logo

తెలుగు రాయలేరు.. కూడికా చేయలేరు..!

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఇటీవల విజయవాడలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు.

Updated : 07 Dec 2022 05:12 IST

తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల పరిస్థితి దారుణం

ప్రభుత్వ బడుల్లో పడిపోయిన ప్రమాణాలు

ఉన్నతాధికారుల తనిఖీల్లో వెలుగులోకి 

ఈనాడు, అమరావతి

ఇటీవల ఓ పాఠశాలలో  విద్యార్థులను పరీక్షిస్తున్న ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌

న్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఇటీవల విజయవాడలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. తొమ్మిదో తరగతి పిల్లలు.. తెలుగులో పేర్లు కూడా సరిగా రాయలేకపోవడం కనిపించింది. తెలుగు పుస్తకాన్ని చూసి కూడా చదవలేకపోతున్నారు. మూడంకెల చిన్న కూడికను చేయలేని పరిస్థితి కనిపించింది. ఆర్‌జేడీ దుక్కిపాటి మధుసూదనరావు కూడా కొండపల్లిలోని జడ్పీ బాలుర,  బాలికల పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. అక్కడా ఇదే పరిస్థితి కనిపించింది.

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాలు దారుణంగా పడిపోయాయి. కొవిడ్‌ ముందు కంటే విద్యా ప్రమాణాల పరిస్థితి ప్రస్తుతం మరింత దిగజారిపోయింది.  ఎనిమిదో తరగతి నుంచి పది వరకూ విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది తెలుగు, ఆంగ్లం ఓ మోస్తరుగా కూడా చదవలేకపోతున్నారు. పక్కన కూర్చున్న విద్యార్థి పేరు కూడా రాయలేకపోతున్నారు. దీంతో వీళ్లు పదో తరగతి పరీక్షలు ఎలా ఉత్తీర్ణులవుతారంటూ అధికారులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా ప్రమాణాలు మెరుగు పర్చేందుకు సరైన చర్యలు చేపట్టకపోవడం, కనీసం పర్యవేక్షణ కూడా లేకపోవడంతో పరిస్థితి ఇలా మారింది.

ఎవరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు..

గతంలో ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు.. తరగతిలో 5-10 మంది పిల్లలు మాత్రం సమాధానాలు సరిగా చెప్పలేకపోయేవారు. మిగతా వారు బాగానే చెప్పేవారు. ప్రస్తుతం తరగతిలో ఉన్న పిల్లలందరి పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. తెలుగు సంధులు, సమాసాలు, ఆంగ్లం డిక్టేషన్‌, హిందీ రీడింగ్‌.. ఇలా అన్నింటిలోనూ  తడబడుతున్నారు. అధికారులు ఒక ప్రశ్న అడిగి.. తరగతిలో ఉన్న ఏ విద్యార్థి అయినా దీనికి సమాధానం చెబుతారా.. అని అడుగుతుంటే.. ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తాము బాగానే చెబుతున్నామని,  ద్యార్థులు ఆసక్తి చూపించడం బాగా తగ్గిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్లు పూర్తిగా విద్యాబోధన గాడి తప్పడంతో.. విద్యార్థులు తరగతిలో కూర్చోవడానికీ ఇబ్బందిగా భావిస్తున్నారన్నారు.

దృష్టి పెట్టేదెలా? ప్రస్తుతం ఉపాధ్యాయులకు తరగతి గదుల్లో బోధన కంటే.. యాప్‌లలో అప్‌లోడ్‌లు, నాడు నేడు పనుల బాధ్యతలను చూడడం వంటివే ముఖ్యమనేలా విద్యాశాఖ అధికారుల తీరు ఉంటోంది. కొవిడ్‌ తర్వాత విద్యార్థుల్లోని సామర్థ్యాలు బాగా తగ్గిపోయాయి. వారిని తిరిగి గతంలో మాదిరిగా మార్చాలంటే.. మరింత ఎక్కువ దృష్టి పెట్టేలా చేయాలి. ఈ విషయంలో అధికారులు విఫలమవ్వడం వల్లే ఫలితాలు ఇలా కనిపిస్తున్నాయి.  

పర్యవేక్షణ సరిగా లేక..

కృష్ణాలో ఉయ్యూరు, ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ, తిరువూరుకు ఉప విద్యాశాఖ అధికారులు లేరు. ప్రభుత్వ పరీక్షలను పర్యవేక్షించే.. అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏసీ) కూడా ఎన్టీఆర్‌ జిల్లాలో లేరు. సమగ్ర శిక్ష  ఏపీసీ పోస్టు కూడా ఖాళీగానే ఉంది.  అర్హులైన అధికారులతో వీటిని భర్తీ చేసి, పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. 


ఫలితాలు దారుణం

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ఈ ఏడాది 55 వేల మంది వరకూ పదో తరగతి పరీక్షలను రాయబోతున్నారు. గత ఏడాది  ఫలితాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా ఉత్తీర్ణత శాతం అత్యంత దారుణంగా పడిపోయింది. కేవలం 65.21శాతం మాత్రమే నమోదైంది. ఒక్క విద్యార్థి కూడా పాసవ్వని పాఠశాలలు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది ఉండడం గమనార్హం. కనీసం ఇప్పటి నుంచైనా పది విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి, పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రయత్నం చేయకుంటే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని