేశ్వర్‌ చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఇలాంటి ఘటనే ఏడాది కిందట గుంటూరు నగరంలో జరిగింది. బీటెక్‌ విద్యార్థిని రమ్య కూడా అప్పట్లో ప్రేమికుడు శశికృష్ణ చేతిలో దారుణంగా హత్యకు గురైంది. ఈ రెండు ఉదంతాల్లోనూ పెళ్లికి నిరాకరించడంతోనే ప్రేమికులు ఉన్మాదుల్లా మారి ఏకంగా ప్రాణాలు తీసేశారు.  

వదిలేయాలని ప్రాధేయపడినా..

మనం ఎవరితో స్నేహం చేస్తున్నామనేది ముఖ్యం. దాన్ని గమనించకుండా వ్యవహరిస్తే సమాజంలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంజినీరింగ్‌ ఫెయిలై నేర స్వభావానికి అలవాటుపడిన జ్ఞానేశ్వర్‌తో తపస్వికి తొలుత ఇన్‌స్టాగ్రాంలో స్నేహం మొదలైంది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమికులుగా మారారు. కొంతకాలం కలిసి ఉన్నారు. కారణాలేమైనా వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో తనను పట్టించుకోవడం లేదని, దూరం పెడుతోందని అక్కసుతో ఏకంగా తపస్విపై సర్జికల్‌ బ్లేడ్‌తో దాడికి తెగబడి నరరూప రాక్షసుడిలా వ్యవహరించారు. ఇకనైనా తనను వదిలేయాలని ఆ యువతి ప్రాధేయపడినా ఏమాత్రం లెక్కపెట్టలేదు. కొన ఊపిరితో ఉంటే ఒక గది నుంచి మరో గదిలోకి లాక్కెళ్లి మరీ గొంతుకోసి చంపేయడం చూస్తుంటే ప్రేమోన్మాదులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థమౌతోంది. పదో తరగతి కూడా పాస్‌కాని శశికృష్ణ అనే యువకుడి ప్రేమలో రమ్య పడింది. తర్వాత అతడి గురించి తెలుసుకుని దూరం పెట్టింది. దాన్ని తట్టుకోలేక ఏకంగా నడిరోడ్డుపైనే కత్తితో దాడి చేశాడు.


ఎవరితో స్నేహం చేస్తున్నామో తెలుసుకోవాలి

ప్రేమించడం తప్పు కాదు. అయితే ఎవరితో ప్రేమలో పడ్డాం. వారి స్వభావం ఏమిటి? వారి గత నేపథ్యం వంటివి తెలుసుకుని వ్యవహరిస్తే ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం యువతి, యువకుల్లో ఇది లోపిస్తోందని, గుడ్డిగా నమ్మేస్తున్నారని, చివరకు వారేమిటో తెలుసుకునేలోపే ఘోరం జరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి యువతీ, యువకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమించిన వ్యక్తి స్వభావం, వారి ప్రవర్తన, వారి వ్యవహారశైలిపై అమ్మాయిలకు స్పష్టమైన అవగాహన ఉండాలి.

ప్రేమించినంత మాత్రాన పెళ్లి చేసుకోలేదని హత్యలకు పాల్పడటం, హతమార్చటం సరికాదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే మహిళా సంఘాలు, రాజకీయ పక్షాలు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తుంటాయి. సమాజంలో ప్రేమ పేరుతో జరిగే అఘాయిత్యాలను ధైర్యంగా ఎదిరించాలి. తక్కెళ్లపాడులో తపస్విపై ప్రేమోన్మాది దాడి చేస్తున్న సమయంలో స్నేహితురాలు సహాయం కోసం కేకలు వేసినా కొందరు స్పందించలేదు. మరికొందరు విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకుని ప్రేమోన్మాది దాడి నుంచి ఆ యువతిని తప్పించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పంట పొలాలతో ప్రశాంత వాతావరణం ఉండే తమ గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి దారుణంగా హత్యకు గురికావడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు